* దేవుడి ఖాతాలోకే వెళ్తుందన్న ఆలయ యాజమాన్యం
* తిరిగి ఇచ్చేందుకు నిరాకరణ
చెన్నై, డిసెంబర్ 21: తమిళనాడులోని ఆలయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. విజయపురానికి చెందిన దినేష్ దైవ దర్శనం కోసం చెన్నై సమీపంలోని కందస్వామి ఆలయానికి వెళ్లారు. ఈ క్రమంలోనే దేవుడి హుండీలో డబ్బులు వేస్తుండగా అతడి ఐఫోన్ అనుకోకుండా హుండీలో పడిపోయింది. జరిగిన విషయాన్ని ఆలయ యాజమాన్యానికి చెప్పి, తన ఫోన్ ఇప్పించాలని కోరారు. అయితే ఫోన్ హుండీలో పడినందువల్ల అది ఆలయ ఆస్తి కిందకు వస్తుందని పేర్కొని ఫోన్‌ను ఇచ్చేందుకు తిరస్కరించారు. అయితే ఫోన్‌లోని డేటా మాత్రం తీసుకోవచ్చని స్పష్టం చేశారు. దీంతో దినేష్ హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ అధికారులకు, స్థానిక మంత్రి శేఖర్ బాబుకు జరిగిన విషయాన్ని వివరించి, తన ఫోన్ ఇప్పించాల్సిందిగా కోరారు. అయితే హుండీలో జమ చేసిన వస్తువు తిరిగి ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవని మంత్రి పేర్కొన్నారు. కానీ అధికారులతో చర్చించి నష్టపరిహారాన్ని అందించే అంశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.