calender_icon.png 18 November, 2024 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండ్లను కూల్చడమే ఇందిరమ్మ పాలనా?

18-11-2024 01:29:41 AM

  1. నిర్వాసితులకు బుల్డోజర్ల భయం.. కంటిమీద కునుకు కరువు
  2. సీఎం రేవంత్ మూసీ పరీవాహకంలో పాదయాత్ర చేయాలి..
  3. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌజ్‌కు పరిమితం 
  4. మంత్రిగా నాడు కేటీఆర్ ట్యాంక్ ప్రక్షాళన అన్నారు..
  5. గ్లాస్ నీటినైనా శుద్ధి చేయలేదు..
  6. మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 17 (విజయక్రాంతి): ఇండ్ల కూల్చడమే ఇందిరమ్మ పాలనా అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీశారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్ల కూల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ చేపట్టిన ‘మూసీ నిద్ర’లో భాగంగా చివరి రోజు శనివారం రాత్రి గోల్నాక తులసీరాంనగర్‌లో నిద్ర చేశారు.

అంతకుముందు ఆయన నిర్వాసితురాలు శంకరమ్మ అనే మహిళ ఇంట మీడియా సమావేశం నిర్వహించారు. ఎప్పుడు బుల్డోజర్లు వచ్చి తమ ఇండ్లను కూల్చుతాయోనని మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. మూసీ ప్రాజెక్టును ప్రకటించినప్పటి నుంచి రందితో 10 మంది గుండెపోటుతో మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం ఇండ్లను కూల్చకుండా మూసీ ప్రక్షాళన చేయాలని సూచించారు.

సంఘ విద్రోహ శక్తులు, దేశద్రోహులపై బుల్డోజర్లు ఎక్కించాలే కానీ, నిర్వాసితుల ఇండ్లపై కాదని అభిప్రాయపడ్డారు. పేదల ఇండ్లను కూల్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా..? కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తారా? అంటూ ప్రజలకు తెలియజేయాలని సవాల్ విసిరారు. పేదల ఇండ్లు కూల్చకుండా సుందరీకరణ చేస్తే తాను, తమ పార్లమెంట్ సభ్యుల ఒక నెల జీతాన్ని మూసీ ప్రాజెక్టు కోసం అందిస్తామని ప్రకటించారు.

తాము నది సుందరీకరణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. సీఎంకు దమ్ముంటే మూసీ నిర్వాసిత ప్రాంతాల్లో పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు అండగా నిలిచేందుకు బీజేపీ నగరంలో 20 చోట్ల మూసీ నిద్ర చేపట్టిందని స్పష్టం చేశారు. సర్కార్ డీపీఆర్, సొమ్ము లేకుండానే ప్రజలతో ఇండ్లను ఖాళీ చేయిస్తే వారు నష్ట పోతారన్నారు. 

సీఎం రేవంత్‌రెడ్డి పదవి బాధ్యతలు తీసుకుని ఏడాది అవుతుందని, మూసీ డీపీఆర్ సిద్ధం కావడానికి మరో రెండేండ్లు పడుతుందన్నారు. రేవంత్ హయాంలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలగలరా? అని సీఎంకు సవాల్ విసిరారు. తమ పాలనాలో ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తానని బీరాలు పలికిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఇప్పుడు పదవి ఊడంగానే ఫాంహౌజ్‌కు వెళ్లారని ఎద్దేవా చేశారు.

ట్యాంక్ బండ్‌ను ప్రక్షాళన చేస్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి హాదాలో కేసీఆర్ హామీ చేస్తానని అన్నారని గుర్తుచేశారు. కానీ, ఒక్క గ్లాసు నీటినైనా శుద్ధి చేయలేకపోయారని చురకలంటించారు. సీఎం ఇంటి నుంచి వచ్చే మురుగు సైతం మూసీలో కలుస్తుందని, పారిశ్రామిక ప్రాంతాల నుంచీ మురుగు వచ్చి చేరుతుందన్నారు. అలాంటి మూసీలో నాలుగేండ్లలో కృష్ణా, గోదావరి నీళ్లు ఎలా పారిస్తారో సీఎం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

నిజాం పాలకులు కట్టించిన విధంగానే నదిపై రిటర్నింగ్ వాల్‌ను కట్టించాలని సూచించారు. అలాగే బీజేపీ నేతలు ఎన్. రాంచందర్‌రావు ఘట్‌కేసర్, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ రామంతాపూర్,  చింతల రాంచంద్రారెడ్డి కమలా నగర్, కామారెడ్డి వెంకట రమణారెడ్డి గౌలిగూ, ఇలా ఇతర నాయకులు కలిసి  మొత్తం 20 ప్రాంతాల్లో  మూసీ నిద్ర చేశారు.