26-03-2025 12:56:56 AM
హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): రాష్ర్టంలో 480 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వేసవి సమయంలో నీటిఎద్దడి నివారణపై చర్యలు చేపట్టకుండా అందాల పోటీలు నిర్వహిస్తారా..? అని మాజీమంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పర్యాటక శాఖ పద్దుపై జరిగిన చర్చలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఫార్ములా ఈ కార్ రేస్ ద్వారా రూ.700 కోట్ల ఆదాయం వచ్చిందని, రూ.46 కోట్ల ఖర్చు చేస్తే రాద్ధాంతం చేసి రేస్ నిర్వహణ జరగకుండా చేశారని, ఇప్పడు రూ.54 కోట్లతో మిస్ వరల్డ్ పోటీలు ఎలా నిర్వహిస్తారని నిలదీశారు.
మిస్ వరల్డ్ పోటీల ద్వారా ఆదా యం ఎలా వస్తుందో, కొలువులు ఎలా వస్తాయో పర్యాటక శాఖ మంత్రి వివరించాలని డిమాండ్ చేశారు. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలు అవుట్ డేటెడ్ అయ్యాయని చెప్పారు. ఇదే మంత్రి, బీఆర్‌ఎస్ హయాంలోనూ పర్యాటక మంత్రిగా ఉన్నారని అన్నారు.
అంబేద్కర్ విగ్రహన్ని చూడటానికి ఏప్రిల్ 14 నుంచి అయినా పర్యాటకులను ఆహ్వానించాలని సూచించారు. తాము ఓఆర్‌ఆర్ టీవోటీ పద్ధతిలో 33 సంవత్సరాలు లీజ్‌కు ఇస్తే ప్రశ్నించినవారు, ఇప్పుడు పర్యాటక శాఖకు చెందిన భూములను 99 సంవత్సారాల లీజుకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.