బీసీసీఐ అధికారిక ప్రకటన
న్యూఢిల్లీ: ఐపీఎల్ మెగావేలం ఈ నెల 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దాహ్ వేదికగా జరగనుంది. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. విదేశాల్లో ఐపీఎల్ వేలం నిర్వహించడం ఇది రెండోసారి. ఈసారి వేలంలో మొత్తం 1574 క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 1165 మంది భారత క్రికెటర్లు కాగా మిగిలిన వారిలో 409 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
ఒక్కో జట్టు 25 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. లిస్టులో మొత్తం 320 మంది క్యాప్‌డ్ ప్లేయర్స్ ఉండగా.. టీమిండియా నుంచి 48 మంది ఉన్నారు. ఈసారి వేలంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్, అర్ష్‌దీప్ లాంటి స్టార్ల కోసం ఫ్రాంచైజీలు భారీగా వెచ్చించే అవకాశముంది.
204 స్లాట్స్ కోసం 10 ఫ్రాంచైజీలు రూ. 641.5 కోట్లు ఖర్చు చేయనుండగా.. ఇందులో 70 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇక రిటెన్షన్ లిస్టులో పది ఫ్రాంచైజీలు 46 మందిని అట్టిపెట్టుకున్నాయి. వేలంలో అత్యధికంగా పంజాబ్ రూ. 110.5 కోట్లు .. అత్యల్పంగా రాజస్థాన్ రూ. 41 కోట్లు ఖర్చు చేయనున్నాయి.