calender_icon.png 15 March, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్గత పోరు అంత ముఖ్యమా?

17-12-2024 12:00:00 AM

రాజకీయ అంతర్గత పోరు మన దేశాన్ని కుంగదీస్తున్న తీరు అత్యంత విచారకరం. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రోజులు గడుస్తున్న కొద్దీ ఇప్పటి వరకు దేశప్రజల ప్రధాన సమస్యలైన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విద్యా ప్రమాణా లు, యువతలో నైపుణ్యాల కొరత వంటి అంశాలకు అర్థవంతమైన చర్చలతో కూడిన ప్రాధాన్యం లభిస్తుందా అని ఎదురుచూస్తు న్న వారికి నిరాశే మిగులుతున్నది. అటు బీజే పీ, ఇటు కాంగ్రెస్ ప్రధాన పక్షాలు పరస్పరం ‘దేశద్రోహ ఆరోపణల’ను చేసుకోవడమే తప్ప గుణాత్మక, నిర్మాణాత్మక హుందాతనాన్ని ప్రదర్శించకపోవడం దురదృష్టకరం.

కారణాలు ఏవైతేనేం, అటు మీర్ జాఫర్, ఇటు జైచంద్ వారసులు మన దేశంలో విపరీతంగా విస్తరిస్తున్నారన్నది స్పష్టం. అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభ రెండింటిలోనూ రెండు ప్రధాన పార్టీల సభ్యులు ఎవరికి వారు తమ పంతాలు నెగ్గించుకోవడం వైపే అధిక మొగ్గు చూపుతుండడం వల్ల పార్లమెంటు  సమయం అప్రధానంగా వ్యయమ వుతున్నది. ఈ రెండు పార్టీలు ‘నువ్వంటే నువ్వు’ అంటూ ‘విదేశీ శక్తులతో కుమ్మక్కై దేశానికి ద్రోహం చేశాయని’ ఒకరి నొకరు ఆరోపణలు గుప్పించుకుంటూ, తమను తాము బొంగురు కంఠాలతో విమర్శించుకుంటున్నారు.

గౌతమ్ అదానీ అనంత శక్తుల కు బీజేపీ తొత్తుగా మారడాన్ని కాంగ్రెస్ ఖండిస్తుంటే,  బీజేపీ జార్జ్ సోరోస్ కార్డుతో ముందుకు వచ్చింది. దాని పూర్తి ఆరోపణ ఏమిటంటే, కాంగ్రెస్ సోరోస్ ఫౌండేషన్‌కు కీలుబొమ్మ అని, దీని ఏకైక ఉ ద్దేశ్యం భారతదేశం పరువు తీయడం, ప్రస్తుత ప్రజాస్వా మ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయడంలానే కనిపిస్తున్నదనేది.

వ్యూహాత్మక విధానాలపై చర్చలు ఏవి?

ప్రపంచవ్యాప్తంగా, పలు కీలక సంఘటనలు జరుగుతున్నాయి. ఇవేమీ పట్టనట్టు మ న ఉన్నత స్థాయి చట్టసభలు వ్యవహరిస్తుండడం దేశంలోని సామాన్యులకైతే మింగుడు పడడం లేదు.. సిరియా ఇటీవలె గందరగోళంలో పడింది. రష్యా- యుద్ధం నిరంతరంగా కొనసాగుతున్నది. మధ్యప్రా చ్యం గుండా ఇజ్రాయెల్ వినాశకర విధ్వం సం ముగిసే సూచన కనిపించడం లేదు. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రం ప్ కొత్తగా బాధ్యతలు చేపట్టనున్నారు.

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులు హింసాత్మక సంఘటనలకు బలిపశువులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో చర్చించడానికి పెద్ద గా సమస్యలే లేనట్టుగా మన ప్రజాప్రతినిధు లు వ్యవహరించడం దురదృష్టకరం. ఒక ప్ర ధాన అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతూ, ప్ర పంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరున్న భారత్ ఇలా ఆరోపణ ‘అంతర్గత పోటీ’లతోకూడిన ‘టెక్టోని క్ (భారీస్థాయి) తిరుగుబాట్ల’ను ఎదుర్కోవడంలో బిజీగా ఉండడం హాస్యాత్మకమవుతు న్నది.

దేశాభివృద్ధి తాలూకు వ్యూహాత్మక విధానం ఎలా ఉండాలనే దానిపై గౌరవనీయ సభ్యుల మధ్య ఆద ర్శవంతమైన, లోతైన చర్చలు జరగాలని ఆశించడం ప్రగతికాముకుల లోపం కాదుకదా!

రెండు ముఖ్యమైన రాజకీయ పార్టీలు ఒకదాని కొకటి ‘దేశద్రోహి’గా నిరూపించుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నట్టు కనిపిస్తు న్నది. పార్లమెంటు వేదికగా జరుగుతున్న తీవ్రమైన ఈ ‘అంతర్గత యుద్ధం’లోని పరమార్థం అధికార యావ తప్ప మరొకటి ఉన్న ట్టు లేదు. విదేశాల్లో చీకటి ఒప్పందాలు, తెలియని శక్తులతో అవినీతికి పాల్పడడాలు, దేశంలో విస్తరిస్తున్న ‘విదేశీ హస్తాలు’, వారి క్రియాశీలక పాత్రలు.. వంటివన్నీ మరోవైపు మన దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయి.

ఇవేవీ చర్చనీయ అంశాలు కావని చెప్పలేం. కానీ, వాటికి ఇంకా సమయం రానట్టుంది. ఉన్న కొద్దిపాటి విలువైన చట్టసభల సమయాన్ని వ్యక్తిగత ఆరోపణలకు కేటాయించేస్తున్నారన్నదే ఇక్కడ తీవ్ర అభ్యంతరకరం. నిజానికి పై రెండు పార్టీలు చేసుకుంటున్న ఆరోపణలు, ప్రత్యారోపణల వివరాలు ఇక్కడ అంత ముఖ్యమైనవి కాకపోవచ్చు. దురదృష్టకరమైన వ్యంగ్యం ఏమిటంటే, ఈ అంతులేని యుద్ధంలో రెండు పార్టీలు అటు అదానీ లేదా ఇటు సోరోస్‌ను సమర్థిస్తూ ఉండడం. ఇది మరింత విచారకరం.

పారదర్శక విచారణలు జరగాలి

రాజ్యాంగం ప్రకారం భారతదేశ సువిశా ల, విస్తృత ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడిన పై రెండు ప్రధాన రాజకీయ పార్టీలు, వాటికి వ్యతిరేకంగా పని చేస్తున్నాయంటూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండడం గమనార్హం. ఇటువంటి పరిస్థితిలో నిష్పాక్షిక నాయకులుగా వ్యవహరించాలని అనుకునే వారు ఏం చేస్తారు? ఊరికే సమయం వృథా చేయకుండా పారదర్శక విచారణను ఎదుర్కొనడానికి, జరిపించడానికి ముందుకు వస్తారు. ఇది ఎందుకు జరగడం లేదు? అన్న ప్రశ్నకు మౌనమే సమాధానం.

భారతీయ విద్యుత్ సరఫరా ఒప్పందాలను పొం దేందుకు లంచాలు చెల్లించే పథకంలో పాల్గొన్నందుకు, దేశంలో నిధుల సేకరణ వేళ పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించినందుకు అదానీ గ్రూప్‌పై ఇటీవల అమెరిక న్ కోర్టు అభియోగాలు మోపింది. ఈ అభియోగ పత్రం ప్రకారం, ప్రతిపాదనలను సులభతరం చేయడానికి లంచాలు భారతీయ అధికారులకు అందినట్టు చెబుతున్నా రు. నిజానికి ఇది తీవ్రమైన విషయమే.

అదానీ గ్రూప్ వ్యాపార విధానాలపై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చాయి. బీజేపీ కి అదానీ సన్నిహితంగా ఉంటున్న కారణం గా, వాటిలోని కొన్ని పెద్ద ప్రాజెక్టుల నుంచి ప్రయోజనం పొందుతున్నారనే వాదనలు బలంగా ఉన్నాయి. అదానీ గ్రూప్ ఈ ఆరోపణలన్నింటినీ తిప్పి కొట్టింది. విచారణ సమయంలో దాని అభిప్రాయాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. అదే విధంగా, సోరోస్ ఫౌండేషన్ విషయం. ఇది అంతర్జాతీయం గా ఓ సైద్ధాంతిక ఎజెండాను కలిగిఉండడమేకాక దానిని కొనసాగించడానికి కావలసి నంత ఆర్థికశక్తిని సైతం కలిగిఉంది.

కాంగ్రెస్‌తో అనుసంధానితమైన ఏదైనా సంస్థ ‘సోరోస్ ఫౌండేషన్’ నుంచి నిధులు పొందినట్లయితే, అదికూడా విచారణార్హమే అవు తుంది. సోరోస్ అమలు చేయాలనుకుంటున్న భారత వ్యతిరేక ప్రచారాన్ని బలోపే తం చేయడానికి ఆ ఫౌండేషన్ ఇచ్చిన నిధులను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుందని బీజేపీ ఆరోపణ. ఇలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణలకు చెందిన చర్చలు చట్టసభలలో ప్రశాంతంగా సాగుతాయని ఆశించ లేం. నిష్పాక్షిక విచారణ, నిర్దాక్షిణ్య దర్యాప్తు జరిగితే తప్ప వాస్తవాలు తేలవు. పార్లమెం టు సమావేశాలలో ఒకరిపై ఒకరు కేకలు వేసుకోవడంతో సభా కార్యకలాపాలు నిమిషాల వ్యవధిలో వాయిదా పడటం తప్ప మరేమైనా సాధిస్తున్నామా?

పార్టీలు పునస్సమీక్షించుకోవాలి

రాజకీయ నాయకులను విశ్వసించాలంటే- భారత జాతీయ ప్రయోజనాలు లేదా తత్సంబంధమైన తీవ్ర అవినీతి వ్యవహారాలు, ఆరోపణలకు సంబంధించిన- ఇలాం టి విషయాలపై సుమోటోగా గుర్తించడానికి న్యాయవ్యవస్థ అరుదుగా స్వీయజోక్యం చేసుకుంటుంది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత సహా జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన ప్రశ్న తాలూకు ప్రమేయం ఉన్నట్లయితే, రాజ్యాంగంలో దాని ఆదేశిక పాత్ర ప్రకారం న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవచ్చు.

అప్పుడు సరైన దర్యాప్తుకు అవకా శం ఏర్పడుతుంది. అయితే, ఈ నేపథ్యంలో మన దేశ రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి? అన్న ప్రశ్నకూడా జనిస్తుంది. దేశం లో మరే ఇతర ముఖ్య సమస్యలే లేవా చట్టసభలలో చర్చించడానికి? నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికం, అసమానతలు, విద్యా ప్రమాణాలు, నైపుణ్యాల పెంపుదల, వ్యవసాయ అశాంతి వంటి తీవ్ర సమస్యలు పై రెండు పార్టీలకు సీరియస్ విషయాలుగా ఇంకా ఎందుకు కనిపించడం లేదు?

అయితే, పైన పేర్కొన్న ఆరోపణలు, ప్రత్యారోపణల్లో పార్టీల ప్రమేయాలకన్నా వ్యక్తుల పాత్రలే ప్రధానంగా వినిపిస్తున్నాయి. వ్యక్తిగత ఆరోపణలు చేసేటప్పుడు అందుకు తగిన నిర్దిష్ట మైన ఆధారాలూ అవసరం. ప్రజలు గమనిస్తున్నారన్న స్పృహ పెరిగితే తప్ప, నాయకు లలో విధానాత్మక మార్పు రాదు. ఇప్పటికైనా ఆయా పార్టీలు ఉన్నత చట్టసభలలో లేవనెత్త వలసిన అంశాలు, వాటికోసం కేటాయించుకోవాల్సిన నిర్దుష్ట సమయాలు, ప్రాధాన్యాలను నిర్ణయించుకోవాలి. చీటికి మాటికి సభలు వాయిదా వేయడం వల్ల ప్రజాధనం వృథా తప్ప మరో ప్రయోజనం ఉండదన్న సంగతిని అందరూ గ్రహించాలి.

-దోర్బల బాలశేఖరశర్మ