న్యూఢిల్లీ, జూలై 9: దేశంలో మ్యూచువల్ ఫండ్ సిప్‌ల్లోకి (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్) జూన్‌నెలలో రికార్డుస్థాయిలో పెట్టుబడులు తరలివచ్చాయి. స్టాక్ మార్కెట్ చరిత్రాత్మక గరిష్ఠస్థాయిల్లో ట్రేడవుతున్న నేపథ్యంలో 2024 జూన్ నెలలో మ్యూచువల్ ఫండ్ సిప్‌లు రూ.21,260 కోట్ల పెట్టుబ డుల్ని ఇన్వెస్టర్ల నుంచి ఆకర్షించాయి. మే నెలలో ఈ పెట్టుబడులు రూ.20,904 కోట్లు. ఈ ఏడాది ప్రధమార్థంలో సిప్‌ల్లోకి వచ్చిన మొత్తం నిధుల ప్రవాహం రూ. 1 లక్ష కోట్ల మార్క్‌ను మించి రూ.1.19 లక్షల కోట్ల కు చేరింది. గత నెలలో మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని మొత్తం ఆస్తులు (ఏయూ ఎం) 4 శాతం పెరిగి రూ.60.89 లక్షల కోట్ల కు చేరాయి. 2024 మే నెలలో ఇవి రూ. 58.64 లక్షల కోట్లు.
రూ.15,227 కోట్లు సమీకరించిన ఎన్‌ఎఫ్‌వోలు
ఈ ఏడాది జూన్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ 17 ఓపెన్‌ఎండెడ్ న్యూ ఫండ్ ఆఫర్లను (ఎన్‌ఎఫ్‌వోలు) జారీచేశాయి. ఇవి రూ. 15,227 కోట్లు సమీకరించాయి. తాజా ఎన్‌ఎఫ్‌వోల్లో సెక్టోరల్/థీమెటిక్ ఫండ్స్ అత్యధి కంగా రూ.12,974 కోట్లు సేకరించాయి. ముగిసిన నెలలో తొమ్మిది సెక్టోరల్ ఫండ్స్ వచ్చాయి.
ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ. 40,608 కోట్లు
జూన్ నెలలో ఈక్విటీ మ్యూచు వల్ ఫండ్ స్కీముల్లో ఇన్వెస్టర్లు రికార్డుస్థాయిలో రూ. 40,608 కోట్లు పెట్టుబడి చేశారు. 2024 మే నెలకంటే జూన్‌లో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చిన నిధులు 17 శాతం పెరిగినట్టు అసోసి యేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ (యాంఫి) తెలిపింది. ఎంఎఫ్ పరిశ్రమ ఈక్విటీ స్కీముల నిర్వ హణలోని మొత్తం ఆస్తులు ప్రస్తుతం రూ.27.67 లక్షల కోట్లకు చేరినట్టు యాంఫి వెల్లడించింది.