calender_icon.png 20 October, 2024 | 3:07 AM

అన్నింటికి కారణం ఆయనేనా?

20-10-2024 12:51:51 AM

సూర్యాపేట/సూర్యాపేట(విజయక్రాంతి), అక్టోబర్ 19 : సూర్యాపేట జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కంటే  అధికంగా ప్రభుత్వ, ఫారెస్ట్ భూములు హుజూర్‌నగర్ నియోజవర్గంలో ఉంటాయి. ఇక్కడ గత కొన్నేండ్లుగా భూములు అన్యాక్రాంతం అవుతూనే వస్తున్నాయి. ప్రభుత్వ భూములు ఇతరుల కబ్జాలోకి పోవడమే కాకుండా అక్రమంగా పట్టాల మార్పిడి కూడా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉండేవి. వీటిని నిజం చేస్తూ ఇటీవల హుజూర్‌నగర్ మండలంలో ఓ తహసీల్దార్, ధరణి ఆపరేటర్‌తో కలిసి చేసిన ప్రభుత్వ భూమి అక్రమ పట్టాల విషయం వెలుగులోకి వచ్చింది.

అయితే సదరు తహసీల్దార్ ఇదే నియోజకవర్గంలో ఎక్కవ కాలం విధులు నిర్వహించింది. ఈమె విధులు నిర్వహించిన ప్రతి మండలంలో ప్రభుత్వ, ఫారెస్ట్ భూములు ఉన్నాయి. ఆయా మండలాల్లోనూ అక్రమంగా పట్టాల మార్పిడి జగిన ట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూములతోపాటు ప్రైవేటు భూములు కూడా భూ మితో సంబంధం లేని వ్యక్తులకు పట్టాలు చేసిందని, ఈ దందా వెనకు ఓ మాజీ ప్రజా ప్రతినిధి ప్రోత్బలం ఉన్నదనే ఆరోపణలు వినబడుతున్నాయి. పోలీసుల ఆదుపులో ఉన్న తహసీల్దార్ విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడించినట్టు సమాచారం. 

వెలుగులోకి ఇలా

సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ ప్రభుత్వ భూముల వివరాలను పరిశీలిస్తున్న సమయంలో హుజుర్‌నగర్ మండలంలో ఓ సర్వే నంబర్‌పై అనుమానం రావడంతో విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో అప్పటి తహసీల్దార్ వజ్రాల జయశ్రీ, ధరణి ఆపరేటర్ జగదీశ్ కలిసి 36.23 ఎకరాల ప్రభుత్వ భూమిను ఆపరేటర్ బంధువుల పేరుతో బదలాయింపు చేసినట్లు గుర్తించారు. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో వారిని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపెట్టినట్లు తెలుస్తున్నది. గత ప్రభుత్వంలోని ఓ ప్రజాప్ర తినిధి ఒత్తిడి కారణంగానే ప్రభుత్వ భూ ముల పట్టా మార్పిడి చేసినట్లు తహసీల్దార్ పోలీస్‌లకు వివరించినట్లు సమాచారం. ఈ ఒక్క మండలమే కాకుండా అనేక మండలాల్లో ప్రభుత్వ భూములకు ప్రైవేటు పట్టాలు ఇచ్చినట్లుగా విస్తుపోయే నిజాలు వివరించినట్లు తెలుస్తున్నది. 

గరిడేపల్లి మండలంలోనూ..

వజ్రాల జయశ్రీ తహసీల్దార్‌గా పని చేసిన ప్రతి చోట పలు రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. గరిడేపల్లి తహసీల్దార్‌గా ఉన్న సమయంలో చాలా మందికి అక్రమంగా భూములు పట్టా చేసి భారీగా నగదును తీసుకున్నట్లు తెలుస్తున్నది. రాయినిగూడెం రెవెన్యూ పరిధిలో ఓ వ్యక్తికి చెరువు శిఖం భూమిని వేరే సర్వే నంబర్‌పై ఎక్కించి లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ చెరువు శిఖంను వేరే సర్వే నంబర్‌లలో ఎక్కించడంతో అసలు రైతులకు ఆర్‌ఎస్‌ఆర్ ఖాళీగా లేని కారణంగా తహసీల్దార్ కార్యాలయానికి ఎన్ని సార్లు తిరిగినా ఫలితం దక్కలేదు.

దీంతో ఓ రైతు తహసీల్దార్ అరెస్టయిన రోజే గరిడేపల్లిలో ఆమె చేసిన అవినీతిపై కలెక్టర్‌కు ఫిర్యా దు చేస్తానంటూ ఓ వాట్సప్ గ్రూప్‌లో మేస్సేజ్ పెట్టినట్లు తెలిసింది. అలాగే సర్వా రం గ్రామంలో భూమిలేని వ్యక్తి తన తాత పేరు మీదు ఐదెకరాల భూమి ఉన్నదని, దానిని తన పేరు మీదకు మార్పిడి చేయాలనగా అతని వద్ద లంచం తీసుకుని ఎటు వంటి పరిశీలన చేయకుండా నేరుగా పట్టా పుస్తకాలు జారీ చేసినట్లు సమాచారం. సద రు వ్యక్తి ఆ పట్టా పుస్తకాలతో గరిడేపల్లిలోని ఓ బ్యాంక్‌లో లోన్ కోసం దరఖాస్తు చేసుకోగా ఆ బ్యాంక్ మేనేజర్ భూమి గురించి గ్రామంలో ఆరా తీశారు.

గ్రామంలోని చాలా ఇండ్లు అదే సర్వే నంబర్‌లో ఉన్నాయని, అసలు భూమి కేవలం 30 గుంటలు మాత్రమేనని తెలియడంతో నాటి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ పట్టా పుస్తకాలను తహసీల్దార్ తెప్పించుకుని రద్దు చేసిందనే విషయం వెలుగులోకి వస్తున్నది. గానుగుబండ, అప్పన్నపేట, కుతుబ్‌షాపురం గ్రామాల్లో అసలు అమెండ్‌మెంట్‌లు లేకుండా నేరుగా పుస్తకాలను ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కుతుబ్‌షాపురం గ్రామ పరిధిలో సుమారు 11 ఎకరాల ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన ఓ నాయకుడి పేరు మీద ఎక్కించాలని నాటి ప్రజాప్రతినిధి ఆదేశించడంతో ఎటువంటి ఆధారాలు లేకుండా పని పూర్తి చేసిందంటూ గ్రామంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.   

మఠంపల్లిలోనూ మాయాజాలం

మఠంపల్లి మండలంలోని గుర్రంపోడులో సర్వే నంబర్ 540లో జరిగిన అక్రమాలకు సంబంధించి ఇద్దరు తహసీల్దార్‌లు సస్పెండ్ అయ్యారు. నాటి తహసీల్దార్ సస్పెండ్ అయిన తర్వాత హుజూర్‌నగర్‌లో విధులు నిర్వహిస్తున్న జయశ్రీనే  ఇన్‌చార్జి తహసీల్దార్‌గా నియమించారు. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చల్లోకి ఎక్కిన 540 ప్రభుత్వ భూమి అంశం తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ఉద్దేశంతోనే సదరు ప్రజాప్రతినిధి ఉన్నతాధికారులతో మాట్లాడి ఆమెను ఇన్‌చార్జిగా నియమించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆమె ఇన్‌చార్జిగా ఉన్న సమయంలోనే రికార్డులలో కొంతమేర మాయాజాలం జరిగిందనే ప్రచారం సాగుతున్నది. కొందరికి ప్రభుత్వ భూమిని కట్టబెట్టిందనే విషయం బయటకు పొక్కుతున్నది. పోలీస్‌ల విచారణలో తేలిన అసలు విషయాలు బయటకు వస్తే బాధితులు ఫిర్యాదులు చేసే అవకాశులున్నాయి. 

పట్టాల కోసం పైసలు 

హుజుర్‌నగర్ పట్టణంలోని ఫణిగిరి గట్టు వద్ద జర్నలిస్ట్‌లకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇచ్చింది. అయితే తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న 20 నుంచి 30 మందికి ఒక్కొక్కరి వద్ద సుమారు రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు తహసీల్దార్ తీసుకుని వారికి పట్టాలు చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు వ్యక్తుల పేరున ఉన్న ప్లాట్లను కూడా కుంటలుగా రిజిస్ట్రేషన్లు చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. హుజూర్‌నగర్ పట్టణంలోని బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు, వివిధ పదవుల్లో ఉన్న నాయకుల పేరున మున్సిపల్, రెవెన్యూ స్థలాలు తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. దీనిలో భాగంగా ఓ మండల స్థాయి నాయకుడు తమ కార్యకర్తలకు సుమారు ఇరవై మందికి పైగా ప్రభుత్వ భూమి పట్టా చేయించినట్లు తెలుస్తున్నది. లింగగిరి, బూరుగడ్డ, అమరవరం, శ్రీనివాసపురం, గరిడేపల్లి, కుతుబ్‌షాపురం గ్రామాల పరిధిలోని ప్రభుత్వ  భూములను కూడా పట్టాలుగా మార్చినట్లు ఆరోపణలున్నాయి. 

ఆ పదెకరాల నమోదు ఆమె పనేనా? 

గరిడేపల్లి సర్వారం గ్రామంలో గల 313 సర్వే నంబర్‌లో 1970కి పూర్వం 24.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండేది. అయితే 1970 పహాణిలో అందులోని 10 ఎకరాల భూమిని నర్సింహారావు పేరుగల వ్యక్తిపై గతంలో అక్రమంగా ఎక్కించినట్లు సమాచారం. ఆయన చనిపోగా సర్వే నంబర్ 19, 316తో పాటు 313లోని పదెకరాలను సైతం కలిపి 2008లో అమైండ్‌మెంట్ ద్వారా ఆయన కుమారుడు సుందర రాఘవరావుకు పౌతి చేసినట్లు తెలుస్తున్నది. అయితే 2010లో ఆ భూమిని సర్వారంకు చెందిన ఓ వ్యక్తి నామమాత్రపు నగదును చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిసింది. ఆ డాక్యుమెంట్‌పై అనుమానాలు వచ్చిన నాటి రెవెన్యూ అధికారులు రికార్డులను పరిశీలించగా అందులో తేడాలు రావడంతో దానిని మ్యుటేషన్ చేయకుండా నిలిపివేశారు. అయితే అదే డాక్యుమెంట్‌ను ఆధారం చేసుకుని జయశ్రీ నేరుగా 10 ఎకరాలకు సంబంధించిన నూతన పాస్ పుస్తకం మంజూరు చేసినట్లు స్థానికుల ద్వారా తెలుస్తున్నది. ఈ భూమిని కొనుగోలు చేసేందుకు నాటి అధికార పార్టీ నాయకుల చొరవతోనే పని జరిగినట్లు సమాచారం. తదుపరి ఆ భూమిని కొనుగోలు చేసిన కొందరు నాయకులు నాటి ప్రజాప్రతినిధి సహకారంతో ఓ క్రషర్ మిల్లును ఏర్పాటు చేసి ధరణిలో ఎక్కించి కొంత కాలం నడిపిన తదుపరి కోట్ల రూపాయలకు అమ్ముకుని లబ్ధిపొందినట్టు తెలుస్తున్నది.