calender_icon.png 30 April, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టును ఆశ్రయించిన ఐపీఎస్‌లు

30-04-2025 01:07:20 AM

  1. భూదాన్ భూముల వ్యవహారంపై జస్టిస్ భాస్కర్‌రెడ్డి తీర్పును సవాల్ చేసిన మహేశ్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్యా మిశ్రా
  2. నిషేధిత జాబితాలో 27 మంది అధికారుల భూములు

హైదరాబాద్, ఏప్రిల్ 29: భూదాన్ భూము ల వ్యవహారంపై పలువురు ఐపీఎస్ అధికారులు మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై ఇటీవల విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం 27 మంది అధికారులకు సంబంధించిన భూములను నిషేధిత జాబి తాలో పెట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ భాస్కర్‌రెడ్డి సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పు వెలువరించింది.

ఈ తీర్పును సవా ల్ చేస్తూ తాజాగా కొందరు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. వారిలో ఐపీఎస్‌లు మహేశ్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్యా మిశ్రా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూదాన్ భూముల కబ్జా, అక్రమాలపై దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చడానికి సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని కోరుతూ మహేశ్వరం మండలానికి చెంది న బిర్ల మల్లేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి ఏప్రిల్ 24న విచారణ చేపట్టారు. తీర్పు వెలువడే వరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రా మంలోని సర్వే నంబర్లు 181, 182, 194, 195 సర్వే నంబర్లలోని భూములను తదుపరి తీర్పు వెలువడే వరకు నిషేధిత జాబితాలో చేర్చాలని ఆదేశాలు జారీ చేశారు. అదీగాక ఆరోపణల తీవ్ర త దృశ్యా పిటిషనర్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకునే అవకాశాన్ని ఇవ్వడం లేదని పేర్కొంది.

కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. కాగా భూదాన్ భూముల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం సోదాలు నిర్వహిం చింది. ఐదు ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో భారీ సంఖ్యలో కార్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో ఆస్తి పత్రాలు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు.

భూదాన్ భూములు కొన్న అధికారులు..

రవి గుప్తా (ఐపీఎస్)- 16 గుంటలు, స్వాతి లక్రా (ఐపీఎస్)- 16 గుంటలు, సౌమ్య మిశ్రా (ఐపీఎస్)- 16 గుంటలు, మహేశ్ భగవత్ (ఐపీఎస్)- 16 గుంటలు, తరుణ్ జోషి (ఐపీఎస్)- 16 గుంటలు, రాజర్షి షా (ఐఏఎస్)- 8 గుం టలు, నవీన్ మిట్టల్ (ఐఏఎస్)- 20 గుంటలు, అజయ్ జైన్ (ఐఏఎస్)- 20 గుంటలు, రాహుల్ హెగ్డే (ఐపీఎస్)- 8 గుంటలు.

ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు

రికార్డులను తారుమారు చేయడం సహా ప్రభుత్వ భూమిని అక్రమంగా విక్రయించిన ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వ అధికారులపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. మహేశ్వరం మండలంలోని నాగారంలో ప్రభుత్వ భూమిని ఖాదేరునిస్సా తన పూర్వీకుల ఆస్తిగా తప్పుడు పత్రాలతో మార్పు చేసుకున్నట్టు దర్యాప్తులో తేలింది.

రికార్డులను మ్యుటేట్ చేశారని, ఆ భూమిని అనేక మంది మధ్యవర్తులతో కలిసి వివిధ సంస్థలకు విక్రయించారని స్పష్టం చేసింది. ఫలితంగా ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రైవేటుకు విక్రయించినట్టు తేలింది.

ఖాదేరునిస్సా, మొహమ్మద్ మునావర్ ఖాన్, మొహమ్మద్ లతీఫ్ షర్ఫాన్, మొహమ్మద్ అక్తర్ షర్ఫాన్, సుకూర్‌లపై కేసు నమోదు చేసింది. రూ. 23 లక్షలు, 12వేల యూఏఈ దిరామ్ విదేశీ కరెన్సీకి సంబంధించిన నేరారోపణ పత్రాలతో పాటు మునావర్ ఖాన్ ఫామ్‌హౌజ్‌లో వింటేజ్ కార్లతో పాటు మరో 45 కార్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ పేర్కొంది.