calender_icon.png 19 April, 2025 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడుల వెల్లువ

19-04-2025 01:41:07 AM

జపాన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి రెండోరోజు..

మొత్తం రూ.11వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు

  1. ఎన్‌టీటీ, నెయిసా సంయుక్త పెట్టుబడి రూ.10,500 కోట్లు
  2. హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు
  3. రుద్రారంలో రూ.562 కోట్లతో తోషిబా కొత్త ఫ్యాక్టరీ
  4. ఇప్పటికే ఉన్న రెండు ఫ్యాక్టరీలకు తోడు మరో ఫ్యాక్టరీతో సామర్థ్య విస్తరణ
  5. తెలంగాణ అభివృద్ధికి పెట్టుబడులతో తోడ్పడండి
  6. జపాన్ పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు సీఎం పిలుపు

* రాష్ర్టప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా, సింగిలోవిండో అనుమతులను ప్రభుత్వం అంది స్తోంది. వీటితోపాటు రాష్ర్టంలో ప్రతిభావంతులైన నిపుణులు అందుబాటులో ఉండటంతో ఏఐ సంబంధిత డిజిటల్ సేవల్లో రాష్ర్టం అగ్రగామిగా నిలుస్తున్నది.

 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి): డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలో పేరొందిన ఎన్‌టీటీ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ సంస్థ నెయిసా నెట్‌వర్క్స్ సంయుక్తంగా హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్ట ర్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి దాదాపు రూ.10,500కోట్ల పెట్టుబడితో ఈ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి.

టోక్యోలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం ఎన్‌టీటీ డేటా, నెయిసా నెట్‌వర్క్స్ నుంచి బోర్డు సభ్యుడు కెన్ కట్సుయామా, డైరెక్టర్ తడావోకి నిషిమురా, ఎన్‌టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్ ఇండియా ఎండీ అలోక్ బజ్‌పాయ్, నెయిసా సీఈవో, ఎన్టీటీ గ్లోబల్ డేటా చైైర్మన్ షరద్ సంఘీ ఈ ఒప్పందంలో పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో నిర్మించబోయే ఈ డేటా సెంటర్ క్లస్టర్ 400మెగావాట్లు, 25,000 జీపీయూలతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను సమకూరుస్తుంది. దేశంలో తెలంగాణను అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది.

ఎన్‌టీటీ డేటా, నెయిసా కంపెనీ సంయుక్తంగా ఏఐ -ఫస్ట్ సొల్యూషన్‌ను అభివృద్ధి చేసేందుకు ఈ క్లస్టర్ కొత్త ఆవిష్కరణల కేంద్రంగా అందరి దృష్టిని ఆకర్షించనుంది. 500మెగావాట్ల వరకు గ్రిడ్, పునరుత్పాదక విద్యుత్ మిశ్రమంతో ఈ క్లస్టర్ నిర్వహిస్తారు. లిక్విడ్ ఇమ్మర్షన్ వంటి అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీలను అవలంబిస్తారు.

ఈ ప్రాజెక్టును అత్యున్నత ఈఎస్‌జీ (ఎన్విరాన్‌మెంటల్, సోషల్, గవర్నెన్స్) ప్రమాణాలతో అభివృద్ధి చేస్తారు. ఈ క్యాంపస్ తెలంగాణలోని విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఏఐ ప్రతిభను పెంపొందిస్తుంది. రాష్ర్ట డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌కు దోహదం చేస్తుంది.

సింగిల్ విండో అనుమతులు..

ఈ భారీ పెట్టుబడుల ఒప్పందంపై సీఎం రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ర్టప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక వి ధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని అన్నారు. నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా, సింగిలోవిండో అనుమతులను ప్రభుత్వం అందిస్తోందన్నారు.

వీటితోపాటు రాష్ర్టంలో ప్రతిభావంతులైన నిపుణులు అందుబాటులో ఉండటంతో ఏఐ సంబంధిత డిజిటల్ సేవల్లో రాష్ర్టం అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఏడబ్ల్యూఎస్, ఎస్‌టీటీ, టిల్‌మన్ హోల్డింగ్స్, సీటీఆర్‌ఎల్‌ఎస్ వంటి పెద్ద కంపెనీల డేటా సెంటర్ ప్రాజెక్టుల వరుసలో ఎన్‌టీటీ భారీ పెట్టుబడుల ఒప్పందం ద్వారా దేశంలోనే ప్రముఖ డేటా సెంటర్ హబ్‌గా హైదరాబాద్ స్థానం మరింత బలపడిందని తెలిపారు. 

ఎన్‌టీటీ ప్రాముఖ్యం ఇది..

టోక్యోలో ప్రధాన కార్యాలయం కలిగిన ఎన్‌టీటీ డేటా, ఐటీ సేవలు, డేటా సెంటర్లు, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లో పేరొందిన కం పెనీ. 50 కంటే ఎక్కువ దేశాల్లో 1,93,000 మంది ఉద్యోగులతో, ప్రపంచంలోని టాప్ 3 డేటా సెంటర్ ప్రొవైడర్లలో ఈ కంపెనీ ఒక టి. పబ్లిక్ సర్వీసెస్, బీఎఫ్‌ఎస్‌ఐ, హెల్త్‌కేర్, మాన్యుఫాక్చరింగ్, టెలికాం వంటి రంగాలకు ఈ సంస్థ సేవలు అందిస్తుంది. నెయిసా నెట్‌వర్క్ ఏఐ -ఫస్ట్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ సంస్థ, నిర్దిష్ట ఏఐ కంప్యూట్ సొల్యూషన్‌ను అందించటంపై ఈ కంపెనీ దృష్టి సారిస్తుంది.

తోషిబా ఒప్పందంతో కొత్త ఉత్సాహం..

టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో తోషిబా కార్పొరేషన్ ఎనర్జీ బిజినెస్ డైరెక్టర్ హిరోషి కనెటా, రాష్ర్ట ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేశ్ రంజన్, టీటీడీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్  హిరోషి ఫురుటా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్థిక పరివర్తనలో దేశంలోనే తెలంగాణ ముందువరుసలో ఉందన్నారు.

కొత్త పెట్టుబడులకు తోషిబా చేసుకున్న ఒప్పందం పారిశ్రామిక రంగంలో కొత్త ఉత్సాహం ఇస్తోందని స్పష్టం చేశారు. టీటీడీఐ చైర్మన్ హిరోషి ఫురుటా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు తమను ఆకట్టుకున్నాయన్నారు. 

అద్భుతమైన భవిష్యత్ నిర్మిద్దాం..

ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం గల ప్రతిభ, స్థిరమైన విధానాలను ప్రజాప్రభుత్వం అందిస్తుందని జపాన్ వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. లైఫ్ సెన్సైస్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, టెక్స్‌టైల్స్, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. భారత్, జపాన్ కలిసికట్టుగా ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు.

సమావేశంలో భారత రాయబారి సీబీ జార్జ్ భారత్ మధ్య బలపడుతున్న ఆర్థిక సంబంధాల గురించి మాట్లాడారు. జెట్రో (జపాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్) బెంగళూరు డైరెక్టర్ జనరల్ తోషిహిరో మిజుటానీ మాట్లాడుతూ..తెలంగాణతో సహకారాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

దేశంలోనే మొదటి నెట్ జీరో ఇండస్ట్రియల్ సిటీగా హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ, దేశంలోనే అద్భుతంగా నిర్మించతలపెట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌పై ప్రచార వీడియోలను రాష్ర్ట ప్రభుత్వం ఈ వేదికపై ప్రదర్శించింది.

ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, టెక్స్ టైల్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో జపాన్ కంపెనీలకు తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, అవకాశాలను రాష్ర్ట వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ వివరించారు. రోడ్‌షో తర్వాత తెలంగాణ ప్రతినిధి బృందం, జపాన్‌లోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమైంది. 

తెలంగాణ స్వాగతం పలుకుతోంది..

తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందేలా తోడ్పడాలని జపా న్ పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. టోక్యోలోని హోటల్ ఇంపీరియల్‌లో జరిగిన ఇండి యా- జపాన్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ రోడ్‌షోలో తెలంగాణ అధికారిక బృం దం రాష్ర్టంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించింది. వివిధ రంగాలకు చెందిన దాదాపు 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..‘దేశంలోనే కొత్త రాష్ర్టం.. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న తెలంగాణ మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోంది..జపాన్‌ను ఉదయించే సూర్యుడి దేశం అని పిలు స్తారు. మా ప్రభుత్వ నినాదం ‘తెలంగా ణ రైజింగ్’. ఈరోజు తెలంగాణ జపాన్‌లో ఉదయిస్తోంది.

టోక్యో చాలా గొప్ప నగరం. ఇక్కడి మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్క రణలు అద్భుతం. జపాన్ ప్రజలు సౌమ్యులు, మర్యాదస్తులు, క్రమశిక్షణ కలిగినవారు. మీ నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నాను’ అని అన్నారు. 

రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ..

తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ టీటీడీఐ (ట్రాన్స్‌మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా) తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చాయి. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్ సమీపంలోని రుద్రారంలో టీటీడీఐ సర్జ్ అరెస్టర్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటుచేస్తుంది.

వీటితో పాటు పవర్ ట్రాన్స్‌ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్స్, గ్యాస్ ఇన్సులేటెడ్ స్విగేర్ (జీఐఎస్) తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి ఇప్పటికే అక్కడ ఉన్న ఫ్యాక్టరీలను అప్‌గ్రేడ్ చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌కు రూ.562 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు.

అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించే ఈ కొత్త ఫ్యాక్టరీ విద్యుత్ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. రుద్రారంలో ఇప్పటికే రెండు ఫ్యాక్టరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న టీటీడీఐ, ఈ కొత్త పెట్టుబడితో మూడో ఫ్యాక్టరీ నెలకొల్పనుంది. ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని విస్తరించనుంది.