calender_icon.png 23 January, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్‌లో ఉచితవిద్య సాధ్యమేనా!

23-01-2025 01:00:08 AM

25 శాతం సీట్లు పేదలకు ఇవ్వాలంటున్న ప్రభుత్వం

  1. ఇప్పటికే ఫీజు రీయెంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించని సర్కార్
  2. ఉచితవిద్య నిర్ణయంతో ఖజానాపై మరింత భారం
  3. జూన్ నుంచి అమలు చేస్తామని హైకోర్ట్‌కు వివరణ

హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): ప్రైవేట్ పాఠశాలల్లోని 25 శాతం సీట్లలో పేదలకు ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. అదీ వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు చేయాలని భావిస్తోంది. ఇందుకు  సంబంధించి క్షేత్రస్థాయిలో కసరత్తు కూడా చేస్తోంది. కానీ పూర్తి స్థాయిలో అమలు విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

2009 విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేదలకు ఉచితంగా కేటాయించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను రాష్ట్రంలో అమలుచేయకపోవడంతో కొంద రు హైకోర్టు మెట్లెక్కారు. కాగా వచ్చే విద్యాసంవత్సరం (2025-26) నుంచి విద్యా హక్కుచట్టంలోని ఈ నిబంధనను అమలుచేస్తామని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

ఈ చట్టం ప్రకారం ప్రీప్రైమరీ, ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కిలోమీటర్ పరిధిలో ప్రైమరీ, 3 కిలోమీటర్లలోపు అప్పర్ ప్రైమరీ ప్రభుత్వ స్కూల్ లేకపోతేనే ఈ నిబంధన వర్తిస్తుంది.

రాష్ట్రంలో 12,126 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ఈ స్కూళ్లల్లో దాదాపు 38 లక్షల విద్యార్థులున్నారు. 25 శాతం సీట్లు పొందిన వారి ఫీజులను ప్రభుత్వమే రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. ఉన్నతవిద్యలో ఫీజు రీయెంబర్స్‌మెంట్ పథకం ఇప్పటికే అమలవుతుండగా, ఆ ఫీజు బకాయిలను ప్రభుత్వం చెల్లించలేకపోతుంది. దాదాపు 5,700 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. ఇక పాఠశాల స్థాయిలోనూ ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలుచేస్తే ఆర్థికభారం మరింత పెరిగే అవకాశముంది. 

ఇప్పటికే అడ్మిషన్లు షురూ..

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రైవేట్‌లో 25 శాతం సీట్లను పేదలకు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తుండగా ఈ అకడమిక్ ఇయర్‌కు సంబంధించి కొన్ని ప్రైవేట్ స్కూ ళ్లు ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభించాయి. పలు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈతోపాటు కొన్ని ప్రైవేట్ స్కూళ్లల్లో అడ్మిషన్లు ముగింపు దశ కు చేరడం గమనార్హం. ఈ నేపథ్యంలో 25 శాతం ఫ్రీ సీట్లు అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. 

మిగతా రాష్ట్రాల్లో..

దేశంలోని ఐదారు రాష్ట్రాల్లో తప్ప మిగతా అన్నీ రాష్ట్రాల్లో ప్రైవేట్ బడుల్లో 25 శాతం సీట్లను పేదలకు కేటాయిస్తున్నారు. పశ్చిమ్‌బెంగాల్, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఈ నిబంధన అమలు కావ డం లేదు. అమలవుతున్న కొన్ని రాష్ట్రా ల్లో ఫీజులను ప్రభుత్వాలే చెల్లిస్తుండగా, ఇంకొ న్ని రాష్ట్రాల్లో ఆయా విద్యాసంస్థలే ఉచితంగా అందజేస్తున్నాయి.

ఆర్టీఈ యాక్ట్ ప్రకారం ఆవాసాలకు కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నతపాఠశాల లేకపోతే ఆయా విద్యార్థులకు ప్రైవేట్ బడుల్లో 25శాతం సీట్లను కేటాయించాలని కొందరు వాదిస్తుండగా, మరికొందరు ఈ నిబంధనతో నిమి త్తం లేకుండా ప్రతి ప్రైవేట్ స్కూళ్లో ఈ నిబంధనలను అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

సీట్ల కేటాయింపు ఇలా 

కేటగిరి సీట్లు

అనాథలు, దివ్యాంగులు

ఎస్టీలు 4

ఎస్సీలు 10  

బీసీ, మైనార్టీ, అల్పదాయవర్గాలు 6  

మొత్తం 25