13-02-2025 07:36:11 PM
సీసీఐ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి..
మాజీ మంత్రి రామన్న డిమాండ్..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): సీసీఐ పత్తి కొనుగోళ్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి జరిగిందని, ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరపాలని మాజీమంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి గురువారం ఆయాన మీడియాతో మాట్లాడుతూ... ఈ ఏడాది ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో దాదాపు 25 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసిందన్నారు. కొనుగోళ్లపై అధికారులతో ఇంత వరకు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే ఒక్క సమీక్ష సమావేశం నిర్వహించలేదన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యేల నిర్లక్ష్యం వల్లే గత పది ఏళ్లలో ఎన్నడూ జరగని అవినీతి ప్రస్తుతం జరిగిందని ఆరోపించారు. పక్క జిల్లాలు, రాష్ట్రాల నుండి పత్తిని తీసుకువచ్చి కౌలు రైతుల పేరిట విక్రయించారని, ఇందులో అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సీసీఐలో జరిగిన అవినీతిపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.