calender_icon.png 23 December, 2024 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సివిల్ సర్వీసెస్‌కు అంగవైకల్యం అవరోధమా?

23-07-2024 12:00:00 AM

పూజా ఖేడ్కర్ ఉదంతం నేపథ్యంలో.. ఆలిండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటాపై ఐఎఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపాయి. దివ్యాంగులను అవమానించేలా.. వారి శక్తిసామర్థ్యాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ దివ్యాంగ సంఘాలతో పాటు పలువురు ఎంపీలు, న్యాయవాదులు విమర్శించారు. అసలేంటి వివాదం? దివ్యాంగుల హక్కులేంటి, చట్టం ఏం చెబుతున్నదో చూద్దాం.. 

పూజా ఖేడ్కర్ రాజీనామా నేపథ్యంలో.. ఐఎఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ‘ఎక్స్’లో ఏమన్నారంటే.. “ఈ చర్చ మరింత విస్తృతమవుతున్న నేపథ్యంలో.. దివ్యాంగులను గౌరవిస్తూనే.. విమానయాన సంస్థ దివ్యాంగులను పైలట్‌గా నియమిస్తుందా? వైకల్యం కలిగిన సర్జన్‌ను మీరు విశ్వసిస్తారా? ఆలిండియా సర్వీసులైన ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌వోఎస్‌లు క్షేత్రస్థాయిలో పని చేయాల్సినవి. ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రజల ఫిర్యాదులను ఓపికగా వినాల్సి ఉం టుంది. ఈ పనులకు శారీరక దృఢత్వం అవసరం. ఇలా అత్యున్నత సర్వీసులో అసలు ఈ కోటా ఎందుకవసరం?” అని పేర్కొన్నారు. 

దివ్యాంగుల హక్కులు!

భారత రాజ్యాంగంలోని 14 ఆర్టికల్స్ దివ్యాంగులకు అందరితో పాటు సమాన హక్కులను కల్పిస్తున్నాయి. ఆర్టికల్ 14 ప్రకారం ప్రభుత్వ చట్టాల్లో వీరికి సమానత్వాన్ని నిరాకరించకూడదు. వీరి స్వేచ్ఛ, రక్షణకు ప్రభుత్వ విభాగాలు హామీ ఇవ్వాలి. ఆర్టికల్ 25 ప్రకారం దివ్యాంగులకు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కుల్లో సమానత్వంతో పాటు విద్యను పొందే హక్కుంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 28 దేశాలు మాత్రమే దివ్యాంగులైన బాలలకు రాజ్యాంగ పరంగా విద్యాహక్కుకు హామీ ఇస్తున్నాయి. ఆర్టికల్ 27 ప్రకారం దివ్యాంగులకు పని కల్పించడంలో ఇతరులతో సమానమైన గుర్తింపు ఇవ్వాలి.

వారికి అనుకూల పని వాతావరణాన్ని కల్పించాలి. దివ్యాంగులకు వివిధ రకాల రక్షణ, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల చట్టం తెచ్చి అమలు చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి దివ్యాంగుల హక్కుల ఒప్పంద నిర్ణయాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వైకల్యం గల వ్యక్తుల చట్టం అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 మే 1ఓ చట్టం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ చట్టం 21 వైకల్యాలను గుర్తించి విద్యలో ఐదు శాతం, ఉపాధి కల్పనలో నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించింది. ఈ చట్టం మీద అవగాహన కల్పించేందుకు ప్రచారం చేయాలని అందులోని పలు సెక్షన్లు చెబుతున్నాయి. 

ఈ వ్యాఖ్యలపై కొందరి అభిప్రాయాలు ఇవి..

జ్ఞానోదయం అవసరం

వైకల్యం అనేది శక్తి, మేధస్సుపై ఎలాంటి ప్రభావం చూపించదు. ఈ పోస్టు చూస్తోంటే వైవిధ్యం, జ్ఞానోదయం చాలా అవసరమని తెలుస్తోంది

 కరుణ,

సుప్రీంకోర్టు  సీనియర్ అడ్వొకేట్ 

పరిమిత ఆలోచనలు..

ఈ పోస్ట్ చూస్తోంటే బ్యూరోక్రాట్లు తమ పరిమిత ఆలోచనలు, ప్రత్యేక అధికారాలు ఎలా చూపిస్తున్నారో అర్థమవుతున్నది.

 ఎంపీ ప్రియాంకా చతుర్వేది

అభ్యంతకరం..

స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఆమె క్షమాపణలు చెప్పాలి.

  ముత్తినేని వీరయ్య

తెలంగాణ దివ్యాంగుల 

ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్

చట్టం ఏం చెబుతున్నది!

వైకల్యం గల వ్యక్తిని కించపరిచినా, బహిరంగంగా ఉద్దేశపూర్వకంగా అవమానపరిచినా, అగౌరవపరిచే ఉద్దేశం తో దాడి, బలప్రయోగం చేయడం, వైకల్యం గల వ్యక్తిపై పెత్తనం చేయడం, అణిచివేయడం, అభిప్రాయాలపై, భావాలపై దాడి చేయడం, దివ్యాంగులకు ఊతమిచ్చె పరికరాన్ని ధ్వంసం చేయడం, ఉద్దేశపూర్వకంగా ఆహారా న్ని, పానీయాలను ఇవ్వడానికి నిరాకరించడం, వైకల్యం ఉన్న మహిళలపై ఆధిపత్యాన్ని వినియోగించి లైంగిక దాడికి పాల్పడినా.. సెక్షన్ 92 ప్రకారం ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చని చట్టం చెబుతున్నది. 

వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

దివ్యాంగులను దూరం పెట్టమని స్మిత చెబుతున్నారు. రేవంత్ సర్కారు తొలి ఉద్యోగం దివ్యాంగురాలికి ఇచ్చింది. దివ్యాంగులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చట్టరీత్యా నేరం. స్మితా సబర్వాల్.. మీరు రాజీనామా చేసి రండి.. ఇద్దరం మళ్లీ పరీక్ష రాద్దాం. మనిద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దాం. ఆమె ఫిజికల్లీ ఫిట్.. మెంటల్లీ అన్‌ఫిట్ 24 గంటల్లో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. లేదంటే జైపాల్ రెడ్డి స్మృతివనం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపడతాం. ఆమెపై సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్ శాంతి కుమారి తగిన చర్యలు తీసుకోవాలి. 

 బాలలత

సీఎస్‌బీ ఐఎస్ అకాడమీ చీఫ్