calender_icon.png 15 October, 2024 | 8:50 AM

సాంకేతిక లోపమా.. కుట్ర కోణమా?

15-10-2024 02:17:12 AM

భాగమతి రైలు ప్రమాదంపై విచారణ ముమ్మరం

సిగ్నలింగ్ గేర్, స్విచ్ పాయింట్‌ను ట్యాంపర్ చేసినట్లు అనుమానాలు

తమిళనాడు, అక్టోబర్ 14: తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా కవర్తెపెట్టు రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రైలు ప్రమాదంపై ఎన్‌ఐఏ, రైల్వే భద్రతా విభా గం విచారణను ముమ్మరం చేశాయి. ప్రమాదానికి కారణం.. సాంకేతిక లోపమా? సిగ్నలిం గ్ వైఫల్యమా? కుట్ర కోణమా? మరే ఇతర కారణాలేమైనా ఉన్నయా అని తేల్చేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

కర్ణాటకలోని మైసూర్ నుంచి దర్భంగాకు బయల్దేరిన భాగమతి ఎక్స్‌ప్రెస్ శుక్రవారం తమిళనాడులోని కవర్తెపెట్టు సమీపంలో ప్రధాన లైన్‌లో కాకుండా లూప్‌లైన్‌లోకి వెళ్లి గూడ్స్‌రైలును ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోయినా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

12 బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయాయి. కాగా, రైలు ప్రమాదంపై బుధ, గురువారాల్లో రైల్వే ఉన్నతాధికారులు దర్యాప్తు చేయనున్న నేపథ్యంలో ఘటనకు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే తమను సంప్రదించాలని దక్షిణ మధ్య రైల్వే సోషల్ మీడియా వేదికగా ప్రయాణికులు, స్థానికులకు సూచించింది.

బాలేశ్వర్‌లోనూ..

గతేడాది ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన ప్రమాదం కూడా ఇదే తరహాలో ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదం వెనుక ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో ఎన్‌ఐఏ అధికారులు కూపీ లాగుతున్నారు. రైల్వేస్టేష్‌లో రికార్డయిన డాటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.