calender_icon.png 28 January, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదమా? ఖేదమా?

23-07-2024 12:40:01 AM

నేడు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్

  1. గంపెడాశలతో వాణిజ్య, వ్యాపార వర్గాలు
  2. కేంద్రం ఇచ్చే నిధుల కోసం రాష్ట్రాల చూపులు
  3. ఏపీ, బీహార్‌కు కనీసం ప్రత్యేక ప్యాకేజీ దక్కేనా?
  4. అదే ఆశల పల్లకిలో వివిధ రాష్ట్రాలు
  5. ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు

న్యూఢిల్లీ, జూలై 22: కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో ౨౦౨౪ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నది. సోమవారం సమావేశాలు ప్రారంభంకాగా, ౨౦౨౩ ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంటు బయట ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. వచ్చే బడ్జెట్ దేశ ఆర్థిక బలోపేతానికి, వికసిత్ భారత్ లక్ష్యాలకు పునాదులు వేస్తుందని తెలిపారు.

దీంతో ప్రభుత్వం బడ్జెట్‌లో ఎవరికి వరాలిస్తుంది? ఎవరికి వడ్డన ఉంటుంది? అనే అంశంపై ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్న సర్వేలు వెలువడుతున్న నేపథ్యంలో ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకొంటుందోనని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

రాష్ట్రాల ఎదురుచూపులు

సామాన్య ప్రజలతోపాటు పలు రాష్ట్రాలు కూడా కేంద్రం ఏమైనా నిధులు ఇస్తుందేమోనని ఎదురుచూస్తున్నాయి. చట్టప్రకారం రావాల్సివాటిని సాధించుకోవటంతోపాటు అదనంగా నిధులు రాబట్టేందుకు ఇప్పటికే విన్నపాలు చేశాయి. ౨౦౪౭ నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలన్న కృత నిశ్చయం తో ఉన్నామని ప్రధాని స్వయంగా ప్రకటించినందున.. వ్యాపార, వాణిజ్య వర్గాలు ఆసక్తిగా ఉన్నాయి. తాత్కాలిక తాయిలాలు కాకుండా దీర్ఘకాలిక అభివృద్ధి, వృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఏ సెక్టార్‌కు ఎలాంటి విధానం ప్రకటిస్తారోనని ఎదురుచూస్తున్నాయి. 

అన్ని అంశాలపై చర్చిద్దాం

పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. బడ్జెట్‌తోపాటు విద్య, వైద్యం, ఎంఎస్‌ఎంఈ, రైల్వేస్, ఆహారశుద్ధి తదితర శాఖలపై ౨౦ గంటల చర్చకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. పలువురు విపక్ష సభ్యులు మరికొ న్ని అంశాలను ప్రస్తావించినట్టు సమాచారం.