calender_icon.png 16 October, 2024 | 2:19 PM

ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర?

16-10-2024 03:51:48 AM

అది అమెరికాపై దాడే

ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక

వాషింగ్టన్, అక్టోబర్ 15: అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల హత్యాయత్నాలు జరుగుతుండడంతో అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ట్రంప్‌ను చంపడానికి ఇరాన్ ప్రయత్నిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ హిట్ లిస్ట్‌లో ట్రంప్ పేరు ఉండడంతో ఆ దేశానికి అగ్రరాజ్యం వార్నింగ్ ఇచ్చింది.

ఒకవేళ ట్రంప్ హత్యకు కుట్ర జరిగితే దానిని అమెరికాపై జరిగిన దాడిగానే భావిస్తామని వైట్‌హౌజ్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ట్రంప్ భద్రతపై అధ్యక్షుడు జో బైడెన్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఎటువంటి కుట్రలు చేసినా, బెదిరింపు చర్యలకు పాల్పడినా ఇరాన్  తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని వైట్‌హౌజ్ హెచ్చరించింది.

దాడిని అమెరికాపై యుద్ధాన్ని ప్రేరేపించే చర్యగా భావిస్తామని తెలిపింది. అమెరికా పౌరుడిపై ఎక్కడైనా దాడి జరిగితే దానిని జాతీయ భద్రతకు హాని జరిగినట్టుగా పరిగణిస్తామని పేర్కొంది. ఇరాన్ కుట్రలపై దృష్టి పెట్టాలని అధ్యక్షుడు సూచిం చారని తెలిపింది. దీంతో ట్రంప్ హత్యాయత్నానికి కుట్రలు ఆపేయాలని ఇరాన్ ఉన్నతస్థాయి అధికారులకు ఓ మెస్సేజ్‌ను పంపినట్లు పేర్కొంది.

మరోవైపు ట్రంప్ హత్యకు తాము కుట్ర పన్నినట్లు వచ్చిన వార్తలను ఇరాన్ తోసిపుచ్చింది. అమెరికా వ్యవహారాల్లో తాము ఎటువంటి జోక్యం చేసుకోబోమని తెలిపింది. అమెరికానే 1953 నుంచి ఇప్పటివరకు తమ దేశంలో జోక్యం చేసుకుని అనేక కుట్రలకు పాల్పడుతోందని ఇరాన్ పేర్కొంది.