17-04-2025 02:15:34 AM
సుప్రీం గుస్సా
కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై ఘాటు వ్యాఖ్యలు
* ‘అధికారులు పర్యావరణ చట్టాలను విస్మరిస్తూ ఉంటే వారు జైలుశిక్ష అనుభవించడానికి తాత్కాలిక జైలును నిర్మించాల్సి వస్తుంది..అక్కడ అధికారులు ఆనందంగా గడపవచ్చు..’
భూములను మార్టిగేజ్ చేశారా.. అమ్ముకున్నారా? అనేది మాకు అనవసరం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కంచ గచ్చిబౌలి భూములను మార్టిగేజ్ చేశారా? అమ్ముకున్నారా? అనే ది తమకు అనవసరమని, చెట్లు కొట్టేముందు పర్యావరణ చట్టం 1986 ప్రకా రం అనుమతులు తీసుకున్నారా? లేదా?.. వందల ఎకరాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడుస్తారు? అనేది తమకు చెప్పాలని జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు.
అభివృద్ధి చేసుకోవాలనుకుంటే అనుమతి తీసుకోవాలని, అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టివేసినట్టు తేలితే ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అక్కడి పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారో నాలుగు వారాల్లో ప్రణాళిక సిద్ధం చేయాలని, తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేశారు. అప్పటివరకు స్టేటస్ కో విధించారు.
కంచ గచ్చిబౌలి భూముల అంశంపై జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ద్వి సభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈసందర్భంగా చెట్లు కొట్టివేసే ముందు అనుమతులు తీసుకున్నారో లేదో స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ.. జామాయిల్ తరహా చెట్లు, పొదలను అనుమతి తీసుకునే తొలగించామని చెప్పారు.
‘కంచ గచ్చిబౌలి భూముల్లో ఏనుగులు ఉన్నాయనే ఫొటోలు బయటకు వచ్చాయని, తాను అక్కడ ఏనుగులు చూడగలిగితే బాగుండు.’ అని సింఘ్వీ వ్యాఖ్యానిం చారు. దీనికి ధర్మాసనం సంతృప్తి చెందకుండా చెట్లను నరికివేయడానికి అనుమతి ఉందా? లేదా? పర్యావరణాన్ని కాపాడటానికే తామిక్కడ ఉన్నామని సూటిగా ప్రశ్నిం చింది. చండీగఢ్‌లోని సుఖ్నా సరస్సును రక్షించడానికి ఒకప్పుడు ఒక హౌసింగ్ ప్రాజెక్టును నిలిపివేసినట్లు కోర్టు గుర్తుచేసింది.
కంచ గచ్చిబౌలి చెట్ల నరికివేతకు తగిన అనుమతులు ఉన్నాయని సింఘ్వీ చెప్పినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం ఒప్పుకోక.. మూడు సెలవు దినాల్లో చెట్లను నరికివేయడానికి తొందరపడటం దేనికి అని ప్రశ్నించింది. ఈ ప్రక్రియ 2024లోనే ప్రారంభమైందని, ఇటీవలే ప్రారంభించినట్లు చిత్రీకరిస్తున్నారని సింఘ్వీ సమాధానమిచ్చారు.
ఈ ప్రాజెక్టు విలువ రూ.50వేల కోట్లు అని, లక్ష ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన కోర్టుకు చెప్పారు. దానికి ధర్మాసనం ప్రతిస్పందిస్తూ.. ప్రాజెక్టు విలువ, ఉద్యోగాల విషయం తమకు అవసరం లేదని, ఆ ప్రాంతంలో పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారనేది కావాలని పేర్కొంది. బుల్డోజర్లతో ఎంతో విలువైన అడవిని తుడిచిపెట్టడంపై తాము ఆందోళన చెందుతున్నామంది.
దీనికి అమికస్ క్యూరీ స్పందిస్తూ.. తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందని, ప్రభుత్వం దాని ప్రకారం వ్యవహరించిందని ఎత్తిచూపింది. ఇది సుప్రీంతీర్పుకు విరుద్ధమని, సీఎస్‌ను అఫిడవిట్‌ను దాఖలు చేయమని ఆదేశించాలని కోర్టును కోరారు. సుప్రీంకోర్టు గత విచారణలో ప్రభుత్వ చర్యలకు సీఎస్ బాధ్యత వహించాలని పేర్కొన్నట్టు చెప్పారు.
సుప్రీం ఏర్పాటు చేసిన కేంద్ర సాధికార కమిటీ ‘చాలా కలవరపరిచేదిగా ఉంది’ అని నివేదించినట్టు ధర్మాసనం పేర్కొంది. ‘అధికారులు పర్యావరణ చట్టాలను విస్మరిస్తూ ఉంటే వారు జైలుశిక్ష అనుభవించడానికి తాత్కాలిక జైలును నిర్మించాల్సి వస్తుంది.. అక్కడ అధికారులు ఆనందంగా గడపవచ్చు..’ అని కోర్టు వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.
పర్యావరణ పరిరక్షణకు అక్కడి వన్యప్రాణి అధికారి ఏం చేస్తున్నారో తమకు చెప్పాలన్నారు. ఈ భూమిని రూ.10వేల కోట్లకు మార్టిగేజ్ చేశారని కేంద్ర సాధికార కమిటీ నివేదికలో చెప్పిందని ఈసందర్భంగా అమికస్ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దానికి ధర్మాసనం.. ఆ భూములను మార్టిగేజ్ చేశారా? అమ్ముకున్నారా? అనేది తమకు అనవసరమని, చెట్లు కొట్టివేసే ముందు అనుమతి ఉందా? లేదా అనేదే ముఖ్యమన్నారు.
వంద ఎకరాల్లో పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారు? ఎంత కాలంలో చేస్తారు? జంతుజాలాన్ని ఎలా సంరక్షిస్తారో స్పష్టంగా చెప్పాలని, దీనిపై నాలుగు వారాల్లో ప్రణాళిక ఫైల్ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసి అప్పటివరకు స్టేటస్ కో (యథాతథ స్థితి) విధించింది.