calender_icon.png 18 November, 2024 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడి పర్యటనలు

05-08-2024 01:47:07 AM

కంపెనీలను ఆకర్షించటమే లక్ష్యంగా నేతల టూర్లు

దావోస్ పర్యటనతో రాష్ట్రానికి రూ. 40 వేల కోట్లు

ప్రస్తుతం సీఎం పర్యటన లక్ష్యం రూ.16 వేల కోట్లు

‘ఏఐ సిటీ’తో అగ్రశ్రేణి కంపెనీల ఏర్పాటుకు ఊతం

ఓఆర్‌ఆర్ వెంబడి 200 ఎకరాలు గుర్తింపు

సెప్టెంబర్‌లో ఏఐ సిటీ శంకుస్థాపనకు అవకాశం

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయ క్రాంతి): ఏ రాష్ట్రంలోనైనా విరివిగా ఉపాధి అవకాశాలు లభించాలంటే పరిశ్రమల స్థాపన జరగాలి. పారిశ్రామికాభివృద్ధి ద్వారా ఉపాధి కల్పనతోపాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను స్థాపనకు శరవేగంగా అడుగులు వేస్తున్నది.

దేశీయ, విదేశీ కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నది. అందులో భాగంగా గత జనవరిలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో అధికారుల బృందం హాజరైంది.

అనేక ప్రపంచ స్థాయి కంపెనీల ప్రతినిధులతో సమావేశమై తెలంగాణలోని వసతులు, వనరుల గురించి వివరించి వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగింది. దేశానికే తలమానికంగా నిలుస్తున్న హైదరాబాద్‌లో పరిశ్రమల స్థాపనకు అవ కాశా లుండటంతో కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందు కొచ్చాయి. 

‘ఏఐ సిటీ’ తో మరింత ఊతం

హైదరాబాద్ కీర్తి మరోసారి ప్రపంచవ్యాప్తం కాబోతోంది. ఇప్పటికే దేశంలోనే టాప్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్‌గా పేరు గాంచింది. మరిన్ని కంపెనీలను ఆకర్షించి, యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడంలో భాగంగా ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీని స్థాపించేందుకు ప్రణాళికలు రూపొందించింది. హైదరాబాద్‌ను భారతదేశానికి ఏఐ రాజధానిగా నిలపటమే లక్ష్యంగా సాగుతున్నది. 

సెప్టెంబర్‌లో ‘ఏఐ సిటీ’ శంకుస్థాపన

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించే ఏఐ సిటీకి సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేయనున్నది. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించే గ్లోబల్ ఏఐ సమ్మిట్ సందర్భంగా ఈ కార్యక్రమం ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పర్యటనలో భాగంగా అగ్రశ్రేణి గ్లోబల్ ఐటీ ప్రతినిధులను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి బృందం కలిసి ఏఐ సిటీలో పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. ప్రతిపాదిత ఏఐ సిటీలో వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, మొబిలిటీ వంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరమయ్యే అన్ని రంగాల కంపెనీల ఏర్పాటు అవకాశం ఉండబోతుంది.  

దావోస్ పర్యటన ఫలితాలు

వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా జరిగిన చర్చల అనంతరం హైదరాబాద్‌లో పెట్టుబడికి పలు పెద్ద కంపెనీలు ఆసక్తి చూపించా యి. అదానీ గ్రూప్, జేఎస్‌డబ్ల్యూ, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, బీఎల్ ఆగ్రో, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ9 సొల్యూషన్స్ తదితర కంపెనీలు పెట్టుబడులు పెడుతామని ప్రకటించాయి.

నియో ఎనర్జీ పెట్టుబడి 9 వేల కోట్లు

జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ అయిన జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ తెలంగాణలో రూ. 9000 కోట్ల పెట్టుబడితో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా 1,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి రానున్నది. 

రూ.1000 కోట్లతో కెమికల్ ప్లాంట్

ఖమ్మం జిల్లాలో మొదటి దశలో రూ.270 కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్‌ను గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేస్తోంది. మలేషియాకు చెందిన అతిపెద్ద పామాయిల్ కంపెనీ సిమ్ డార్బీతో గోద్రెజ్ జాయింట్ వెంచర్ కుదుర్చుకుంది.

ఈ రెండు కంపెనీల జాయింట్ వెంచర్‌గా దేశంలోనే మొదటి ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్ వాణిజ్య యూనిట్‌ను ఖమ్యంలో ఏర్పాటు చేస్తున్నాయి. ఏడాదికి 70 లక్షల మొక్కలను పెంచాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. దీంతో దాదాపు పది లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు అవుతుంది. దీంతోపాటు తెలంగాణలో రూ.1000 కోట్ల పెట్టుబడితో కెమికల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు గోద్రెజ్ అంగీకరించింది. 

రూ.5,200 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ డాటా సెంటర్

తెలంగాణలో డాటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్‌వర్క్స్ సంస్థ రూ.5,200 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నది. డాటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటెన్ అనుబంధ సంస్థ వెబ్‌వర్క్స్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది.

హైదరాబాద్‌లో 10 మెగావాట్ల నెట్ వర్కింగ్ డాటా సెంటర్‌లో ఇప్పటికే ఈ కంపెనీ రూ.1,200 కోట్లు పెట్టుబడి పెడుతోంది. దీనికి అదనంగా రూ.4,000 కోట్లకు పైగా పెట్టుబడులతో రాబోయే రోజుల్లో గ్రీన్‌ఫీల్డ్ హైపర్ స్కేల్ డాటా సెంటర్‌ను విస్తరించేందుకు ఈ ఒప్పందం చేసుకుంది. 

రూ.1400 కోట్లతో సిమెంట్ ప్లాంట్

అంబుజా సిమెంట్స్ కంపెనీ ఐదేండ్లలో రూ.1400 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 6 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేయగల ప్లాంటును స్థాపించనున్నది. 70 ఎకరాల్లో ఏర్పాటుచేసే ఈ ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 4000 మందికి ఉపాధి లభిస్తుంది. 

రూ.231 కోట్లతో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్

యూకేకు చెందిన ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ (ఎస్‌ఐజీహెచ్) హైదరాబాద్‌లో తమ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఇప్పటివరకు దేశంలో తయారు చేయని పలు సర్జికల్ పరికాలను ఇక్కడ తయారు చేస్తారు. రాబోయే రెండుమూడు ఏండ్లలో అందుకు అవసరమయ్యే రూ.231 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. 

200 ఎకరాలు గుర్తింపు

ఏఐ సిటీ కోసం ఇప్పటికే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) మహేశ్వరం, శేరిలింగంపల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి 200 ఎకరాల స్థలాన్ని గుర్తించింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అవి అమలుకు నోచుకోలేదు.

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా డిసెంబర్ 2023లో లక్నోలో ఏఐ సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కానీ అది ఇంకా గ్రౌండింగ్ కాలేదు. దీంతోపాటు ఏఐ సిటీ కోసం 40 ఎకరాల భూమిని మాత్రమే కేటాయించింది. ఇది 2030లో పూర్తవుతుందని అంచనా. కానీ హైదరాబాద్‌లోని ప్రతిపాదిత ఏఐ సిటీ లక్నోలో ఏర్పాటు చేసే దానికంటే ఐదు రెట్లు పెద్దది కావడం విశేషం. హైదరాబాద్‌లోని ఏఐ సిటీ 2028 నాటికి పూర్తి కానుంది. 

అదానీ గ్రూప్ పెట్టుబడి రూ.12000 కోట్లు

అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ రాబోయే ఐదేండ్లలో తెలంగాణలో రూ.5000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది. స్థానిక ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లను ప్రపంచస్థాయిలో పోటీపడే విధంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 600 మందికి ఉపాధి లభించనున్నది.

అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రూ.5000 కోట్లు పెట్టుబడితో కోయబెస్తగూడెంలో 850 మెగావాట్లు, నాచారంలో 500 మెగావాట్ల కెపాసీటీ గల రెండు పంప్డ్ స్టోరేజ్‌లను ఏర్పాటు చేయనుంది. అదానీ ఏరో స్పేస్ పార్క్ ద్వారా డిఫెన్స్ రిసెర్చ్, డెవలప్‌మెంట్, డిజైన్, మాన్యుఫాక్చరింగ్ యూనిట్లకు రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. దీని ద్వారా 1000 మందికి ఉపాధి లభిస్తుంది. 

అప్పుడు రూ.40 వేల కోట్లు.. ఇప్పుడు రూ.16 వేల కోట్లు

తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ఎన్నో అనుకూలతలు, ప్రభుత్వ పరంగా పారిశ్రామికవేత్తలకు కల్పించే వసతి సౌకర్యాలు, త్వరితగతిన అనుమతుల వంటి అంశాల కారణంగా పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందకు వచ్చారు. దావోస్ పర్యటనలో భాగంగా రెండు రోజుల్లోనే దాదాపు 60 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమై సుమారు రూ.40 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగారు.

వివిధ రంగాల్లో దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చించడం ఎంతో కలిసివచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఐటీ, లైఫ్ సైస్సెస్, వైద్య శాస్త్ర రంగాల్లో రూ.16 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లారు.  

రెండు, మూడోస్థాయి నగరాల్లో ఐటీ అభివృద్ధికి రూ.250 కోట్లు

వెల్‌స్పాన్ గ్రూప్ కంపెనీ భవిష్యత్‌లో చందన్ వ్యాలీ పారిశ్రామిక విభాగంలో ప్రారంభించిన ఐటీ సేవల్లో రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. టైర్ 2, టైర్ 3 సిటీల్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి పరిచి ప్రమోట్ చేసేందుకు వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని యువతకు ఐటీ ఉద్యోగాలను కల్పించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.