మహాయాగానికి విచ్చేయాలని ‘విజయక్రాంతి’ దినపత్రిక చైర్మన్ చిల్లప్పగారి లక్ష్మీరాజంను ఆహ్వానిస్తున్న ఏపీ విశ్రాంత సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, కోర్ కమిటీ సభ్యులు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 12 (విజయక్రాంతి): శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, శ్రీ కంచి కామాక్షి పీఠం, విజయనగరం చిన్మయి సేవాట్రస్ట్ సంయుక్త ఆధ ర్వ్యంలో అయోధ్యలో ఈ నెల 18 నుంచి 2025 జనవరి 1 వరకు నిర్వహించనున్న శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహాయాగానికి హాజరుకావాలని విజయక్రాంతి చైర్మన్ చిల్లప్పగారి లక్ష్మీరాజంను మహాయాగం కోర్ కమిటీ సభ్యులు ఆహ్వానించారు.
ఈ మేరకు మహాయాగం కోర్ కమిటీ సభ్యులు, ఉమ్మడి ఏపీ పూర్వ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, బీఎస్‌ఎస్‌ఎఫ్ చైర్మన్ బస్వరాజు శ్రీనివాస్, లఘు ఉద్యోగ్ భారతి తెలంగాణ కార్యదర్శి, బీఎస్‌ఎస్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి దాడిగం రామ్‌సుందర్ శర్మ మంగళవారం సీఎల్‌రాజంను కలిసి మహాయాగం ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
సనాతన ధర్మ పరిరక్షణ, ప్రపంచ శాంతి, సార్వత్రిక శ్రేయెస్సును కాంక్షిస్తూ మహాయాగం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అయోధ్యలో 45 రోజుల పాటు జరిగే ఈ యాగం.. బ్రహ్మర్షి యనమండ్ర వేణుగోపాల శాస్త్రీ ఆధ్వర్యంలో జరుగనున్నట్టు తెలిపారు. దేశం నలుమూలల నుంచి అత్యద్భుత ప్రతిభ కలిగిన 1200 మంది వేద పండితులు పాల్గొంటారని అన్నారు.