16-03-2025 12:00:00 AM
రాష్ట్ర వ్యాప్తంగా స్కానింగ్ సెంటర్లు, వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌లు అమాయక ప్రజలను బహిరంగ దోపిడీ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో జరుగుతున్న వీరి అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. సీజన్‌లలో ప్రజ లు ముఖ్యంగా మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌ల బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురవడం, వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేయాలంటూ ప్రైవేట్ ల్యాబ్స్‌కు పంపడం సహజమై పోయింది. టెస్టులు, స్కానింగ్‌లకు నిర్దిష్టంగా ఇంత అని రుసుములు ఏవీ వుండవు కనుక, వాళ్ల ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్నారు. ఇందులో డాక్టర్లకు కమిషన్లు జగమెరిగిన సత్యం. ప్రభుత్వాలు ఇలాంటి వ్యాపారులను నియంత్రించలేవా? అసలే, ప్రజలు రోగాల బారిన పడి కొట్టుమిట్టాడుతుంటే వీళ్ల వ్యాపార కాంక్ష చితికిపోయేలా చేస్తున్నది. కొందరు వైద్యులు, స్కానింగ్, ల్యాబ్ నిర్వాహకులు కుమ్మక్కవుతూ ప్రజావైద్యాన్ని వ్యాపారంగా మార్చేయడం దారుణం. కొన్ని సంస్థలైతే కనీసం రిసిప్ట్స్ కూడా ఇవ్వడం లేదు.
- కామిడి సతీశ్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి
వెల ఎంతయినా బిల్లు తప్పనిసరి
వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న అన్యాయాలపై ఫోరంలో ఫిర్యాదు చేయడానికి సరైన రుజువులు అవసరం. కంపెనీలు, దుకాణాదారుల నుంచి ఆయా వస్తువులకు రశీదు, వా రంటీకార్డులను విధిగా అడిగి తీసుకోవాలి. ముఖ్యంగా వేలు, లక్షల రూపాయలు పెట్టి ఖరీదు చేసే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొన్న కొద్ది రోజులకు లేదా వారెం ట్ సమయం లోపలే అవి పని చేయని పక్షంలో విధిగా కొత్త వాటి ని పొందే హక్కు వినియోగదారులకు ఉంటుంది. బిల్లు వద్దంటే ఖరీదులో కొంత సొమ్ము తక్కువ చేస్తామనే వారు కూడా ఉంటా రు. వెల ఎంతయినా కొత్త వస్తువులకు బిల్లులు, వారంటీకార్డులు అడిగి తీసుకునేందుకు కొనుగోలుదారులు సంశయించాల్సిన పని లేదు. చాలామంది ఈ ఆధారాలు లేకపోవడం వల్ల ఏదైనా లోపభూయిష్టమైన వస్తువులకు ప్రతిగా కొత్తవి తిరిగి పొందలేక నష్టపో తున్నారు. చిన్న వస్తువైనా సరైంది పొందడం తమ హక్కుగా ప్రజలు గుర్తించాలి. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది.
- సింగు లక్ష్మీనారాయణ, చింతకుంట