calender_icon.png 28 October, 2024 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇరాన్ క్షిపణి వ్వవస్థ ధ్వంసం

28-10-2024 12:00:00 AM

  1. ఇజ్రాయెల్ దాడుల్లో కోలుకోలేకుండా దెబ్బతిన్న ఫ్యాక్టరీలు
  2. తిరిగి పనిచేయాలంటే రెండేళ్లునా పడుతుంది

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 1న ఇరాన్ చేసిన క్షిపణి దాడులకు నాలుగు వారాల తర్వాత టెల్‌అవీవ్ ప్రతీకారం తీర్చుకుంది. అనుకున్న లక్ష్యాలు చేరు కున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొనగా, తమ సత్తా ఏంటో చూపిస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరించారు.

ఇజ్రాయెల్‌కు చెందిన 100 యుద్ధ విమానాలు 1,000 కిలోమీటర్ల దూరంపైగా ప్రయాణించి టెహ్రాన్, సమీప ప్రాంతాల్లోని 20 సైనిక, క్షిపణి స్థావరాలపై శనివారం ఉదయం కచ్చితమైన దాడులను నిర్వహించాయి. ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్ వాడిన క్షిపణుల తయారీ కేంద్రాలను టెల్‌అవీవ్ దెబ్బతీసినట్లు తెలుస్తోంది. మిస్సైళ్లలో వాడే ఘనఇంధన మిశ్రమాన్ని తయారు చేసే ప్రదేశాలనూ ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్ దాడుల్లో నలుగురు సైనికాధికారులు మరణించినట్లు తెలుస్తోంది. 

కోలుకునేందుకు రెండేళ్ల సమయం

ఈ కర్మాగారాలు తిరిగి కోలుకోవాలంటే కనీసం రెండేళ్లు పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరికరాలను ఇరాన్ సొంతంగా చేయలేదు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అణుశక్తి కేంద్రానికి రక్షణగా ఉన్న ఎస్ రక్షణ వ్యవస్థ, పార్కిన్ మిలిటరీ కాంప్లెక్స్‌లో డ్రోన్ల యూనిట్‌నూ ధ్వంసం చేశాయి. 

మా టార్గెట్లు పూర్తి చేశాం: నెతన్యాహు

తాము చెప్పినట్లుగానే ఇరాన్ దాడికి ప్రతిస్పందించామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. అందులో భాగంగానే శనివారం కచ్చితత్వంతో కూడిన శక్తిమంతమైన దాడులు చేశామని, ఇరాన్‌లో తమ లక్ష్యంగా పెట్టుకున్నవాటిని పూర్తి చేశామని చెప్పారు. 

ఇరాన్ పవరేంటో చూపించాలి: ఖమేనీ

ఇజ్రాయెల్ ప్రతీకార దాడిపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ స్పందించారు. ఇరాన్ పవర్ ఏంటో ఆ దేశానికి చూపించాలని, ఇజ్రాయెల్‌పై ఎలా ప్రతిస్పందించాలో అధికారులే నిర్ణయిస్తారని చెప్పా రు. ప్రజలు, దేశానికి మేలు జరిగేలా ఈ చర్యలు ఉండాలి. ఇజ్రాయెల్ దాడులను తక్కువ చేసి చూడొద్దన్నారు. 

ఇజ్రాయెల్‌ది ఆత్మరక్షణ చర్య

ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడిని ఆత్మరక్షణ చర్యగా అమెరికా అభివర్ణించింది. మళ్లీ ప్రతీకార దాడులకు దిగి సమస్య మరింత తీవ్రం కాకుండా చూసుకోవాలని ఇరాన్‌ను పెంటగాన్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ హెచ్చరించారు. దాడుల గురించి ఇజ్రాయెల్ ముందే తమకు సమాచారం ఇచ్చిందని, కానీ ఇందుకు అమెరికా ఎలాంటి సాయం చేయలేదని పేర్కొన్నారు.  

గాజా, బీరుట్, సిరియాల్లో దాడులు

హమాస్ లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఆదివారం ఉత్తర గాజాపై టెల్‌అవీవ్ చేసిన దాడుల్లో 22 మంది పౌరులు మరణించారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో ఎక్కువమంది మహిళలు, పిల్లలే ఉన్నారని పేర్కొంది. లెబనాన్, సిరియాల్లోనూ ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది.