calender_icon.png 25 February, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడ్డు ఆరోగ్యానికి మంచిదేనా?

23-02-2025 12:00:00 AM

రోజు ఒక గుడ్డు తింటే ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండొచ్చని నిపుణులు చెబుతుంటారు. అలాగే ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకొక్కటి తినాలని కొందరంటే.. వారానికి ఒక గుడ్డు తింటే సరిపోతుందని మరికొందరు అంటుంటారు. ఇలా వివిధ భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే అసలు గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదో? కాదో? చాలామందికి తెలియదు.

గుడ్లు క్రమం తప్పకుండా తినడం ఆరోగ్యానికి ఏమాత్రం హానికరం కాదని పరిశోధకులు తెలిపారు. 

గుడ్డు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని చాలామంది నమ్మకం. ఇది శరీరానికి హానికరమని కూడా అనుకుంటారు. అయితే గుడ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 

గుడ్డు క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. కాబట్టి వారానికి ఆరు గుడ్లు తినవచ్చు. అయితే రోజుకు రెండు కంటే ఎక్కువ తినవద్దు. బదులుగా ప్రతీరోజూ మీ ఆహారంలో ఒక గుడ్డును చేర్చుకోవచ్చు. గుడ్డును వేయించినా, ఉడకబెట్టినా, ఆమ్లెట్ వేసి తీసుకున్నా శరీరానికి మేలు చేస్తాయి. 

గుండె ఆరోగ్యానికి దోహదపడే బీటైన్, కోలిన్ వంటి అనేక పోషకాలు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి.

రోజుకు ఒక గుడ్డు తినడం ద్వారా గుండె వ్యాధులు, పక్షవాతం ముప్పును తగ్గించుకోవచ్చని చైనాలో పది లక్షల మందిపై చేసిన ఒక అధ్యయనంలో తేలింది. 

వయసు పెరిగేకొద్ది కొంటి చూపు తగ్గడం సాధారణం. కంటి ఆరోగ్యాన్ని కాపాడే పోషకాలు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. గుడ్డులోని పచ్చసొనలో కెరోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే లుటీన్, జియాక్సంతిన్‌లు కళ్ల శుక్లాలు రాకుండా కాపాడతాయి. కంటి చూపుకు ఎంతో అవసరమైన విటమిన్ ఎ లభిస్తుంది. 

శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, సరిగ్గా పనిచేయడానికి కోలిన్ అనే పోషకం అవసరం. కణ త్వచాలు ఏర్పడానికి, జ్ఞాపకశక్తితో పాటు మెదడు పనితీరు సరిగ్గా ఉండటానికి కోలిన్ ప్రధాన పాత్ర వహిస్తుంది. అందుకే గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా గుడ్డు తీసుకోవాలి.