27-02-2025 02:08:46 AM
రెండు రోజుల్లో కార్మికులను కాపాడుతాం: మంత్రి ఉత్తమ్
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో ఎనిమిది మంది కార్మికులు గల్లంతై సుమా రు ఐదు రోజులు కావస్తున్నా వారి జాడ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యు లు తల్లడిల్లుతున్నారు. మంగళవారం రాత్రి ర్యాట్ హోల్ మైన్స్ రెస్క్యూ బృందం ఘట నాస్థలికి వెళ్లిన నేపథ్యంలో రెస్క్యూ టీం కార్మికులకు సైతం ఘటనాస్థలి ప్రాంతంలో కార్బన్ మోనాక్సైడ్ తీవ్రత వల్ల ఆక్సిజన్ అందక సరిగ్గా 20 నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో క్షతగాత్రులైన కార్మికులు ఊపిరితో ఉండ టం కష్టతరమేనని ర్యాట్‌హోల్ మైనింగ్ రెస్క్యూటీమ్, ఎన్డీఆర్‌ఎఫ్ టీం సభ్యులు చెపుతున్నారు.
బుధవారం సాయంత్రం మరో మారు 11 రకాల రెస్క్యూ బృందాలు సొరంగ మార్గానికి వెళ్లి గ్యాస్ కట్టర్ ద్వారా టీబీఎం మిషన్ తొలగించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు దీంతోపాటు కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేసేందుకు ప్రతినిధులు సొరంగ మార్గానికి వెళ్లారు. ప్రమాదం జరిగిన దగ్గర టీబీఎం ముక్కలై, దాని విడిభాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
దీంతో అక్కడ సహాయ చర్యలు కష్టంగా మారాయి. ఓవైపు బురద, ఇంకోవైపు సీపేజ్ వాటర్, మరోవైపు టీబీఎం ముక్కలతో అత్యంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్యాస్ కట్టర్లను ఉపయోగించి ప్రక్రియను నిర్వహించాలనుకుంటే, ఉబికి వస్తున్న నీరు అడ్డంకిగా మారింది.
సురక్షితంగా బయటకు తెస్తాం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సొరంగంలోని 14వ కిలోమీటర్ వద్ద జరిగిన ప్రమాదంలో మొదటి నుంచి నీటి ఊటతోపాటు భారీ బండరాళ్లు, బురద సహాయక చర్యలు ఇబ్బం దులు కలిగిస్తున్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మట్టిని, బురద ను, నీటి ఊటను తొలగించేందుకు రెస్క్యూ టీం బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పారు.
రెస్క్యూ టీం భద్రత విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తూ ఎదురవుతు న్న అవాంతరాలను అధిగమిస్తూ రెండు రోజుల్లోనే ఆపరేషన్ పూర్తి చేసి కార్మికులను సురక్షితంగా బయటికి తెస్తామని మంత్రి మీడియాతో అన్నారు. 14వ కిలోమీటర్ వద్ద డేంజర్ జోన్‌గా ఉన్న ప్రాంతాన్ని అత్యంత పకడ్బందీగా రెస్క్యూ ఆపరేషన్ చేసి వీలైతే టీబీఎం మిషన్‌ని గ్యాస్ కట్టర్ల ద్వారా విడిభాగాలుగా చేసి సుమారు 16 టన్నుల బరువున్న టీబీఎం మిషన్ సైతం బయటికి తీస్తామని పేర్కొన్నారు.
మరోపక్క ఎనిమిది మంది కార్మికులు బురదలోనే కూరుకుపోయి సజీవ సమాధి అయి ఉంటారన్న వార్తలు పెరుగుతుండటంతో బాధిత కార్మికుల కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది.