calender_icon.png 30 January, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దావోస్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్ల వెల్లువ

25-01-2025 01:41:49 AM

  • కాంగ్రెస్ పాలనలో అమాంతం పెరిగిన పెట్టుబడులు

పదేళ్లలో మీరెన్ని పెట్టుబడులు తెచ్చారు? చర్చకు సిద్ధమా ?

బీఆర్‌ఎస్ నేతలకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సవాల్

హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): ‘తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ పర్యటనతో తెలంగాణకు ఇన్వెస్‌మెంట్ల వెల్లువ వచ్చింది. కాంగ్రెస్ పాలనలో పెట్టుబడులు అమాంతం పెరిగాయి. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రానికి మీరెన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు. పెట్టుబడులపై చర్చకు మేం సిద్ధం.. మీరు సిద్ధమా ?’ అంటూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్  సవాల్ విసిరారు.

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రూ.25,750 కోట్ల పెట్టుబడులు రాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సారథ్యంలో ‘తెలంగాణ రైజింగ్’ బృందం ప్రఖ్యాత ఐటీ, సోలార్ ఎనర్జీ, ఏయిర్ స్పేస్, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల నుంచి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చిందని కొనియాడారు.

ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో మళ్లీ రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చే అవకాశం ఉందన్నారు. దావోస్ ఒప్పందాలతో గతేడాది తెలంగాణకు రూ.40,232 కోట్ల పెట్టుబడులు రాగా, ఈ సారి ఏకంగా 20 కంపెనీల ద్వారా 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తద్వారా సుమారు 50 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సరళీతర పారిశ్రామిక విధానం, క్లీన్ అండ్ గ్రీన్ పాలసీతోనే పెట్టుబడులు సాధ్యమయ్యాయని తెలిపారు.

ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీతో పెట్టుబడులను ఆకర్షించిందని వివరించారు. త్వరలో ఆర్‌ఆర్‌ఆర్, మెట్రో విస్తరణ పనులు చేపడుతుందని వెల్లడించారు. దావోస్ ఒప్పందాల్లో దిగ్గజ అమెజాన్ సంస్థ రూ.60 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నదని, ఒప్పందాల్లో ఇదే అతిపెద్దదని కొనియాడారు. కంపెనీ ద్వారా హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సర్వీసెస్ అండ్ డేటా సెంటర్లు ఏర్పాటు కానున్నాయని స్పష్టం చేశారు.

అలాగే సన్ పెట్రోల్ కెమికల్స్ కంపెనీ రూ.45,500 కోట్లు పెట్టుబడులు పెడుతుందని, తద్వారా 7 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.