calender_icon.png 8 October, 2024 | 5:53 AM

నిమ్జ్ భూసేకరణలో అవకతవకలు!

07-10-2024 12:33:25 AM

ఝరాసంగం మండలం ఎల్గోయిలో వెలుగులోకి..

1970 నుంచి భూరికార్డులున్నా పరిహారం ఇయ్యలే..

కానీ 2016లో బై నంబర్లతో పేర్లు చేర్చి పరిహారం 

అక్రమాలపై విచారణ చేపట్టాలన్న గ్రామస్థులు

సంగారెడ్డి, అక్టోబర్ ౬ (విజయక్రాంతి): నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యాన్యూఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్) కోసం ప్రభుత్వం భూమిని సేకరిస్తోంది. ఈ భూసేకరణలో రెవ్యెన్యూ అధికారులు, దళారులు భారీగా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల్లోని 12,635.14 ఎకరాల భూమిని నిమ్జ్ కోసం సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

17 గ్రామాల్లో ఇప్పటివరకు 7,526.03 ఎకరాల భూమిని సేకరించారు. ఈ ప్రక్రియలో రెవెన్యూ అధికారులు, నిమ్జ్ ప్రాజెక్ట్ కార్యాలయంలో పని చేసే అధికారు లు పలు అక్రమాలకు పాల్పడినట్లు బాధితు లు వాపోతున్నారు. జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేద ని బాధిత రైతులు వాపోతున్నారు.

2011లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం..

న్యాల్‌కల్, ఝరాసంగం మండలాల్లో నిమ్జ్ ఏర్పాటుకు 2011 కేంద్రం ఆమోదం తెలిపింది. 2015లో రెవెన్యూ అధికారులు ఝరాసంగం మండలంలో భూసేకరణ సర్వే ప్రారంభించారు. ఎల్గోయి గ్రామంలో నిమ్జ్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 2,383.30 ఎకరాల భూమి సేకరించింది. ఇందులో 1,452.04 ఎకరాలు పట్టాభూమి, 931.26 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉంది.

భూమిని సాగు చేస్తూ.. 1970 నుంచి పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉన్న రైతులకు ప్రభు త్వం నష్టపరిహారం ఇవ్వలేదు. కానీ ఝరాసంగం తహసీల్ ఆఫీస్‌లో పని చేసే కొంద రు రెవెన్యూ అధికారులు 2016లో సర్వే నం బర్లకు బై నంబర్లు ఇచ్చి కొత్తగా ప్రభుత్వ భూమిలో రికార్డులను తయారు చేసి, వాటి కి నష్టపరిహారం చెల్లించారు.

ఇలా గ్రామంలోని 17 మందికి బై నంబర్ల కేటాయింపు ద్వారా నష్టపరిహార చెక్కులు అందినట్లు తెలిసింది. కానీ 1970 నుంచి భూరికార్డులు ఉన్న గ్రామానికి చెందిన 31 మందికి నష్టపరిహారం చెల్లించలేదని రైతులు తెలిపారు. 2016లో అసైన్‌మెంట్ కమిటీలు లేకున్నా రెవెన్యూ అధికారులు మాత్రం బై నెంబర్లతో రికార్డులో కొత్తగా పేర్లు నమోదు చేసి నష్టపరిహారం చెల్లించారని తెలిసింది. 

అక్రమాలు వెలుగులోకి..

గతంలో ఝరాసంగం తహసీల్దార్ కార్యాలయంలో, జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టులో పనిచేసిన కొందరు అధికారులు అక్రమాల కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఎల్గో యి గ్రామంలో కొందరు దళారులను నియమించుకొని.. వారి ద్వారా డబ్బులిచ్చిన వారి పేర్లను రికార్డుల్లో చేర్చి నష్ట పరిహారం చెల్లించినట్లు తెలిసింది. నిజమైన లబ్ధిదారులకు నష్టపరిహారం అందకపోవడంతో బాధి త రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ చొరవ చూపి విచారణ చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.

కొన్ని ఉదాహరణలు

* ఎల్గోయికి చెందిన మహ్మద్ ఇస్మాల్ తండ్రి ఇమామ్‌సాబ్‌కు సర్వే నంబర్ 54/7లో 5 ఎకరాల భూమి ఉంది. వీరికి 1970 నుంచి పట్టాదారు పాసుపుస్తకం తో పాటు రెవెన్యూ రికార్డులో ఉన్నారు. భూమిని సైతం సాగు చేస్తున్నారు. కానీ రెవెన్యూ అధికారులు ఇతడికి నష్ట పరిహారం చెల్లించలేదు. భూసేకరణ సర్వేలో రైతు పేరు ఉండగా, రెవెన్యూ అధికారు లు 2016లో బైనంబర్ ఇచ్చి ఇతరులకు నష్ట పరిహారం చెల్లించారని రైతు తెలిపారు. 

* గ్రామానికి చెందిన గొల్ల నర్సమ్మకు సర్వేనంబర్ 125లో 3 ఎకరాల భూమి ఉంది. 2015లో భూమి రికార్డులో ఉండటంతో రెవెన్యూ అధికారులు సర్వే చేసి చెక్కును సిద్ధం చేశారు. రెవెన్యూ, నిమ్జ్ ప్రాజెక్టు అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో తాను ఇవ్వలేనని చెప్పినట్లు రైతు పేర్కొన్నారు. అప్పటినుంచి తన చెక్కును పెండింగ్‌లో పెట్టారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. 

* ఎల్గోయికి చెందిన మరుఫ్ బీకి సర్వే నంబర్ 54/4/5లో 5 ఎకరాల భూమి ఉంది. పట్టా పాసుపుస్తకం ఉండటంతో పాటు రెవెన్యూ రికార్డులో ఉంది. బైనంబరుతో ఇతరులకు నష్టపరిహారం చెల్లిం చారు. అసలైన లబ్ధిదారు అయిన తనకు నష్టపరిహారం ఇవ్వలేదని మరుఫ్‌బీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే గ్రామానికి చెంది న కమ్మరి శివన్నకు సైతం ఇదే కారణం తో నష్టపరిహారం ఇవ్వలేదు.

నష్టపరిహారం ఇవ్వలేదు

మాకు పూర్వకాలం సాగు చేసుకోమని సర్కార్ భూమి ఇచ్చింది. పంటలు పండించి బతుకుతున్నం. ఫ్యాక్టరీలు పెడతమని మా భూములు తీసుకున్రు. 2015లో చెక్కు ఇస్తామని చెప్పి పంచనామా చేసుకున్రు. 3 ఎకరాల భూమికి అప్పుడు 9.25 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన్రు. డబ్బులు రావాలంటే లంచం ఇయ్యాలని అడిగారు. అప్పుడు మాతన పైసల్ లేవు. 2016లో చెక్కు ఇయ్యకుండా  ఆపిన్రు. అధికారుల కాడికి చెక్కు కోసం వెళ్తే భూమి రికార్డులో లేదంటున్రు. ఇప్పుటి వరకు చెక్కు ఇయ్యలే.

 నర్సమ్మ, ఎల్గోయి, రైతు 

భూమి లేదు, చెక్కు రాదు అంటున్రు

మాకు 1970 నుంచి ఎల్గోయిలో సర్వే నంబర్ 54/3లో 5 ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ రికార్డులో కూడా నమోదైంది. 2016 సంది నష్టపరిహారం కోసం సార్ల చుట్టు తిరుగుతున్నా. కానీ పట్టించుకుంటలేరు. నా భూమిలో పత్తి పంట సాగుచేస్తున్న. అధికారులేమో నీ పేరు మీద భూమి లేదు.. నష్టపరిహారం రాదు అంటున్రు. 

 చాకలి రామన్న, రైతు, ఎల్గోయి