calender_icon.png 2 November, 2024 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి స్మగ్లర్లతో కలిసి అక్రమాలు

02-11-2024 01:55:28 AM

ఇద్దరు ఎస్‌ఐలు, ఒక హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు

సంగారెడ్డి, నవంబర్ 1 (విజయక్రాంతి) : గంజాయి స్మగ్లర్ల్లతో కలిసి అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఎస్‌ఐలు, ఒక హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్  ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. మానూర్ ఎస్‌ఐగా పనిచేసిన అంబారియా ప్రస్తుతం పటాన్‌చెరు పీఎస్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్నారు.

సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐగా పనిచేసి ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న వినయ్‌కుమార్, హెడ్ కానిస్టేబుల్ మారుతి నాయక్ గతంలో మానూర్ పోలీసు స్టేషన్‌లో పనిచేశారన్నారు. ఏఆర్ కానిస్టేబుల్ మధు గతంలో మానూర్ పీఎస్‌లో డ్రైవర్‌గా పనిచేశారన్నారు. వీరంతా మానూర్ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న సమయంలో.. ఓ గంజాయి రవాణా కేసులో 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని స్మగ్లర్ల్లను వదిలేశారు.

అలాగే 7 నెలల క్రితం నిజామాబాద్ జిల్లాలోని వర్ని సమీపంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పట్టుకొని వారిని అక్కడి నుంచి నారాయణఖేడ్‌కు తీసుకువచ్చి వారివద్ద 400 ప్యాకెట్లు గంజాయిని తీసుకొని వారిని, వారి వాహనాన్ని వదిలేశారు.

ఈ విషయమై వారిపై ఆరోపణలు రావడంతో రాష్ట్ర పోలీసు శాఖ, నార్కొటిక్ బ్యూరో సభ్యులు విచారణ జరిపి ఆయా ఆరోపణలు నిజమని తేల్చారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు  కేసు దర్యాప్తు చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన పోలీసులపై ఎన్డీసీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసేందుకు లీగల్ ఒపీనియన్ తీసుకుంటామన్నారు.నిందితులపై చట్టరీత్యా ముందుకు వెళ్లనున్నారు.