calender_icon.png 17 March, 2025 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మామూళ్లిస్తేనే అనుమతి?

17-12-2024 12:00:00 AM

  1. బల్దియా ఆదాయానికి టౌన్ ప్లానింగ్ అధికారుల గండి 
  2. కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న అవినీతి!

కామారెడ్డి, డిసెంబర్ 16 (విజయక్రాంతి): పర్యవేక్షించాల్సిన అధికారులే మామూళ్లు దండుకుంటూ బల్దియా ఆదాయానికి గండి కొడుతున్నారు. మామూళ్లు ఇస్తే నే భవన నిర్మాణాలకు అనుమతి ఇస్తున్నారు. లేదంటే నిలివేస్తున్నారు.

కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపల్ కార్యాల యాల్లో భవన నిర్మాణాల అనుమతి కోసం టౌన్‌ప్లానింగ్ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కాసుల లెక్క తేలిన తర్వాతే పనులకు ఓకే చెబుతున్నారు. బల్దియాల ఆదాయానికి గండీ కొడుతున్న అధికారులపై చర్యలు తీసుకునేది ఎవరు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

నిజామాబాద్‌లో రూ.కోట్ల అవినీతి!

నిజామాబాద్ నగర పాలక సంస్థలో ఇటీవల టౌన్ ప్లానింగ్ అధికారి నరేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డప్పుడు కోట్ల రూపాయల అవినీతి సొమ్ము బట్టబయలు అయిన విషయం విధితమే. ఇలాంటి ఘటనలు ఒక వైపు జరుగుతున్నా టౌన్‌ప్లానింగ్ విభాగం లో పనిచేసే అధికారులు మాత్రం మామూళ్లకు కక్కుర్తి పడుతున్నారు. అందిన కాడాకి బేరాన్ని కుదుర్చుకుంటున్నారు.

ఎన్నో ఏం డ్లు  ప్రయాసపడి ప్లాట్ కొనుగోలు చేసి, ఇల్లు నిర్మాణం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్న ప్రజల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులకు టౌన్‌ప్లానింగ్ అధికారుల అనుమతి ఇవ్వాలంటే మామూళ్లు ముట్టజెప్పాల్సిందే. లేదంటే కుంటి సాకులతో పాటు అధికంగా మున్సిపల్‌కు డబ్బు లు చెల్లించాలని ఖరాకండిగా చెబుతున్నారు. 

రూ.వేలల్లో చెల్లింపులు!

కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల ఓ వ్యక్తి ఇంటి అనుమతుల కోసం  వెళ్లగా.. ప్లాట్‌కు చార్జీల రూపంలో రూ.లక్ష ల్లో కట్టాల్సి వస్తుందని టౌన్‌ప్లానింగ్ అధికారులు తెలిపారు. తన వల్ల కాదని ఆ వ్యక్తి చెప్పడంతో ప్రైవేటు టౌన్ ప్లానర్‌ను సంప్రదించాలని చెప్పడంతో అక్కడికి వెళ్లాడు. ఆ టౌన్ ప్లానర్ రూ.లక్షల్లో కట్టుకుంటావా? వేలాల్లో చెల్లించుకుంటావా అని అనడంతో సదరు వ్యక్తి విస్తుపోయాడు.

ప్రైవేటు టౌన్ ప్లానర్ చెప్పినట్టు విని మళ్లీ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి రూ.60 వేలు చెల్లిస్తే అనుమతులు వచ్చాయని సదరు వ్యక్తి తెలిపాడు. ఇలాంటి ఘటనలు కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల పరిధిలో అనేకం జరగుతున్నాయి. టౌన్‌ప్లానింగ్ అధికారులు ప్రైవేటు ప్లానర్లతో చేతులు కలిపి అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండీ కొడుతున్నారు. 

అధికారుల వత్తాసు 

కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల పరిధిలో నూతన భవనాల నిర్మాణానికి అనుమతికోసం మున్సిపల్ కార్యాలయాలకు వెళ్తే ప్లాట్లు, ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించలేదని రూ.లక్షల్లో చెల్లిస్తే అనుమతులు ఇస్తామని టౌన్ ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్‌లను కలిస్తే తమకు తెలియదని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులను సంప్రదిస్తే ప్లాట్ వద్దకు వచ్చి పరిశీలిస్తారని చెబుతుండటం గమనార్హం.

పర్యవేక్షించాల్సిన అధికారులే మామూళ్లకు అలవాటు పడి అక్రమాలను నిరోధించలేకపోతున్నారు. అక్రమాలకు పాల్పడే అధికారులకు ఉన్నతాధికారులే వత్తాసు పలుకుతున్నారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు కొత్త భవనాలు నిర్మించాలంటే స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించాల్సిందే. లేకుంటే ఏవో కొర్రిలుపెట్టి అనుమతులు ఇవ్వడం లేదు. వీరికి తోడుగా స్థానిక ప్రజాప్రతినిధులు చేతులు కలుపడంతో అడిగే వారు ఎవరు లేరనే ధీమాలో ఉన్నారు. 

ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం

భవన నిర్మాణాల అనుమతుల కోసం టౌన్ ప్లా నింగ్ అధికారులు మామూళ్లు తీసుకుంటున్నట్టు ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం. టౌన్ ప్లానింగ్ అధికారులతోపాటు అనుమతులపై పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల శాఖ ఏఈలతో కలిసి పర్యవేక్షణ చేస్తారు. అన్ని రకాల పత్రాలు ఉంటే తప్పకుండా అనుమతులు ఇస్తాం. 

 శ్రీహరిరాజు, ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి