ఒలింపిక్స్‌లో అన్నింటికంటే ఉద్వేగ భరితమైన క్షణం విజేతలకు పతక ప్రదానం. ఆటలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా స్వర్ణం, రజతం, కాంస్యం పేరుతో పతకాలు అందించడం ఆనవాయితీ. ఈసారి పారిస్ క్రీడల్లో అథ్లెట్లకు అందించనున్న పతకాలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రఖ్యాత ఈఫిల్ టవర్ నిర్మాణంలో ఉపయోగించిన మేలి ఇనుమును పతకాల్లో చేర్చారు. గుండ్రటి పతకాల మధ్యలో షడ్భుజాకారంలో ఇనుమును ఉపయోగించారు. దానిపై పారిస్ 2024 లోగోను ముద్రించారు. పసిడి పతకంలో 92.5 శాతం వెండిని ఉపయోగిస్తారు. ఒలింపిక్ కమిటీ నిబంధనల ప్రకారం 6 గ్రాముల బంగారాన్ని పతకానికి పూతగా పూశారు.