- గత ప్రభుత్వంలో ప్రారంభమైన పథకం
- కొత్త ప్రభుత్వంలో కొనసాగింపుపై స్పష్టత కరువు
- అల్పాహారం కోసం విద్యార్థుల ఎదురుచూపులు
మెదక్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం స్కూల్‌లో అల్పాహారం అందించే ఉద్దేశంతో గత ప్రభుత్వం ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ పేరుతో పథకాన్ని ప్రారంభించింది. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం ఉదయం ఉప్మా, కిచిడీ, ఇడ్లీ, వడ, పులిహోర, పొంగలి తదితర టిఫిన్స్ ఏర్పాటు చేసేవారు. గత సంవత్సరం అక్టోబర్ 6న అప్పటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు.
మధ్యాహ్న భోజనం వండే ఏజెన్సీల వారే టిఫిన్లు కూడా తయారు చేసి పెట్టేవారు. అక్టోబర్‌లో ప్రారంభమైన పథకం ఏప్రిల్ వరకు కొనసాగింది. కానీ, ప్రస్తుతం నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు కావస్తున్నా అల్పాహారం మాత్రం విద్యార్థులకు అందడం లేదు. సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ను రాష్ట్రవ్యాప్తంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది.
ఒక్కో విద్యార్థికి రూ.10.50 చొప్పున..
సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకంపై ప్రస్తుతం ప్రభుత్వం, విద్యాశాఖ నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో అమలుపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మెదక్ జిల్లాలో 904 పాఠశాలల్లో అమలు చేయాల్సి ఉండగా, గతేడాది కేవలం 35 పాఠశాలల్లోనే పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టారు. జిల్లావ్యాప్తంగా సుమారు 90 వేల మంది విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలల పనిదినాలు 220 ఉండగా, ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.10.50 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 220 పని దినాలకు జిల్లాలో 90 వేల మంది విద్యార్థులకు సుమారు రూ.19.80 కోట్లు అవసరముంటుందని అధికారులు చెబుతున్నారు.
కొత్త ప్రభుత్వంలో ఊసేలేదు..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నప్పటికీ ఈ పథకం అమలుపై ఊసెత్తడం లేదు. దీంతో విద్యార్థులకు నిరాశ మిగిలింది. అంతేకాకుండా పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉదయం అల్పాహారం తినకుండా చదువులు కొనసాగించడం ఇబ్బందిగా మారుతుంది. ప్రభుత్వం పథకాన్ని అమలు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
పథకం కొనసాగడం లేదు
సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం జిల్లాలో కొనసాగడం లేదు. గతేడాది ఎంపిక చేసిన 35 పాఠశా లల్లో మాత్రం నడిచింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే కొనసాగిస్తాం.
రాధాకిషన్, జిల్లా విద్యాధికారి, మెదక్
అమలు చేయాలి
పాఠశాలల్లో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలి. దీంతో విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. పదో తరగతి పరీక్షల సమయంలో ప్రత్యేక తరగతులకు వచ్చే విద్యార్థులకు అల్పాహారం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఎల్ మల్లారెడ్డి,
పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు