calender_icon.png 2 October, 2024 | 5:56 AM

ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర దాడి

02-10-2024 01:57:37 AM

వందలాది రాకెట్లు, బాలిస్టిక్ మిస్సైళ్ల ప్రయోగం

ఇజ్రాయెల్ నలుమూలలా దాడులు 

హైఅలర్ట్ ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రభుత్వం

సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు ఆదేశం

ఇరాన్ ప్రత్యక్ష యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్రమైన ఉద్రిక్తతలు 

టెల్‌అవీవ్ (ఇజ్రాయెల్), అక్టోబర్ 1:  ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి దిగుతూ భీకర దాడులు మొదలుపెట్టింది. అమెరికా ముందునుంచి హెచ్చరిస్తున్నట్లే క్షిపణులతో ఇజ్రాయెల్‌పై మంగళవారం రాత్రి విరుచుకుపడింది. దాదాపు ౫౦౦ రాకెట్లతో పాటు బాలిస్టిక్ మిస్సైళ్లను కూడా ఇరాన్ ప్రయోగించింది.

ఇజ్రాయెల్ నలుమూలలా దాడులు చేస్తోంది. ఇందులో కొన్ని మిస్సైళ్లను ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ నిలువరించినప్పటికీ మరికొన్ని భూభాగంపై పడినట్లు తెలుస్తోంది. టెల్‌అవీవ్‌పైకి రాకెట్లు దూసుకొచ్చినట్లు తెలుస్తోంది. పౌరులు బాంబ్ షెల్టర్లలో తలదాచుకున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ పేర్కొంది.

హైఅలర్ట్ ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ విదేశాంగశాఖ కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ పౌరులను రక్షించేందుకు ఎలాంటి చర్యలనైనా ఐడీఎఫ్ చేపడుతుందని పేర్కొంది.

ప్రస్తుతం జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి దిగడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ప్రతీకార దాడులకు ఎదుర్కొనేం దుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది.   

టెల్‌అవీవ్‌లో ఉగ్రదాడి

ఇజ్రాయెల్ వాణిజ్య రాజధాని టెల్‌అవీవ్‌లో కొంతమంది సాయుధులు మంగళవా రం కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. లైట్ రైల్ స్టేషన్ నుంచి వచ్చి కాల్పులు జరిపినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.       

లెబనాన్‌లో భూతల దాడులు

లెబనాన్‌లో ఇజ్రాయెల్ భూతల దాడులను మొదలుపెట్టింది. ఈ విషయమై అమెరికాకు ఇజ్రాయెల్ సమాచారం అందించింది. కొన్ని రోజులుగా లెబనాన్‌పై ఇజ్రాయె ల్ చేస్తోన్న వైమానిక దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా సహా ఏడుగురు కీలక నేతలు హతమయ్యారు. మొదటినుంచి వైమానిక దాడులతో విధ్వంసం లెబనాన్‌లో సృష్టించిన ఇజ్రాయెల్ భూతల దాడులకు మార్గం సుగ మం చేసుకుంది.

అత్యంత శక్తిమంతమైన డివిజన్ 98 పారాట్రూపర్ కమాండర్లు బ్రిగేడియ ర్ జనరల్ గయ్‌లెవి నాయకత్వంలో సోమవారం రాత్రి లెబనాన్‌లోకి అడుగుపెట్టారు. కేవలం సరిహద్దుల వద్ద ఉన్న స్థావరాలపైనే ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నట్లు సమాచారం. సరిహద్దు నుంచి 60 కి.మీ. దూరంలోని పౌరులంతా ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సూచించిం ది. ఈ దాడుల్లో ఇప్పటివరకు వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

ఇజ్రాయెల్ భూతల దాడులపై స్పందించిన హెజ్బొల్లా ప్రతినిధి మహమ్మద్ అఫిఫీ.. లెబనాన్‌లోకి దళాలు ప్రవేశించాయనే ప్రకటన అవాస్తవమని చెప్పారు. ఇజ్రాయెల్‌తో ముఖాముఖి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌పై మధ్యశ్రేణి క్షిపణుల ను ప్రయోగించామని, ఇది ప్రారంభం మాత్రమేనని హెచ్చరించారు. 

అక్టోబర్ 7 తరహా దాడులకు ప్లాన్

ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 7 తరహా దాడులకు హెజ్బొల్లా ప్రయత్నాలు చేస్తోందని టెల్ అవీవ్ ఆరోపించింది. ఇందుకోసం సరిహద్దుల్లోని లెబనాన్ గ్రామాల్లో సైనిక స్థావరాలను హెజ్బొల్లా ఏర్పాటు చేసిందని, ఈ ప్లాన్‌కు కాంకర్ ద గలిలీ అనే పేరుపెట్టినట్టు చెప్పింది. మరోసారి తమ సరిహద్దుల్లో అక్టోబర్ 7 తరహా దాడులు జరగనీయమని ఐడీఎఫ్ ప్రతినిధి డానియల్ హగారీ స్పష్టం చేశారు. 

గాజాపై దాడిలో 21 మంది మృతి 

గాజాలోని హమాస్ కమాండ్ సెంటర్లపై ఇజ్రాయెల్ మంగళవారం చేసిన వైమానిక దాడుల్లో 21 మంది చనిపోయారని స్థానిక వైద్యులు వెల్లడించారు. నుసైరత్‌లోని రెండు భవనాలపై జరిగిన దాడిలో 13 మంది మహిళలు, చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. తుఫ్ఫా నగరంలో పాలస్తీనా కుటుంబాలకు ఆశ్రయం కల్పించిన ఓ పాఠశాలపైనా ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు తెలుస్తోంది. కాగా, హమాస్ ఉగ్రవాదుల స్థావరాలపైనే దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. 

ఇరాన్ ప్రభుత్వంలో మొస్సాద్ ఏజెంట్లు 

ఇరాన్‌లో ఇజ్రాయెల్ గూఢచర్యాన్ని ఎదుర్కోవడానికి పనిచేసిన సీక్రెట్ సర్వీస్ యూనిట్ చీఫ్ స్వయంగా ఇజ్రాయెల్ కోసం పనిచేశాడని ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీ నెజాద్ బాంబు పేల్చారు. 2021లో ఇజ్రాయెల్ నిఘా కార్యకలాపాల బాధ్యత వహించే అత్యంత సీనియర్ వ్యక్తి మొస్సాద్ ఏజెంట్ అని తెలిసిందని నెజాద్ వెల్లడించారు. ఈ విషయంలో ఇప్పటికీ ఇరాన్ మౌనంగా ఉందని తెలిపారు.

ఇరాన్ నిఘా విభాగంలో ఇప్పటికీ 20 మంది ఇజ్రాయెల్ ఏజెంట్లు ఉన్నారని చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన సమాచారా న్ని కూడా ఇలాంటి ఏజెంట్ల ద్వారానే లీకైందని పేర్కొన్నారు. అణు శాస్త్రవేత్తలను సైతం వీరు చంపారని ఆరోపించారు. హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా ఆచూకీ కూడా వీరే వెల్లడించినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

భారత్ అలర్ట్

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. ఇజ్రాయెల్‌లోని భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలని టెల్‌అవీవ్‌లోని భారత ఎంబసీ అలర్ట్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దని సూచించిది.