లోక్‌సభ ఎన్నికలకు ముందు దండకారణ్యం మరోసారి పెద్ద ఎత్తున నెత్తురోడింది. చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవుల్లో తాజాగా జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మరణించారు. మావోయిస్టులు, భద్రతా దళాలమధ్య మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రివరకు జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ముగ్గురు బీఎస్‌ఎఫ్ సిబ్బంది (ఇన్‌స్పెక్టర్, ఇద్దరు జవాన్లు) కూడా గాయపడ్డారు. చత్తీస్‌గఢ్ బస్తర్ అడవుల్లోని కాంకేరుజిల్లా ఛోట్ బెటియా ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో మావోయిస్టు అగ్రనేత, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్‌రావు, తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. శంకర్‌రావు తలపై రూ.25 లక్షల రివార్డు ఉంది.
మృతి చెందిన వారిలో 15 మంది మహిళా నక్సలైట్లు ఉండగా, 14 మంది పురుషులు ఉన్నారు. ఘటనా స్థలం నుంచి ఏకే-47 రైఫిళ్ల్లతోపాటుగా భారీ ఎత్తున ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనీ పోలీసు అధికారులు చెప్పారు. అదే నిజమైతే 2016 తర్వాత జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా దీనినే చెబుతున్నారు. ఆనాడు (2016 ఏప్రిల్ 22న) మహారాష్ట్రలోని గడ్చిరోలిజిల్లా బామ్రాగడ్ తాలూకా కసన్‌సూర్ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏకంగా 36 మంది మావోయిస్టులు హతమైనారు. 2021 నవంబర్ 14న గడ్చిరోలి జిల్లాలోనే కోట్గుల్ మర్దన్ తోలా అటవీ ప్రాంతంలోని ఎన్‌కౌంటర్‌లో 26 మంది నక్సల్స్ మృతి చెందారు.
తర్వాత, ప్రస్తుత కాంకేర్ ఎన్‌కౌంటరే అతి పెద్దది. తాజా ఎన్‌కౌంటర్‌తో ఈ ఏడాది ఇప్పటి వరకు 79 మంది మావోయిస్టులను భద్రతా దళాలను మట్టుబెట్టాయి. ఈనెల 2న బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు భద్రతా దళాలు ప్రవేశించని మావోయిస్టుల బలమైన స్థావరమైన దండకారణ్యం లోతట్టు ప్రాంతాల్లోకి చొరబడి వారిని మట్టుబెట్టడం ద్వారా మావోయిస్టులకు గట్టి హెచ్చరిక చేసినట్లయింది. దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టులను ఏరివేయడానికి వేసవి సమయాన్ని ఎంచుకోవడమూ భద్రతా దళాల వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు పాల్పడేందుకుగాను మావోయిస్టులు ఈ ప్రాంతంలో సమావేశమయ్యారన్న పక్కా సమాచారం ఆధారంగానే వారిపై దాడి చేసినట్లు ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన ఐపిఎస్ అధికారి ఇందిర కళ్యాణ్ చెప్పారు. ఆయన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు.
సుమారు 6,0-70 మంది నక్సల్స్ సమావేశమయినట్లు తెలిసిందని, 200 మందికి పైగా భద్రతా సిబ్బంది ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. కాగా, ఇంత భారీ ఎన్‌కౌంటర్‌లో ఒక్క భద్రతా జవాను కూడా ప్రాణాలు కోల్పోక పోవడం గమనార్హం. లోక్‌సభ తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఈనెల 19న బస్తర్ లోక్‌సభ స్థానానికి, కాంకేర్ స్థానానికి 26న రెండో విడత ఎన్నికల్లో భాగంగా పోలింగ్ జరగనుంది. గత ఏడాది నవంబర్‌లో చత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వేళ ఇదే జిల్లాలో మావోయిసుక్టలకు, భద్రతాదళాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
కాగా, చత్తీస్‌గఢ్‌లో భారీ సంఖ్యలో మావోయిస్టులను మట్టుబెట్టిన భద్రతాదళాలను అభినందిస్తూ ఎక్స్‌లో హిందీలో చేసిన ట్వీట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదం నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి మోడీ సర్కార్ కట్టుబడి ఉందన్నారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ, కశ్మీర్‌లలో ఉగ్రవాదానికి దాదాపుగా చరమగీతం పాడిన తమ ప్రభుత్వం త్వరలోనే నక్సల్స్ సమస్యకూ ముగింపు పలుకుతుందన్నారు. ప్రభుత్వ విధానాలు, భద్రతా బలగాల చర్యలతో ప్రస్తుతం నక్సలిజం అతికొద్ది ప్రాంతానికి పరిమితం అయిందన్నారు. చత్తీస్‌గఢ్‌సహా యావత్ దేశం నుంచి అతి త్వరలోనే మావోయిస్టులు కనుమరుగవుతారని కూడా ఆయన చెప్పడం ఇక్కడ గమనార్హం. దేశాభివృద్ధికి, శాంతికి, యువత ఉజ్వల భవిష్యత్తుకు నక్సలిజం అతిపెద్ద శత్రువని అమిత్ షా అన్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలను కోల్పోయిన మావోయిస్టులు కాంకేర్ ఎన్‌కౌంటర్ తర్వాత తిరిగి పుంజుకోవడానికి చాలా సమయమే పట్టవచ్చు.