calender_icon.png 31 October, 2024 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఉక్కు మనిషి’ గొప్ప సంకల్పం

31-10-2024 12:00:00 AM

స్వాతంత్య్రానంతర భారతదేశ రాజకీయ ఏకీకరణలో ప్రధాన పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 31న ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’ (రాష్ట్రీయ ఏక్తా దివస్) జరుపుకుంటున్నాం. స్వాతంత్య్రం తర్వాత దేశంలోని 565 సంస్థానాల ఏకీకరణలో ఆయన అత్యంత కీలక పాత్ర పోషించారు. దేశ తొలి ఉప ప్రధానమంత్రిగానూ అద్భుత సేవలు అందించారు. 2014 అక్టోబరు 31న ‘జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని’ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

వల్లభాయ్ పటేల్ దేశ స్వాతంత్య్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. ‘రాజ్యాంగ పరిషత్’లో కీలక సభ్యులు కూడా. ‘ఉక్కు మనిషి’గా గొప్ప సంకల్పాన్ని ఆచరణలో పెట్టిన రాజకీయ యోధుడు వల్లభాయ్ పటేల్ న్యాయవాది కూడా. దేశ సుస్థిరత కోసం ప్రజల ఐక్యతను విశ్వసించి, సాధించిన మహానుభావుడు. వారి త్యాగానికి నిలువెత్తు నిదర్శనంగా గుజరాత్‌లోని నర్మదా నది సమీపంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ (182 మీటర్లు) భారీ విగ్రహాన్ని ప్రభుత్వం నెలకొల్పింది. ప్రపంచంలోని 8వ అద్భుతంగా ఈ ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని పిలుస్తున్నారు. 

సర్దార్ పటేల్ తన ఆరోగ్యం, వయస్సు సహకరించక పోయినా ‘సమైక్య భారతదేశాన్ని’ సృష్టించే బృహత్ లక్ష్యాన్ని మాత్రం ఎన్నడూ వీడలేదు. దేశ మొదటి హోం మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా సర్దార్ పటేల్ సుమారు అన్ని సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో పోషించిన విశిష్ఠ పాత్రను దేశ ప్రజలు ఎప్పటికీ మరువలేరు. ట్రావెన్‌కోర్, హైదరాబాద్, జునాగఢ్, భోపాల్, కాశ్మీర్ వంటి కొన్ని సంస్థానాలు భారత యూనియన్‌లో చేరడానికి ఇష్టపడలేదు.

అప్పుడు ఆ సంస్థానాధీశులతో సంప్రదింపులు జరిపి, ఏకాభిప్రాయం సాధించడానికి అవిశ్రాంతంగా పని చేశారు. సామ, దామ, భేద, దండోపాయాల వంటి పద్ధతులనే అవలంబించారు. నవాబు పాలించిన జునాగఢ్, నిజాం పాలించిన హైదరాబాద్‌లను విలీనం చేయడానికి సైనిక బలాన్ని ప్రదర్శించవలసి వచ్చింది. స్వాతంత్య్రం తరువాత దేశ సమగ్రతా సాధనలోనూ వల్లభాయ్ పటేల్ గుణాత్మక క్రియాశీల కృషి సలిపారు. 1947 నుంచి 1950 వరకు భారతదేశానికి నాయకత్వం వహించిన కీలక నాయకులలో ఒకరైన పటేల్, 1950 డిసెంబర్ 15న గుండెపోటుకు గురై, అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ తుది శ్వాస విడిచారు. 

 జాజుల దినేష్