calender_icon.png 24 March, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐపీఎల్ ఆరంభం అదుర్స్

23-03-2025 01:07:08 AM

  1. ఈడెన్ గార్డెన్స్‌లో అంగరంగ వైభవంగా..
  2. ఉర్రూతలూగించిన గాయకులు శ్రేయా ఘోషల్, కరణ్ ఔజ్లా
  3. దిశా పటానీ నృత్యానికి స్టెప్పులేసిన షారుఖ్, కోహ్లీ

కోల్‌కతా, మార్చి 22: ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 18వ సీజన్ శనివా రం అట్టహాసంగా ప్రారంభమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆరంభ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మిరుమిట్లు గొలిపే కాంతుల దగదగలు.. బాణాసంచా వెలుగుల్లో.. దాదాపు లక్షమందికి పైగా అభిమానుల కేరింతలు, కరతాళ ధ్వనుల మధ్య ఐపీఎల్ 2025 సీజన్ షురూ అయింది.

ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఐపీఎల్ నిర్వాహకులు ముందే తెలపడంతో మధ్యాహ్నం నుంచే క్రికెట్ అభిమానులు ఈడెన్ గార్డెన్‌కు పోటెత్తారు. వేడు కల ఆరంభానికి ముందే స్టేడియం మొత్తం నిండిపోయింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ సహ యజమాని, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తన ప్రసంగంతో అలరించాడు.

అనంతరం గాయకులు శ్రేయా ఘోషల్, ర్యాప్ సింగర్ కరణ్ ఔజ్లా తమ పాటలతో అభిమానులను అలరించా రు. ముఖ్యంగా శ్రేయా ఘోషల్ దేశభక్తి గీ తం ఆలపించిన సమయంలో అభిమానులు ‘వందేమాతరం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం కనిపించింది.

ఇక బాలీవుడ్ నటి దిశా పటాని తన నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇక స్టేడియంలోకి ఇరుజట్లు అడుగుపెట్టిన సమ యంలో స్టేడియం మొత్తం ‘కోహ్లీ’ నామస్మరణతో మార్మోగిపోవడం విశేషం. పటాన్ సినిమాలోని ‘మేరీజాన్’ పాటకు షారుక్‌తో కలిసి విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేయడాన్ని ప్రేక్షకులు ఆస్వాదించారు. 

ఐపీఎల్ ట్రోఫీ ఆవిష్కరణ

ప్రారంభ వేడుకలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన షారుక్ ఖాన్ బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తదితరులను వేదిక పైకి ఆహ్వానించాడు. ఈ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదార్, కోల్‌కతా నైట్ రైడర్స్ సారథి అజింక్యా రహానే ఐపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించారు.

అనంతరం రోజర్ బిన్నీ, దేవ్‌జిత్ సైకియా, రాజీవ్ శుక్లా, అరుణ్ ధమాల్ కలిసి ‘ఐపీఎల్ 18’ పేరుతో ప్రత్యేకంగా తయారు చేసిన కేక్‌ను కట్  చేశారు. వరుసగా 18 సీజన్ల పాటు ఒకే జట్టుకు ఆడుతూ వస్తోన్న విరాట్ కోహ్లీకి ‘ఐపీఎల్ 18’ మెమెంటోను బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అందించారు.

వేడుకల్లో భాగంగా చివరగా భారత జాతీయ గీతం ‘జనగణమన’ ఆలపించారు. అనంతరం మైదానం నుంచి రంగు రంగుల తారాజువ్వలు నింగిలోకి దూసుకెళ్లడంతో ఆరంభ వేడుకలు ముగిశాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఏంచుకుంది.