calender_icon.png 28 September, 2024 | 7:00 AM

నా హత్యకు ఇరాన్ కుట్ర

26-09-2024 02:38:21 AM

  1. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
  2. తోసిపుచ్చిన ఇరాన్ ప్రభుత్వం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బుధవారం తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మరోసారి అధ్యక్షుడిగా గెలవకూడదనే ఉద్దేశ్యంతో నన్ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర చేస్తోందని ఆరోపించారు.

గతంలోనూ ఆ దేశం తనపై హత్యాయత్నం చేసినప్పటికీ అది ఫలించలదేని, అందుకే మరోసారి తనపై కుట్ర చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఒకవేళ ఇదే జరిగితే నా మరణానంత రం అమెరికా నాయకులు ఇరాన్‌ను ప్రపం చ పటంపై లేకుండా చేస్తారని తాను ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఒకవేళ అలా చేయ కుంటే అమెరికన్ నాయకులను పిరికిపందలుగా లెక్కగడుతారని అన్నారు.

ఇరాన్‌ను పాలిస్తున్న ఉగ్రవాద మూలాలున్న నాయకులు కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్షురా లిగా ఎన్నిక కావాలని కోరుకుంటున్నారని, అలాగే అమెరికాలో అస్థిరత, గందరగోళాన్ని సృష్టించాలని అనుకుంటున్నారని ట్రంప్ ఆరోపించారు. ఇంత జరుగుతున్నా యూఎస్ మిలిటరీ పట్టించుకోవడం లేదని ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  

కాంగ్రెస్‌కు ధన్యవాదాలు 

అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీల హెచ్చరికలపై ట్రంప్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘నాపై ఇరాన్ హత్యాయాత్నాల నేపథ్యంలో రక్షణ కల్పించేందుకు సీక్రెట్ సర్వీస్‌కు ఏకగ్రీవంగా నిధులు సమకూర్చిన కాంగ్రెస్‌కు ధన్యవాదాలు. ఈ విషయంలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఏకతాటిపైకి రావడం చాలా ఆనందంగా ఉంది.

ఒక మాజీ అధ్యక్షుడిపై హత్యాయత్నం అంటే దాడి చేసిన నిందితుడికి మరణమే’ అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా గతంలోనూ ట్రంప్‌పై రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయి. జూలై 12న పెన్సిల్వేనియాలో జరిగిన ర్యాలీలో ట్రంప్‌పై మెదటి హత్యాయత్నం జరుగగా.. ఆ సమయంలో ట్రంప్ చెవిభాగం నుంచి బుల్లెట్ దూసుకుపోయింది. అనంతరం ఫ్లోరిడాలోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో ట్రంప్‌పై రెండో హత్యాయత్నం జరిగింది.