06-04-2025 12:00:00 AM
నీరు శరీరానికి అమృతం. ఇది తగ్గినా.. ఎక్కువైనా ప్రమాదమే అంటున్నారు నిపుణులు. ఇక వేసవి కాలం వచ్చేసరికి మరింత నీరు అవసరమవుతుంది. ఉక్కపోత కారణంగా చెమట ద్వారా చాలా నీరు బయటికి వచ్చేస్తుంటుంది. కాబట్టి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం ముఖ్యం. కాని చాలామంది తగినంత నీరు తాగరు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలొస్తాయి. ప్రతిరోజు ఒక వ్యక్తి ఎంత నీరు తాగాలి.. ఎక్కువ తాగితే ఏమవుతుంది? అనే విషయాలను తెలుసుకుందాం..
ఎండాకాలంలో ఎంత నీరు తాగాలి అనే సందేహం అందరికీ రావొచ్చు.. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేసవిలో పెద్దలు సాధారణంగా రోజుకు 8 గ్లాసుల నీరు తాగాలి. అంటే ప్రతిరోజూ 2 లీటర్ల నీరు తాగాలి. అయితే ఈ పరిమాణం వ్యక్తి శారీరక శ్రమ, వాతావరణం, ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఎక్కువ వ్యాయామం లేదా శారీరకంగా కష్టతరమైన పని చేసేవారైతే ఎక్కువ నీరు తాగాలి. అలాగే వేడి వాతావరణంలో నివసించే వారు అధిక మోతాదులో నీరు తీసుకోవాలి.
తక్కువ తాగితే?
మన శరీరంలో జీవక్రియలన్నీ సక్రమంగా జరగాలంటే తగినంత నీరు తప్పక తీసుకోవాల్సిందే శరీరం హైడ్రేట్ చేసి ఆరోగ్యంగా ఉంచడంలో నీటిదే ప్రధాన పాత్ర. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించి తక్కువ నీరు తాగితే శరీరంలో అవయవాల పనితీరు దెబ్బతింటుంది. చిన్న సమస్యలతో మొదలై తీవ్రమైన వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది.
శరీరానికి కావాల్సినంత నీరు అందించకపో తే అలసట, తలతిరగడం, తలనొప్పి, నోరు పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు తీవ్రమైతే మూర్ఛపోయే ప్రమా దం పెరుగుతుంది. ఈ స్థితినే డీహైడ్రేషన్ అంటారు. ముఖ్యంగా వేసవికాలంలో ప్రతి ఒక్కరూ రోజూ పుష్కలంగా నీరు తాగాలి.
జీర్ణక్రియకు నీరు చాలా ముఖ్యం. తక్కువ నీరు తాగే వాళ్లనే ఎక్కువగా మలబద్ధకం సమస్య వేధిస్తూ ఉంటుంది. వేసవిలో ఈ సమస్యకు అదనంగా గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి కడుపుకు సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు.
మూత్రపిండాలు శరీరం నుంచి విషపూరిత పదార్థాలు, వ్యర్థాలను తొలగించి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి సక్రమంగా పనిచేయడంలో నీటిదే ముఖ్యమైన పాత్ర. ఒకవేళ తక్కువ నీరు తాగితే కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా మూత్రపిండాల్లో రాళ్లు లేదా ఇతర మూత్ర సమస్యలు వచ్చే ప్రమాదముంది. కాబట్టి.. ఈ సమస్యల నివారించేందుకు ఒక వ్యక్తి రోజుకు కనీసం 2 లీటర్ల నీరైనా తాగాలి.
పదే పదే తాగితే?
ఎండాకాలంలో పదే పదే దాహం ఉందని అవసరానికి మించి నీరు తాగడం మంచిది కాదు. అలా చేస్తే తలనొప్పి, కడుపులో అసౌకర్యం, పదే పదే మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం ఒక్కటే కాదు. రక్తంలో సోడియం లెవల్స్ పెరిగిపోయి హైపోనెట్రేమియా అనే సమస్య వస్తుంది. కొన్నిసార్లు వాటర్ పాయిజనింగ్ కారణంగా శ్వాసక్రియకు తీవ్ర ఆటంకం కలుగుతుంది.