- నకిలీ వైబ్‌సైట్లు సృష్టించి అసత్యాలు ప్రచారం
- ట్రంప్ ఓటమే లక్ష్యంగా కార్యాకలాపాలు
- మైక్రోసాఫ్ట్ నివేదిక వెల్లడి
న్యూయార్క్, ఆగస్టు 9: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇరాన్ జోక్యం చేసుకుంటోందని మైక్రోసాఫ్ట్ ఆరోపణలు చేసింది. ఎలక్షన్లపై ప్రభావం చూపేలా ఈ మధ్య ఆన్‌లైన్ కార్యాకలాపాలను సాగిస్తోందని తెలిపింది. ఎన్నికల ప్రచారమే లక్ష్యంగా ఈమెయిల్ ఫిషింగ్ చేస్తోందని తన నివేదికలో వెల్లడించింది. కొన్ని నెలలుగా ఇరాన్‌కు చెందిన కొన్ని టీంలు వీటిపైనే పనిచేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది.
నకిలీ వార్తా వెబ్‌సైట్లు, సామాజిక కార్యకర్తల్లా నటించడం వంటి అనేక మార్గాల్లో ఓటర్ల మధ్య విభజనకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. అన్నింటికన్నా ముఖ్యంగా అమెరికా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే కీలక రాష్ట్రాలపైనే దృష్టి సారించారని, అందుకు సంబంధించిన ఆధారాలు, ఆ బృందాలు అనుసరిస్తున్న విధానానాలను మైక్రోసాఫ్ట్ కచ్చితంగా పేర్కొనడం గమనార్హం.
సులేమానీ హత్యకు ప్రతీకారంగా..
ఇటీవల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఇరాన్ ప్రచారం చేస్తోందని పలువురు అమెరికా అధికారులు ఆరోపించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2020లో ఇరాన్ కీలక కమాండర్ ఖాసీం సులేమానీని అమెరికా హతమార్చింది. అందుకు ప్రతీకారంగా ఇరాన్ ట్రంప్‌నకు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తోందని తెలుస్తోంది.