31-03-2025 12:00:00 AM
రైతు భరోసా డబ్బులు వచ్చాయా
వంట గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడుతున్నాయా
ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుతెన్నులు గురించి
కాచవరం గ్రామస్తులతో ముచ్చటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఉగాది పండుగ నాడు గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన డిప్యూటీ సీఎం
ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నామని హర్షం వ్యక్తం చేసిన కాచవరం గ్రామస్తులు
ఖమ్మం, మార్చి 30( విజయక్రాంతి ):- ‘మీ అందరి ఇండ్లకం జీరో బిల్లులు వస్తున్నాయా...? పెద్దయ్య నీకు రైతు భరోసా డబ్బులు పడ్డాయా..? అమ్మ మీకు వంట గ్యాస్ సబ్సిడీ డబ్బులు వస్తున్నాయా? అంటూ ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్న తీరుతెన్నుల గురించి‘ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం కాచవరం గ్రామస్తులను అడిగి తెలుసుకున్నా రు. ఉగాది పండుగను పురస్కరించుకొని శనివారం సాయంత్రం కాచవరం గ్రామంలోని ఓం శ్రీ పార్వతి సమేత అమృత లింగే శ్వర స్వామి వారి దేవాలయంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామస్తులతో ముచ్చటించారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల హామీల లో భాగంగా 2024 మార్చి నుంచి గృహజ్యోతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదన్నారు.అక్కడ ఉన్న రైతులను ఉద్దేశించి రైతు భరోసా డబ్బులు మీ బ్యాంకు ఖాతాల్లో పడ్డాయా అని అడుగగా నాలుగైదు ఎకరాలు ఉన్న రైతులు అందరికీ రైతు భరోసా డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడ్డాయని సమాధానం చెప్పారు. కొంతమంది మహిళలు తమకు ఇల్లు లేవని ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాలని ఉప ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేయగా, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి అయ్యిందని గ్రామంలో ఇంటి స్థలం ఉండి ఇల్లు లేనటువంటి వారికి ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తామని వెల్లడించారు. ఇందిరమ్మ కమిటీలు పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను పంపించాలని సూచించారు.
‘ఎండలకు పాణం బాగుండట్లేదు. నిన్ను చూస్తానో.. చూడనో అనుకున్నా. నెల రోజుల నుంచి నిన్ను చూడాలని ప్రాణం కొట్టుకుంటున్నది. సార్ వస్తే నా ఇంటికి తీసుకురమ్మని మన నాయకులకు చెప్పాను. పండుగ రోజున నన్ను చూడడానికి నా ఇంటికి వచ్చి పలకరించినవ్. నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఆలింగనం చేసుకొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కేఎస్ నర్సమ్మ భావోద్వేగానికి గురైంది.
నరసమ్మ గారు ఎలా ఉన్నారు? బాగున్నావా? ఆరోగ్యం ఎట్లా ఉంది అంటూ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితి గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అడిగి తెలుసుకున్నారు. ఉగాది పండుగ నాడు కాచవరం గ్రామానికి విచ్చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ శ్రేణులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఘనం గా స్వాగతం పలికారు మహిళలు మంగళహారతులు పట్టారు.కార్యక్రమం లో స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు.