కోల్‌కతా ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ని దోషిగా తేలుస్తూ సీల్దాకోర్టు శనివారం తీర్పు చెప్పింది. సోమవారం అతడికి శిక్ష ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది. ‘నీకు శిక్ష తప్పదు, బాధితురాలిని నీవు చంపిన తీరుకు యావజ్జీవ శిక్ష లేదా మరణ శిక్ష విధించవచ్చు’ అంటూ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ చేసిన వ్యాఖ్యలను బట్టి దోషికి ఈ రెండింటిలో ఏదో ఒక శిక్ష తప్పదనిపిస్తోంది.
తాను ఎలాంటి తప్పూ చేయలేదని, తనను అన్యాయంగా తప్పుడు కేసులో ఇరికించారని సంజయ్ మొదటినుంచీ వాదిస్తూ వచ్చినా కోల్‌కతా పోలీసులు, సీబీఐ సమర్పించిన సాక్ష్యాధారాలను బట్టి అతడినే దోషిగా కోర్టు నిర్ధారించింది. కాగా ఈ హత్యాచారం కేసు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆస్పత్రి సెమినార్ రూమ్‌లో నిద్రిస్తున్న 31 ఏళ్ల వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా వైద్యుల నిరసనలకు దారితీసింది.
తొలుత ఈ కేసును దర్యాప్తు చేసిన కోల్‌కతా పోలీసులు ఆస్పత్రిలో సివిల్ వలంటీర్‌గా పని చేసిన సంజయ్‌రాయ్‌ని ప్రధాన నిందితుడిగా అనుమానిస్తూ అరెస్టు చేశారు. అయితే ఈ ఘటన బెంగాల్‌తో దేశవ్యాప్తంగా జూనియర్ వైద్యుల నిరసనలకు దారితీసింది. నిరసనల కారణంగా ఆస్పత్రి ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పదవికి రాజీనామా చేయ గా, రాష్ట్రప్రభుత్వం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను కూడా బదిలీ చేసింది.
అయినా తమకు కోల్‌కతా పోలీసులపై నమ్మకం లేదని, ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలంటూ మృతురాలి తల్లిదండ్రులతో పాటుగా పలువురు కోల్‌కతా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో హైకోర్టు కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసింది. అయినా ఆందోళనలు చల్లారలే దు. మృతురాలికి సంఘీభావంగా ఆగస్టు 17న వైద్యుల ఒక రోజు సమ్మె తో దేశవ్యాప్తంగా వైద్యసేవలు స్తంభించిపోయాయి. కేసును సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు మమత సర్కార్‌తో పాటుగా పోలీసులు, ఆస్పత్రి యంత్రాంగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
వైద్యుల భ ద్రతపై టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఆందోళన విరమించాలని సుప్రీంకోర్టు చేసిన సూచనతో వైద్యులు దేశవ్యాప్త ఆందోళనను విరమించుకున్నారు. ఈలోగా రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకు న్నాయి. ఘటన రాజకీయ రంగు పులుముకొంది. సాక్ష్యాలను తారుమారు చేయడానికి యత్నించారన్న ఆరోపణలపై కాలేజి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్టు చేసింది. అయితే సీబీఐ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయడంలో జాప్యం చేయడంతో న్యాయస్థానంలో ఘో ష్‌తో పాటు అరెస్టయిన పోలీసు అధికారికి బెయిలు లభించింది.
కోల్‌కతాలో డాక్టర్లు తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తూ రిలే నిరాహార దీక్షలు సైతం మొదలు పెట్టారు. రాష్ట్రప్రభుత్వం, ఆందోళన చేస్తున్న డాక్టర్ల మధ్య ప్రతిష్టంభనను తొలగించడానికి జరిగిన రాజీ ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి సీఎం మమతా బెనర్జీతో సుదీర్ఘ చర్చల అనంతరం వారు నిరాహార దీక్షలను విరమించుకున్నారు. దాదాపు రెండున్నర నెలల తర్వా త కోల్‌కతాలో శాంతి నెలకొంది.
కాగా అక్టోబర్ 7న దాఖలయిన చార్జిషీట్ ఆధారంగా నవంబర్ 12న సీల్దా కోర్టులో ఇన్‌కెమెరా విచారణ ప్రారంభం కాగా, జనవరి 9న విచారణ ముగిసింది. 50 మంది సాక్షులను కోర్టు విచారించింది. శనివారం కోర్టు సంజయ్ రాయ్‌ని దోషిగా నిర్ధారిస్తూ తీర్పు చెప్పడంతో ఓ ఘట్టం ముగిసింది. కోల్‌కతా జైల్లో ఉన్న సంజయ్‌కు విధించే శిక్ష సైతం గరిష్ఠంగానే ఉంటుందన్న సంకేతాల నేపథ్యంలో తీర్పుపై పైకోర్టులకు వెళ్లినా ఊరట లభించే అవకాశాలు తక్కువే. ఢిల్లీ నిర్భయ కేసులాగానే ఈ ‘అభ య’ కేసు కూడా సభ్య సమాజాన్ని కుదిపేసిందనడంలో సందేహం లేదు.