calender_icon.png 5 January, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనిపించని పురోగతి!

03-01-2025 12:00:00 AM

  1. అభివృద్ధికి నోచుకోని కామారెడ్డి మున్సిపాలిటీ
  2. నిధుల కొరతతో ముందుకు సాగని పనులు
  3. ప్రభుత్వ మార్పుతో మరింత ప్రభావం
  4. పాలకవర్గానికి మిగిలింది కొన్ని రోజులే
  5. పనులు ఆగిన వార్డుల్లోని కౌన్సిలర్లలో గుబులు

కామారెడ్డి, జనవరి 2 (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపాలిటీ చుట్టూ ఉన్న ఏడు గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. గతంలో 33 వార్డులుండగా ఆ సం ఖ్య 49కి పెరిగింది. దీంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని భావించిన ప్రజలకు నిరుత్సాహమే మిగిలింది. ప్రభుత్వం నుంచి నిధులు రాక మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.

చేసిన పనులకూ బిల్లులు రాక కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీఆర్‌ఎస్‌కు చెం దిన 33వ వార్డు కౌన్సిలర్ నిట్టు జాహ్నవి చైర్‌పర్సన్‌గా, గడ్డం ఇందుప్రియ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నిక య్యారు. గతేడాది ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గెలవకపోవడం.. అదే సమయంలో ఇందుప్రియ భర్త చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో మున్సిపల్ రాజ కీయాలు తలకిందులయ్యాయి.

జాహ్నవిని గద్దె దింపేందుకు బీఆర్‌ఎస్ నుంచి పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ బలం పెరిగింది. దీంతో షబ్బీర్ అలీ కాంగ్రెస్ కౌన్సిలర్ల అభిప్రాయాన్ని తీసుకొని గడ్డం ఇందు ప్రియను చైర్‌పర్సన్‌గా, వనితను వైస్‌చైర్‌పర్సన్‌గా ఖరారు చేశారు. 

మున్సిపాలిటీకి కేటీఆర్ ప్రత్యేక నిధులు

కామారెడ్డి మున్సిపల్ అభివృద్ధికి అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రత్యేక నిధులు మంజూరు చేయగా.. వాటిలో ఎక్కువ మొత్తం పాత పనుల బిల్లులకే సరిపోయింది. మిగిలిన నిధులతో కేవలం కొన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. ప్రధాన రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీలు నిర్మించి, వాటిపై స్లాబ్ ఏర్పాటు చేసి ఫుట్‌పాత్ వ్యాపారాలు కొనసాగించుకునేందుకు అవకాశం కల్పిస్తామన్న అప్పటి పాలకవర్గ సభ్యులు తూతూమంత్రంగా రోడ్డు వెడల్పు పనులు చేపట్టి అర్ధాంతరంగా నిలిపేశారు.

వ్యాపారులతో సమావేశమైనా.. 

కామారెడ్డి జిల్లా కేంద్రంలో 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన మాస్టర్‌ప్లాన్ రోడ్లు సైతం నేటికీ అమలుకు నోచుకోలేదు. దీంతో ప్రయాణికులు, పట్టణ ప్రజలు నిత్యం ట్రాపిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఆరు నెలల కింద రోడ్లు వెడల్పు చేసేందుకు ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి పట్టణ వ్యాపారులతో సమావేశమై సహకరించాలని కోరారు.

ఇందుకు వ్యాపారులు రెండు నెలల గడువు కోరగా.. ఆరు నెలలు కావొస్తున్నా రోడ్డు వెడల్పు పనులపై వారు నోరు మెదపడం లేదు. గతంలో లాగానే ప్రస్తుత పాలకవర్గ సభ్యులు సైతం రోడ్డు వెడల్పు పనులు చేయించేందుకు ముందుకు రావడం లేదు. దీంతో నిజాంసాగర్ చౌరస్తా, జన్మభూమి రోడ్డు, కమాన్‌రోడ్డు, సుభాష్ రోడ్డు, సిరిసిల్లా రోడ్డు, స్టేషన్ రోడ్డు, తిలక్ రోడ్డు, అడ్లూర్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. 

విజిలెన్స్ విచారణ బుట్టదాఖలు

మున్సిపల్ నిధులు దుర్వినియోగమయ్యాయని అప్పటి బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కాటేపల్లి వెంకటరమణారెడ్డి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు విచారణ కోసం రాగా వారికి పనులకు సంబంధించిన ఫైళ్లను అప్పగించలేదు. దీంతో అప్పటి మున్సిపల్ ఆర్జేడీ సత్యనారాయణకు సైతం ఫిర్యాదులు వెళ్లినా.. రాజకీయ ఒత్తిళ్లతో విచారణ జరగకుండానే విజిలెన్స్ విచారణను బుట్టదాఖలు చేశారు.

కొన్ని వార్డుల్లో మాత్రం కౌన్సిలర్లు సొంతంగా డబ్బులు పెట్టి సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మించారు. వాటికి సంబంధించిన బిల్లులు ఇప్పటికీ అందకపోవడం గమనార్హం. తమకు అనుకూలంగా ఉండే కౌన్సిలర్లకు బిల్లులు చెల్లించి ఇతరులకు చెల్లించలేదు. దీంతో కౌన్సిలర్లలో భేదాభిప్రాయాలు మొదలై చైర్‌పర్సన్‌కు వ్యతిరేక వర్గంతో ఆధిపత్యపోరు కొనసాగడంతో అభివృద్ధి కుంటుపడింది. 

అత్యవసర పనులు పూర్తి చేశాం..

మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బా ధ్యతలు చేపట్టినప్పటి నుంచి అ త్యవసర పనుల ను మాత్రం పూర్తి చేశాం. మాకు ఉన్న సమయంలో ఆశించినంత పనులు చేశాం. నిధులు వస్తే మరిం త అభివృద్ధి చేసేవాళ్లం. కేవ లం కొన్ని వార్డుల్లోనే సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టాం. గత ప్ర భుత్వం అవలంబించిన విధానాల వల్ల మున్సిపాలిటీకి నిధులు రాక అభివృద్ధి జరగలేదు. 

- గడ్డం ఇందుప్రియ, 

మున్సిపల్ చైర్‌పర్సన్, కామారెడ్డి