- 14 ఏళ్ల బాలుడికి చికిత్స చేసి తీసేసిన వైద్యులు
- గంటల వ్యవధిలోనే బాలుడి మృతి
న్యూఢిల్లీ, నవంబర్ 3: ఉత్తరప్రదేశ్ హథ్రస్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడి కడుపులో రేజర్ బ్లేడ్లు, బ్యాటరీలు, స్క్రూలు సహా మొత్తం 65 మెటల్ వస్తువులను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలో 5 గంటల సుదీర్ఘ శస్త్ర చికిత్స అనంతరం ఆయా వస్తువులను వైద్యులు తొలగించినప్పటికీ.. శస్త్ర చికిత్స చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ బాలుడు మరణించడం విషాదాన్ని మిగిల్చింది.
హథ్రస్‌లో నివాసం ఉండే ఆదిత్య శర్మ 9వ తరగతి విద్యార్థి. అతడి తండ్రి సంచేత్ శర్మ స్థానికంగా ఓ ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రెజెంటేటర్‌గా పనిచేస్తున్నారు. అతని కొడుకు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుండటంతో తండ్రి సంచేత్ శర్మ కొడుకు ఆదిత్య శర్మను పలు ఆసుపత్రుల్లో చూపించారు.
ఎక్కడా నయం కాకపోవడంతో ఇటీవల ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో అతడిని చూపించగా అక్కడ సీటీ స్కాన్ తీయడంతో అసలు విషయం బయటపడింది. ఈ క్రమంలో ఇక్కడ శస్త్ర చికిత్స అనంతరం గంటల వ్యవధిలోనే ఆదిత్య శర్మ చనిపోయాడు.