మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): రాష్ర్టంలో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తున్నందున నీటిపారుదల శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనుమతి లేకుండా ఇంజినీర్లు హెడ్ క్వార్టర్‌ను విడిచి పోవద్దని. ప్రతి ఒక్కరూ విధిగా హెడ్ క్వార్టర్ లోనే ఉండాలని ఆదేశించారు. ఎవరూ కూడా సెలవులు పెట్టొద్దని, ఎప్పటికప్పుడు రిజర్వాయర్లు, చెరువులను మానిటరింగ్ చేయాలని పేర్కొన్నారు.
అదేవిధంగా ఎప్పటికప్పుడు నీటి స్థాయిలను పర్యవేక్షించాలని, ముఖ్యంగా ఓవర్ ఫ్లోను నిరోధించడానికి గేట్లు, స్పిల్ వేల పనితీరును క్షుణ్ణంగా పరిశీలంచాలన్నారు. ఎప్పటికప్పుడు డ్యామ్ లు కట్టలు, కెనాల్‌లను తనిఖీలు చేయాలన్నారు. ప్రమాదం పొంచి ఉన్న ప్రాం తంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అంతకు మించి చెరువుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితిలలో ఇంజినీర్లు వేగంగా స్పందించాలన్నారు. విపత్తులు సంభవిస్తే స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.