calender_icon.png 26 November, 2024 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-1 కు గూగుల్ ప్రామాణికమా?

21-10-2024 01:12:22 AM

  1. వికీపీడీయా చూసి సమాధానాలు రాయాలా?
  2. తెలుగు అకాడమీ పుస్తకాలు పనికిరావా?
  3. నిరుద్యోగులతో సీఎం ఎందుకు మాట్లాడరు?
  4. హిందూ నిరసనకారులపై లాఠీచార్జీ చేస్తారా?
  5. అన్యమతస్థుల ప్రార్థనాలయాల్లో శబ్దాలు వినిపించవా?
  6. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 20 (విజయక్రాంతి): సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం ధ్వంసం విషయంలో హిందూ సంఘాలపై పోలీసుల దమనకాండ, అశోక్‌నగర్‌లో నిరుద్యోగులు, విద్యార్థులపై లాఠీచార్జీ చేయటం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకార ధోరణికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

నిరుద్యోగులు వారం రోజులుగా అశోక్‌నగర్‌లో నిరసన తెలుపుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప.. ఆయన సచివాలయం గేటు దాటడంలేదని విమర్శించారు. ఆదివారం కిషన్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

నిరుద్యోగులు, రైతాంగం, పేదలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరుద్యోగులు, విద్యార్థులతో మాట్లాడి వారి బాధను అర్థం చేసుకుంటే వచ్చే నష్టం ఏమిటని 

 ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి, రాహుల్ గాం ధీ ఎన్నికలకు ముందు అశోక్‌నగర్ లైబ్రరీకి వెళ్లి నిరుద్యోగులకు హామీలు ఇచ్చి వచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు అక్కడికి వెళ్లడం లేదని నిలదీశారు. ధైర్యం లేకపోతే పోలీసులను వెంట బెట్టుకొని వెళ్లి నిరుద్యోగులతో చర్చించాలని సూచించారు.

పోటీపరీక్షల ప్రశ్నపత్రం రూపకల్పనకు ఒక కార్యాచరణ ప్రణాళిక ఉండాలని అన్నారు. ప్రభుత్వం కనీస ఇంగితజ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. వికీపీడియా, గూగూల్ ఆధారంగా పరీక్షలు రాయమంటారా? అని ప్రశ్నించారు.

గ్రూప్స్ పరీక్షల్లో దేని ఆధారంగా మార్కులు వేయబోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వికీపీడియానా లేక తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా మార్కులు వేస్తారా? అని ప్రశ్నించారు. తెలుగు అకాడమీ పుస్తకాల జవాబులు చెల్లవని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. 

దేవాలయంలో రక్తాభిషేకం చేస్తారా? నిరసనకారులు టెర్రరిస్టులా?

సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి హిందూ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. వినాయకచవితి, బోనాలు, దేవీ నవరాత్రుల సందర్భంగా అనేకమందిపై కేసులు పెట్టించారని మండిపడ్డారు. డీజేలు, సౌండ్‌లు, మండపాల నిర్వాహకులను వేధించి అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

అన్యమతస్థుల ప్రార్థన కేంద్రాల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వస్తున్న శబ్ధాలేవీ పోలీసులకు, సీఎంకు వినపడవా? అని నిలదీశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు ఇక్కడ మతపరమైన శిక్షణ పొంది హిందూ దేవాలయంపై దాడి చేస్తే సీఎం, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణం, అమ్మవారిని కొలిస్తే, హిందూ దేవుళ్ల పండుగలు ఇలా దేవున్ని కొలిస్తే రాహుల్ గాంధీకి ఎందుకు బాధ వేస్తుందని నిలదీశారు. ముత్యాలమ్మ నిరసనకారులపై ఎందుకంత పాశవికంగా దాడి చేయాల్సిన వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల దాడిలో గాయపడిన ఒక కార్యకర్తకు 9 కుట్లు పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులు అతన్ని ఇంట్లో వదిలివెళ్లారని, కానీ తాము పరామర్శించి అతని పరిస్థితి విషమిస్తుండడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. దేవాలయంలోనే హిందువుల రక్తాభిషేకం చేస్తారా? అని మండిపడ్డారు.

వీరంతా ఏమైనా ఉగ్రవాదులా? అని నిలదీశారు. అసలు మోటివేషన్ క్లాసుల పేరుతో అంతమంది గుడిపక్కనే హిందూ వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంటే పోలీసులు, ప్రభుత్వం ఏం చేస్తున్నదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.  

జీవో 29పై అనుమానాలు

గతంలో ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఒకే విధానం ఉండేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో విడివిడిగా రెండుసార్లు హాల్ టిక్కెట్లను ఎందుకు తీసుకోవాలని, ఇందులో ఉన్న మతలబేంటని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పరీక్షలు హైదరాబాద్‌లోనే ఎందుకు నిర్వహించాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని అన్నారు. రేవంత్‌రెడ్డిది కనీసం పరీక్షలు కూడా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు. జీవో 29 విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని, అందులో దాపరికం లేకపోతే ఎందుకు పిలిచి మాట్లాడటం లేదని నిలదీశారు.

కాంగ్రెస్ హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు లాఠీచార్జీలు, అక్రమ జీవోలు, అక్రమంగా ఇళ్ల కూల్చివేతలను ముందుపెట్టి కాలం గడిపే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. హామీలు అమలు చేసే సత్తా, దిశా నిర్దేశం, ఆర్థిక వనరులు ప్రభుత్వానికి లేవని.. అందుకే కొత్త సమస్యలు సృష్టించి తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. 

నిరుద్యోగులతో ఎందకు మాట్లాడరు?

అశోక్‌నగర్ లైబ్రరీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ కలిసి నిరుద్యోగులకు కబుర్లు చెప్పి.. ఇప్పుడు వారిపైనే లాఠీచార్జీకి దిగుతారా? అని కిషన్‌రెడ్డి నిలదీశారు. ఆందోళన చేస్తున్న వారం తా మన పిల్లలే అని, వారితో ఒకసారి చర్చిస్తే పోయేదేముందని ప్రశ్నించారు. వారి బాధను కూడా అర్థం చేసుకోవాలని సూచించారు.

సీఎం తీరు చూస్తే బీఆర్‌ఎస్ విధానాన్ని కాం గ్రెస్ పార్టీ అవలంభిస్తుందన్నట్లు ఉన్నదని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో పోటీ పరీక్షలు, టీఎస్‌పీఎస్సీ, పేపర్‌లీక్, నిర్వహించిన పరీక్షలు రద్దు చేయడం, ప్రకటించిన ఫలితాలు వెన క్కు తీసుకోవడం, లొసుగులు, లోటుపాట్లు, తప్పిదాలు  అనేకం జరిగా యని.. అదే విధానం కాంగ్రెస్ పాలనలో కూడా కొనసాగుతున్నదని విమ ర్శించారు. టీజీపీఎస్సీలో ఏ విధమైన మార్పు రాలేదని ఆరోపించారు.