calender_icon.png 6 November, 2024 | 11:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగునీటి ప్రాజెక్టుల పనులను సత్వరం పూర్తిచేస్తాం!

03-08-2024 03:38:31 AM

  1. బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు రూ.22,500 కోట్లు 
  2. ఏడాదికి ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణే ధ్యేయం 
  3. గత ప్రభుత్వ విధానాలతో సాగునీటి రంగం అస్తవ్యస్తం 
  4. రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
  5. మంత్రి కోమటిరెడ్డితో కలిసి సాగర్ ఎడమ, లో లెవల్ కాల్వలకు జలాలు విడుదల  

నల్లగొండ, ఆగస్టు 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టు పనులను తమ ప్రభుత్వం సత్వరం పూర్తి చేస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డితో కలిసి శుక్రవారం నాగార్జున సాగర్ ఎడమ కాల్వతోపాటు లోలెవల్ కెనాల్‌కు జలాలు విడుదల చేశారు. అనంతరం విజయవిహార్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి ఏటా ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును స్థిరీకరిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వ అనాలోచిత విధానాలతో రాష్ట్రంలో నీటిపారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆక్షేపించారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని మండిపడ్డారు. ప్రాజెక్టుల నిర్వహణ లోపభూయిష్ఠంగా ఉండేదని ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎస్సెల్బీసీ, డిండి, బ్రాహ్మణవెల్లంల, పిల్లాయిపల్లి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు తమ ప్రభుత్వం ఏకంగా రూ.22,500 కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు. ఆ నిధుల్లో రూ.10,828 కోట్లను పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేసేందుకు వినియోగిస్తామన్నారు.

మరో రూ.11 వేల కోట్లను కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి వెచ్చిస్తామన్నారు. రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. సాగర్ ఎడమ కాల్వకు పూర్తిస్థాయిలో జలాలు విడుదల చేస్తున్నామని, ప్రణాళికాబద్ధంగా ఆయకట్టు చెరువులు నింపుతామన్నారు. ఉమ్మడి నల్లగొండ పరిధిలోని ఎస్సెల్బీసీ పూర్తయితే 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మూడేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు.

అంతకుముందు హెలిప్యాడ్ వద్ద మంత్రులకు కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు స్వాగతం పలికారు. పర్యటనలో శాసనమండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న, మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, బాలూనాయక్, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ ఉన్నారు.