calender_icon.png 26 November, 2024 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో 61 శాతం చెరువులు కబ్జా

26-11-2024 04:03:10 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): దేశంలో పట్టణీకరణ ఉన్న పట్టణీకరణ కంటే తెలంగాణలో పట్టణీకరణ 12 శాతం అధికంగా ఉందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 47 శాతం పట్టణీకరణ రానున్న పదేళ్లలో నిపుణుల అంచనా ప్రకారం 75 శాతానికి పెరుగుతుందన్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండిస్ట్రియల్ రీసెర్చ్ - నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎస్ఐఆర్-ఎన్ఈఈఆర్ఐ) ఆధ్వర్యంలో పట్టణ చెరువుల నిర్వహణ అంశంపై బేగంపేట‌లోని ప‌ర్యాట‌క భ‌వ‌న్‌లో మంగళవారం సదస్సు నిర్విహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైడ్రా కమిషనర్  రంగనాథ్ హాజరయ్యారు. పట్టణీకరణ వేగంగా జరుగుతున్న క్రమంలో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా వుందని, మరీ ముఖ్యంగా దేశంలో పట్టణీకరణ 12 శాతం తెలంగాణలో ఎక్కువ‌ ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 47శాతం పట్టణీకరణ 2050 నాటికి 75 శాతానికి చేరుకుంటుందని నిపుణులు సూచిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి తరుణంలో ప్రకృతి వనరులను కాపడుకోవాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉందన్నారు. అప్పుడే భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని, మెరుగైన జీవనాన్ని అందించగలం అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం  ఈ ఏడాది జూలైలో హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీలో భాగంగా ఉన్న ఈవీడీఎం(ఎన్‌ఫోర్సుమెంట్ విజిలెన్స్ అండ్‌ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్‌) వింగ్‌ను హైడ్రాలో విలీనం చేసిందన్నారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించడం, ప్రభుత్వ ఆస్తులు కాపాడడం, చెరువుల పరిరక్షణ, ప్రజావసరాల కోసం కేటాయించిన పార్కులను, రహదారులు క‌బ్జాల‌కు గురికాకుండా  కాపాడడం హైడ్రా ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు.

పట్టణీకరణలో భాగంగా  నగరంలో ఇళ్ళ స్థలాలకు డిమాండ్ ఏర్పడటంతో భూమికి విలువ పెరిగి చెరువులు కబ్జాకు గురయ్యాయన్నారు. 61 శాతం చెరువులు ఇప్పటికే కనుమరుగైపోయినట్లు గణాంకాలు  చెబుతున్నాయని చెప్పారు. ఇంకా మిగిలిన 39 శాతం చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా వుందన్నారు. లేని పక్షంలో మరో 15 ఏళ్లకు నగరంలో చెరువులు కనిపించని పరిస్థితి ఏర్పడుతుందని వెల్లడించారు. నగరంలో చెరువులు ఎన్ని ఉన్నాయి, వాటి విస్తీర్ణం ఎంత అనే దానితో పాటు  చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారించే పనిని హైడ్రా చేపట్టిందని రంగనాథ్ తెలిపారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సర్వే ఆఫ్ ఇండియా, తెలంగాణ స‌ర్వే విభాగం, విలేజ్ మ్యాప్స్ ఆధారంగా చెరువుల విస్తీర్ణాన్ని నిర్ధారించి..  ఉన్న‌వాటిని కాపాడాలనే ప్రభుత్వ లక్ష్యాల మేరకు హైడ్రా పని చేస్తోందని వ్యాఖ్యనించారు.  

యీ క్రమంలోనే ఇటీవల ఇంజనీరింగ్, మైనర్ ఇరిగేషన్, పర్యావరణ వేత్తలు, చెరువుల పరిరక్షణకు పని చేస్తున్న నిపుణులతో సదస్సు నిర్వహించామని అన్నారు. ఈ సదస్సులో నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకుని చెరువులను కాపాడేందుకు హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంటోందన్నారు. చెరువులు, పార్కులను కాపాడుకున్నప్పుడే పర్యావరణ సమతుల్యత సాధ్యం అవుతుందన్నారు. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ దెబ్బ తినడం వల్లే  నగరంలో 2 సెంటీ మీటర్ల వర్షం ప‌డినా రహదారులు నీట మునుగుతున్నాయని అన్నారు.  దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ లు ఏర్పడుతున్నాయని అన్నారు. ఇలాంటి త‌రుణంలో గొలుసుక‌ట్టు చెరువుల‌ను కాపాడుకోవాల్సిన ఆవ‌స‌రం ఎంతైనా ఉందన్నారు. ఈ క్ర‌మంలోనే అనుమతులు లేని అక్రమ కట్టడాలను కొన్నిటిని హైడ్రా కూల్చిందన్నారు. కూల్చడం కాదు చెరువులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల పరిరక్షణ చేయడమే హైడ్రా లక్ష్యం అన్నారు. 

హైడ్రా చర్యల వల్ల సామన్యులలో కూడా  చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్(ఎఫ్ టీఎల్), చెరువు పూర్తి సామర్ధ్య విస్తీర్ణం(బఫర్), చెరువు క్యాచ్మెంట్ ఏరియా అనే అంశాల పట్ల అవగాహన వచ్చిందన్నారు. ఇళ్ళు కొనేటప్పుడు ఎఫ్ టీ ఎల్, బఫర్, ప్రభుత్వ భూమి యిలా వివరాలన్నీ తెలుసుకొని నగర ప్రజలు కొంటున్నారని అన్నారు.  ప్రజలు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. ప్ర‌జ‌లు మోస‌పోని ప‌రిస్థితులలో స్థిరాస్తి వ్యాపారం కూడా స్థిరంగా సాగుతుందన్నారు. యిలాంటి తరుణంలో అర్బన్ లేక్ మేనేజ్మెంట్ పై "LAKES -2024" పేరిట CSIR- NEERI నిర్వహించిన మేధోమథనం ఎంతో ఉపయోగప‌డుతుందన్నారు. యీ సదస్సులో పాల్గొనడం ఎంతో ఆనందంగా వుందన్నారు. యీ సదస్సు ద్వారా ప్రజల్లో మరింత అవగాహన కలుగుతుందన్నారు. చెరువుల పరిరక్షణ, జల, వాయు కాలుష్యము లేని చెరువులు వుండాలనే లక్ష్యంతో పని చేస్తున్న హైడ్రా కు యీ సదస్సులో నిపుణుల సూచనలు, సలహాలు మరింత మార్గదర్శకంగా నిలుస్తాయనారు. నాగపూర్ సీఎస్ఐఆర్ - నీరి డైరెక్టర్ DR. A. N. Vaidya,   CSIR -NEERI Hyderabad zonal centre Chief scientist Dr. Shaik basha తదితరులు పాల్గొన్నారు.