calender_icon.png 31 October, 2024 | 4:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక లాభాల పేరుతో పెట్టుబడి

02-08-2024 01:47:58 AM

  1. బాధితులకు రూ.లక్షల్లో టోకరా 
  2. నిందితులను అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

ఎల్బీనగర్, ఆగస్టు 1: అధిక లాభాలు వస్తాయని ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో  అమాయకుల నుంచి నగదు దోచేస్తున్న సైబర్ నేరగాళ్లను రాచకొండ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రాచకొండ సైబర్ క్రైమ్ సీఐ కాశీవిశ్వనాథ్ తెలిపిన వివరాలు... హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న వంశీకృష్ణరావు తన స్నేహితులైన రాజేశ్, ఒడిశా కోరాపుట్ జిల్లా జైపూర్‌కు చెందిన ధవలేశ్వరపు నవీన్‌కుమార్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ఎట్టి ఫణికు మార్.. వాట్సాప్ నంబర్ల ద్వారా అమాయక ప్రజలను పరిచయం చేసుకుని టెలిగ్రామ్, ఆర్టీ సర్వే పేరుతో వాట్సాప్ గ్రూపులో యాడ్ చేసేవారు.

ఈ క్రమంలో నిందితులు బేగంపేటలోని హెచ్‌డీఎఫ్ బ్యాంకులో రాకేశ్ పేరుతో ఆర్టీ సర్వీసెస్ అనే ఖాతా తెరిచారు. ఎస్‌ఆర్‌నగర్ సమీపంలోని మధురానగర్‌లో కార్యాలయం ఏర్పాటు చేయగా.. నవీన్‌కుమార్, పణీకుమార్ టెలికాలర్లుగా అవతరమెత్తారు. ఆన్‌లైన్‌లో పెట్టుబడుల ద్వారా అధిక మొత్తంలో లాభాలు ఇస్తామని అమాకులను నమ్మించి.. వారితో పెట్టుబడి పెట్టించేవారు. మొదట్లో లాభాలు చూపించి, ఆపై లక్షల్లో పెట్టేలా వారిని ప్రేరేపించేవారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురి నుంచి ఆన్‌లైన్‌లో పెట్టుబడి పేరుతో దాదాపు రూ.25.16లక్షల వరకు నగదు తీసుకొని.. వారికి లాభాలు ఇవ్వకపోవడంతో బాధితులు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇలాంటి తరహా మోసాలపైనే గతనెలలో సీసీఎస్ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఆయా కేసుల్లో బాధితుల నుంచి మొత్తం రూ. 39లక్షల56వేల నగదును దోచుకున్నారు. అయితే పోలీసులు సకాలంలో స్పందించడంతో మొత్తం నగదును ఫ్రీజ్ చేశారు. ఆయా కేసుల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు గతనెల 24న వంశీకృష్ణారావు, రాజేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో పరారీలో ఉన్న నవీన్ కుమార్, ఫణికుమార్‌ను గురువారం అరెస్టు చేశారు. వీరి నుంచి లాప్‌ట్యాప్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.22 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. నిందితులు సుమారు 300 మందిని మోసం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.