calender_icon.png 23 September, 2024 | 1:58 AM

సమ, సత్వర న్యాయం అందని ద్రాక్షేనా?

17-07-2024 12:05:00 AM

రోమ్ శాసనాన్ని చారిత్రాత్మకంగా స్వీకరించిన జూలై 17న ‘అంతర్జాతీయ న్యాయ దినోత్సవం’గా 1998 నుంచి ప్రతి ఏటా జరు పుకుంటున్నారు. దీని ప్రధాన ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా సమన్యాయం అందరికీ అందించాలి. దోషులకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా శిక్ష విధించడం, మారణహోమం బాధితులకు న్యాయం చేయడం, యుద్ధ నేరాలకు శిక్ష వేయడం, మానవత్వానికి వ్యతిరేకంగా పని చేసిన వారికి తగిన శిక్ష విధించడం వంటివి ముఖ్యాంశాలుగా ఈ దినోత్సవం జరుపుకొంటారు. అన్నిటికం టే ముఖ్యంగా న్యాయంపై ప్రజలకు అవగాహన కల్పించడం దీని లక్ష్యం.

139 దేశాలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రత్యేక, తీవ్రమైన సమస్యలపై అంతర్జాతీయ న్యాయస్థానం ప్రత్యేక దృష్టి సారిస్తుంది. వివిధ దేశాల మధ్య శాంతి, భద్రత, శ్రేయస్సులను కాపాడేందుకు యత్నిస్తుంది. అయితే, ఇటీవలి కాలంలో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని అతిక్రమించి కొన్ని దేశాలు, ప్రభుత్వాధినేతలు నడుచుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు తాజా ఉదాహరణ. మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం.

అనేకమంది అమాయక ప్రజలు, బాలలు, మహిళలు బలైపోతున్న పరిస్థితి. ఉగ్రవాద దాడులు, వివిధ దేశాల్లో సైన్యం పాలనలో ప్రజల ఇబ్బందులు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, లింగ, జాతి వివక్షతలపైనా అంతర్జాతీయ న్యాయస్థానం పారదర్శకంగా స్పందించవలసిన అవసరం ఏర్పడింది. 

భారతదేశంలో న్యాయం ప్రజలందరికీ సమానంగా అందించేందుకు సుప్రీంకోర్టు, హైకోర్టు, సబార్డినేట్ కోర్టులు పని చేస్తున్నా యి. జనాభాకు అనుగుణం గా తగినన్ని కోర్టులు, న్యాయమూర్తులు లేక సత్వర న్యా యం ప్రజలందరికీ అందడం లేదు. అందువల్లే ‘సరైన న్యా యం తగిన సమయంలో అందకపోతే అన్యాయం జరిగినటే’్ల అని అంటారు. దేశం లో వివిధ రకాల కోర్టులు, న్యాయమూర్తుల సంఖ్య పెంచాలి. ఇప్పటికే అన్ని కోర్టుల్లో లక్షల సంఖ్యలో పెండింగ్ కేసులు ఉన్నాయి.

జైళ్లు నేరస్తులతో, విచారణ ఖైదీలతో కిక్కిరిసి పోతున్నాయి. సామాన్య ప్రజలకు న్యాయం ఆమడ దూరంలోనే ఉంటున్నది. దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు పెద్ద ప్రభావం చూపుతున్నాయి. పారదర్శకత కొరవడుతున్నది. ఈ విధానం ఇకనైనా మారాలి. దేశంలోని చట్టసభల సభ్యుల్లో అనేకమంది వివిధ నేరారోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో పటిష్టమైన న్యాయచట్టాలు ఎలా వస్తాయనే ఆందోళన కలుగుతున్నది. ఈ ఏడాది జులై 1 నుంచి దేశంలో నూతన న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చాయి.

వీటిపై కొన్ని నిరసనలు వ్యక్తమయ్యాయి. ఏది ఏమైనా, ప్రజలందరికీ సత్వర న్యాయం అందించేందుకు ప్రభుత్వాలు సహకరించాలి. లోక్ అదాలత్, వినియోగదారుల ఫోరమ్‌లు తరచూ నిర్వహించి ప్రజలకు న్యాయం అందించాలి. దక్షిణ భారతదేశంలోనూ సుప్రీంకోర్టు అదనపు బెంచ్ ఏర్పాటు చేయడం మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. జడ్జీల నియామకంలో రాజకీయ ప్రమేయం లేకుండా చూడాలి. స్వతంత్ర న్యాయస్థానం ఉండాలని మన రాజ్యాంగం నిర్దేశించింది. 

-ఐ. ప్రసాదరావు