23-02-2025 11:05:53 PM
నాటి సమాధులు (డాల్మెన్ల) గుర్తింపు..
క్రీ.ఫూ 2 వేల నుంచి వెయ్యేండ్ల మధ్యవని అంచనా..
దక్షిణ భారతంలోనే అరుదైనవని కొత్త తెలంగాణ చరిత్ర బృందం వెల్లడి..
నల్లగొండ (విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలో ఇనుపయుగపు ఆనవాళ్లను చారిత్రక పరిశోధకులు గుర్తించారు. గుడిపల్లి మండల కేంద్ర శివారులో దక్షిణ భారతదేశంలోనే అరుదైన ఇసుపయుగపు సమాధులు (డాల్మెన్)ను గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు బోయ శ్రీనివాస్‌రెడ్డి సమాచారం మేరకు ఆదివారం గుడిపల్లి శివారులోని ఎలమ్మబండను పరిశీలించి అరుదైన గూడు సమాధులు గుర్తించినట్లు ఆయన తెలిపారు.
ఇవి క్రీ.పూ 2 వేల నుంచి వెయ్యేండ్ల నాటి మధ్యవని అంచనా వేశారు. ఏడడుగుల ఎత్తు, ఐదడుగుల వెడల్పు, అడుగు మందంతో ఉన్న ఈ నిలుపురాళ్లను చనిపోయిన వారిని పూడ్చి వారి జ్ఞాపకంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇక్కడున్న రెండు డాల్మెన్ సమాధులు ప్రస్తుతం ఆనవాళ్లు కోల్పోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. చారిత్రక ఆనవాళ్లను పరిరక్షించుకోవాలని గ్రామస్తులకు సూచించారు.