calender_icon.png 3 October, 2024 | 3:59 AM

ఏఐతో ఐఫోన్ 16 వచ్చేసింది

11-09-2024 12:00:00 AM

ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఐఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 సిరీస్‌ను యాపిల్ న్యూయార్క్‌లో ఆవిష్కరించింది. ఇది ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో డిజైన్ చేసిన తమ తొలి స్మార్ట్‌ఫోన్ అని యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌కు ఆర్డర్ల బుకింగ్ సెప్టెంబర్ 13న మొదలవుతాయి. సెప్టెంబర్ 20 నుంచి కొనుగోళ్లకు అందుబాటులో ఉంటుంది. సోమవారం రాత్రి యూఎస్‌లో జరిగిన యాపిల్ ఈవెంట్‌లో ఐఫోన్ 16 సిరీస్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ 4లను కూడా ఆవిష్కరించింది. అలాగే యాపిల్ అల్ట్రా 2, ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్‌లకు కొన్ని అప్‌డేట్స్‌ను ప్రకటించింది. 

కొత్త ఐఫోన్ ఫీచర్లు

  1. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ స్క్రీన్ సైజ్  గత మోడల్స్ (ఐఫోన్ 15 ప్రొ,  ఐఫోన్ ప్రొ మ్యాక్స్)కంటే పెద్దది. తాజా ఐఫోన్ 16 ప్రొ 6.3 అంగుళాల డిస్‌ప్లే, యాపిల్ 16 ప్రొ మ్యాక్స్ 6.9 అంగుళాల డిస్‌ప్లేతో రూపొందించారు.  
  2. కొత్త ఐఫోన్ మోడల్స్ ఇప్పటివరకూ ఏ యాపిల్ గాడ్జెట్ లేనంతగా అతిసన్నటి బోర్డర్స్‌తో ఉంటాయని యాపిల్ తెలిపింది. 
  3. రెండేండ్ల తర్వాత యాపిల్ ఐఫోన్ కొత్త సిరీస్ ప్రొసెసర్‌ను అప్‌గ్రేడ్ చేసింది. దీంతో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్‌లు కొత్త ప్రాసెసర్లతో వస్తున్నాయి. 
  4. ఐఫోన్ 16 సిరీస్ కెమేరాకు ఫిజికల్ బటన్స్ అమర్చారు. ‘కెమేరా కంట్రోల్’గా వ్యవహరించే ఈ బటన్ ఫోటో, వీడియో తీయడాన్ని సులభతరం చేస్తుంది. 
  5. డిస్‌ప్లేను స్క్రాచెస్ నుంచి రక్షించడానికి గతంలో ఏ మోడల్‌కు లేనంత టాఫ్ గ్లాస్‌తో ఐఫోన్ 16ను రూపొందించారు. 
  6. ఐఫోన్ 16 మోడల్‌కు 6.1 అంగుళాల స్క్రీన్, ఐఫోన్ 16 ప్లస్‌కు 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉంటాయి. కెమేరా కంట్రోల్‌కు టచ్‌సెన్సిటివ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. 

భారత్‌లో ధర

యాపిల్ ఐఫోన్ 16 ప్రొ మోడల్స్‌ను గత ఐఫోన్ 15 ప్రొ మోడల్స్‌కంటే తక్కువ ధరకు లభిస్తాయి. యాపిల్ చరిత్రలో గత మోడల్స్‌కంటే కొత్త మోడల్స్ ధరల్ని తక్కువగా నిర్ణయించడం ఇదే ప్రధమం. ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ 16 ప్రొమ్యాక్స్‌లు ఐఫోన్ 15 ప్రొ, ఐఫోన్ 15 ప్రొమ్యాక్స్‌లకంటే రూ.15,000 తక్కువగా అందుబాటులో ఉంటాయి. ఇటీవలి కేంద్ర బడ్జెట్లో సుంకాల్ని తగ్గించిన ఫలితంగా కొత్త ఐఫోన్ల ధరలు తగ్గనున్నాయి. 

దేశంలోనే తయారీ

ఐఫోన్ 16 ప్రొ మోడల్స్‌ను యాపిల్ భారత్‌లోనే తయారు చేస్తున్నది.