కర్రలకు విద్యుత్ తీగలు, బల్బులను కట్టి కలెక్టరేట్ ఎదుట ధర్నా...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఈ సమాజంలో ఆదివాసీలుగా మేము పుట్టడమే నేరమా అని తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్ ప్రశ్నించారు. అదిలాబాద్ జిల్లా కేంద్రం చుట్టూ కరెంటు ఉంటుంది, కానీ ఆదివాసులు నివసించే కొమురం భీం కాలనీలో మాత్రం కరెంటు లేదు. మేం ఏం నేరం చేశామని, మాకెందుకు ఈ శిక్ష... ఈ సమాజంలో మేము మనుషులం కాదా అని వాపోయారు. కొమురం భీం కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ), కొమరం భీం కాలనీ నిర్వహణ కమిటీ ఆధర్యంలో గురువారం ఆందోళనకు దిగారు. ముందుగా కొమురం భీం కాలనీ నుండి కలెక్టరేట్ వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు.
కర్రలకు చెడిపోయిన విద్యుత్ తీగలు, బల్బులు కట్టి వాటిని చేతపట్టుకొని కలెక్టరేట్ ప్రధాన గేట్ ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఆందోళనకారుల వద్దకు వచ్చి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీలు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా కొమురం భీం కాలనీలో నివాసం ఉంటున్న ఆదివాసులకు గృహ జ్యోతి పథకం ద్వారా వెంటనే కరెంటు సౌకర్యం కల్పించి, మంచినీళ్లు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కొమురం భీం కాలనీలో నివాసముంటున్న ఆదివాసులకు రాష్ట్ర ప్రభుతం, సీఎం రేవంత్ రెడ్డి మానవత దృక్పథంతో స్పందించి, తక్షణంగా కరెంట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా అక్కడ మౌలిక సదుపాయాలైన తాగునీరు, రోడ్లు, విద్యా, వైద్యం మొదలగు సమస్యలు పరిష్కరించాలని కోరారు. గత 11 సంవత్సరాల నుంచి చీకటిలో విష సర్పాలు, తేళ్లతో పోరాడుతూ చీకటి పడితే చాలు భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామన్నారు. మా పిల్లల చదువుల కోసం.. మా భవిష్యత్తు కోసం ఇప్పుడిప్పుడే అడవి వదిలి పట్టణాలకు బతకడానికి వస్తే ఎలాంటి సౌకర్యము లేకపోయినా ప్రభుత్వ భూమి అయిన కొమురం భీం కాలనీ ఏర్పాటు చేసి నివసిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ జిల్లా ప్రదాన కార్యదరి వెట్టి మనోజ్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక, విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సలాం వరుణ్, మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు ఉయిక ఇంద్ర, పలువురు ఆదివాసీలు పాల్గొన్నారు.