10-04-2025 12:42:14 AM
చేతికొచ్చే దశలో పంట వర్షార్పణం
2,686 ఎకరాల్లోదెబ్బతిన్న పంటలు
ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్నల మొర
మహబూబాబాద్, ఏప్రిల్ 9, (విజయ క్రాంతి): వడగండ్ల వాన కర్షకులకు కడ గండ్లు మిగిల్చాయి. మానుకోట జిల్లాలో వడగండ్ల వానలు కోత దశలో ఉన్న వరి పంటకు ఎనలేని నష్టాన్ని కలిగించాయి. జిల్లావ్యాప్తంగా 38 గ్రామాల్లో 2,686 ఎకరాల్లో వరిపంట దెబ్బతిన్నట్టు వ్యవ సాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.
మొత్తంగా నాలుగు వేల ఎకరాల్లో పంట లకు వర్షానికి నష్టం వాటిల్లగా అందులో 3 ఎకరాల వరకు వరి పంట ఉండడంతో రైతులకు చి‘వరి’ దశలో చేతి కందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందల ఎకరాల్లో వరి పంట రాళ్ల వర్షానికి ధాన్యం పూర్తిగా పంట పొలం లోనే రాలిపోయింది. దీనితో వరి పంట ఎందుకు ఉపయోగపడని విధంగా మారిం దని కర్షకులు కన్నీరు పెడుతున్నారు. ఎక్కడ చూసినా నేలకొరిగిన వరి, మొక్కజొన్న పంటలే కనిపిస్తున్నాయి.
పెట్టుబడి తో పాటు రెక్కల కష్టం.. రాళ్ల వాన కబలించుకు పోయిందని అన్నదాతలు రోదిస్తున్నారు. 130 ఎకరాల్లో మొక్కజొన్న పైరు దెబ్బతినగా, 473 ఎకరాల్లో మామిడి పంట తుడిచిపెట్టుకుపోయింది. అలాగే సపోటా, బొప్పాయి పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 2 వేలకు పైగా రైతులకు చెందిన వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల తెలిపారు.
ఏమి మిగలలేదు
యాసంగిలో 8 ఎకరాల్లో వరి పంట వేశాను. సన్న రకం వరి పంట సాగు చేస్తే ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుండడంతో పెట్టుబడి, కష్టం ఎక్కువైనా సన్నరకం వరి పెట్టాను. ఎకరానికి 30 వేల చొప్పున ఇప్పటివరకు పెట్టుబడి అయ్యింది. చేతికంద వచ్చే దశలో ఉన్న పంటను పూర్తిగా రాళ్లవాన తుడిచిపెట్టుకుపోయింది.
ఒక్క గింజ కూడా మిగలకుండా పూర్తిగా భూమి పాలు అయ్యింది. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోకపోతే నా పరిస్థితి అగమ్య గోచరమని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బిచ్చ నాయక్ తండా కు చెందిన రైతు ఇస్లావత్ వీరన్న కన్నీరు మున్నీరయ్యాడు. ఇస్లావత్ వీరన్న, రైతు