24-01-2025 12:00:00 AM
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత పెట్టుబడులను ఆకర్షించడానికి దేశంలో ముందు వరుసలో ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలతో పోటీపడుతోంది. గత ప్రభుత్వ హయాంలో మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పెట్టుబడుల ఆకర్షణ కో సం ప్రయత్నాలు జరిగితే ప్రభుత్వం మారి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత పెట్టుబడుల ఆకర్షణకు ముఖ్యమంత్రి స్వయంగా చొరవ తీసుకోవటం జరుగుతోంది.
వివిధ దేశాల పర్యటనలకు వెళ్లటమే కాకుండా అంతర్జాతీయ సదస్సులలో తానే స్వయంగా పాల్గొ ని పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకోవటంతో గతంలోకంటే కూడా తెలం గాణ పెట్టుబడుల ఆకర్షణలో శరవేగంగా ముందుకెళుతోంది. సరళీకరణ ఆర్థిక విధానాలు ప్రారంభమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వా లే నేరుగా పెట్టుబడి సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్న నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు అభివృద్ధి కోసం, దేశీయ, విదేశీ పెట్టుబడుల కోసం పోటీ పడుతున్నాయి.
తెలంగాణ కూడా గత దశాబ్ద కాలంలో పెట్టుబడుల ఆకర్షణలో నాలుగో స్థానంలో నిలబడింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లోనే దావోస్‌లో జరిగిన 54వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనటం, మళ్లీ ఈ ఏడాది జనవరి 20 నుండి ప్రారంభమైన 55వ సదస్సులో పాల్గొని వేలకోట్ల పెట్టుబడి ఒప్పందాలు చేసుకోవటం శుభ పరిణామంగానే చూడాలి.
అడ్వాంటేజ్ హైదరాబాద్
మహారాష్ట్ర, గుజరాత్, బెంగాల్, తమిళనాడులాంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ పోటీ పడుతోంది. సహజంగా తెలంగా ణ వ్యవసాయక రాష్ట్రం కాబట్టి పారిశ్రామికంగా అభివృద్ధి చెందటానికి పెట్టుబడులను పెద్దఎత్తున ఆకర్షించగలగాలి. దేశంలో ఏ రాష్ట్రానికి లేని అడ్వాంటేజ్ హైదరాబాద్ రూపంలో తెలంగాణకు ఉంది. భౌగోళికంగా, మౌలిక వసతులపరంగా దేశంలో ఏ నగరానికి లేని సౌలభ్యతలు ఈ నగరానికి ఉన్నాయి.
కాబట్టే అమెజాన్ లాంటి అంతర్జాతీయ బహుళ జాతి సంస్థ తన ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకుం ది. దేశంలో ప్రతిష్ఠాత్మకమైన పెట్టుబడి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. సైబరాబాద్ నిర్మాణం తర్వాత అది పెట్టుబడులకు ఒక మైలురాయిగా మారింది. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా నిర్మించ తలపెట్టిన ఫోర్త్ సిటీ (నెట్ జీరో సిటీ) పెట్టుబడుల ఆకర్షణకు ఒక గమ్యస్థానంగా మారే అవకాశం కనిపిస్తుంది.
ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం పెట్టుబడిదా రులకు హామీ ఇస్తోంది కాబట్టి దీన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. హైదరాబాద్‌ను మూడు జోన్లుగా విభజించటం, ఫోర్త్ సిటీ నిర్మాణం, మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన, హైడ్రాతో సౌకర్యాల మెరుగుదల, మెట్రో విస్తరణతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచి నగరాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలనేది ప్రభుత్వ సంకల్పం.
గుజరాత్ ప్రభుత్వం ‘వైబ్రెంట్ గుజరాత్’ లాంటి కార్యక్రమం చేపట్టిన తర్వాత ఆ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. తెలంగాణ కూడా రాష్ట్రంలో పెట్టుబ డుల ప్రవాహానికి, పెట్టుబడుల ఆకర్షణకు వివిధ దేశాల పర్యటనలు, అంతర్జాతీయ వేదికలలో పాల్గొనడంతో పాటు ‘అడ్వాంటేజ్ హైదరాబాద్’ లాంటి కార్యక్రమాలను కూడా నిర్వహించాలి.
దావోస్‌తో మొదలై ...
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడుల సాధనే లక్ష్యం గా ‘ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ’ పేరుతో దావోస్‌లో జరిగిన 54వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొని వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో దాదాపు 40,252 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను కుదుర్చుకోవటం జరిగింది. తరువాత అమెరికా, దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా మరో 31,532 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి.
ప్రభుత్వం ఏర్పాటైన మొదటి సంవత్సరంలోనే దాదాపు రూ.72 వేల కోట్ల పెట్టుబడి ఒప్పందాలను వివిధ సంస్థలతో చేసుకోగలిగింది. జనవరి 20 నుండి దావోస్‌లో ప్రారంభమైన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకంటే ముందు పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటనలో భాగంగా హైదరాబాద్ లో ముచ్చర్ల మీర్ ఖాన్ పేటలో 3,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎస్టీ టెలి మీడియా గ్లోబల్ డేటా సెంటర్ ఏర్పాటు,
450 కోట్ల రూపాయలతో క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ఏర్పాటు చేసే ఐటి పార్కుకు సంబంధించిన పెట్టుబడి ఒప్పందాలు జరిగాయి. తెలంగాణలో సింగపూర్ సెమీ కండక్టర్ల ఇండస్ట్రీ అసోసియేషన్ కూడా సెమీ కండక్టర్ల యూనిట్లు నెలకొల్పటానికి ముందుకు రావడం శుభ పరిణామం.
పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ‘తెలంగాణ రైజింగ్’ పేరుతో దావోస్‌లో అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి బృందం మరొకసారి పెట్టుబడుల ఆకర్షణలో ఆశించిన స్థాయిలో ఒప్పందాలు చేసుకోగలిగిందనే చెప్పాలి.
సన్ పెట్రో కెమికల్స్ సంస్థతో 45,500 కోట్ల రూపాయలు, మేఘా ఇంజనీరింగ్ సంస్థతో 15 వేల కోట్ల రూపాయలు, కంట్రోల్- ఎస్ సంస్థతో 10 వేల కోట్ల రూపాయలు, జేఎస్‌డబ్ల్యూ యుఏవీతో 800 కోట్ల రూపాయలు, స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీతో 500 కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు, యూనిలీవర్ సంస్థ పామాయిల్ తయారీ యూనిట్, బాటిల్ క్యాప్ పరిశ్రమల ఏర్పాటుకు, టెక్నో సెంటర్ ఫైనాన్స్ సర్వీసెస్ లైఫ్ సైన్సెస్‌లలో పెట్టుబడులు పెట్టడానికి,
సాంబనోవా కంపెనీ సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి, జపాన్ ఎంటీఎల్ లాజిస్టిక్ ఎజిలిటీ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేయటం వలన రాష్ట్రానికి పెట్టుబడులు తద్వారా ఏఐ, ఐటీ, సెమీ కండక్టర్స్, డేటా సెంటర్స్, పంప్డ్ స్టోరేజ్, సోలార్ విద్యుత్, ఫార్మాలాంటి కీలక రంగాలలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కూడా లభించబోతున్నాయి. 2023 వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ రాష్ట్రం 21 వేల కోట్లు,
2024లో 40 వేల కోట్ల పెట్టుబడులను సాధిస్తే, 2025లో మాత్రం ఏకంగా లక్ష కోట్ల పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవటం గొప్ప విజయం గానే భావించాలి. లక్ష కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో సింగపూర్, దావోస్ పర్యటనలకు వెళ్లిన తెలంగాణ ప్రభుత్వ బృందం ఆ లక్ష్యసాధనలో విజయం సాధించినట్లుగానే కనపడుతోంది. పెట్టుబడుల సాధనలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో తెలంగాణ తన సత్తా చాటి ఆంధ్ర రాష్ట్రంపై పైచేయి సాధించిందనే చెప్పాలి.
సౌకర్యాల కల్పనపై దృష్టి
గత దశాబ్ద కాలంగా పెట్టుబడుల సాధనలో ప్రభుత్వం చూపిన చొరవ వలన పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల స్థాయిలోనే తెలంగాణ రాష్ట్రం కూడా పెట్టుబడులను సాధించగలిగింది. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులను సాధించడానికి హైదరాబాద్‌ను పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా హైదరాబాద్ స్థాయిని పెంచటానికి తన తొలి బడ్జెట్‌లోనే నగర అభివృద్ధికి పదివేల కోట్ల ను కేటాయించి ఖర్చు చేస్తోంది.
ఫోర్త్ సిటీ నిర్మాణం , పెట్టుబడిదారులకు అక్కడ సౌకర్యాలు కల్పించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం వివిధ అంతర్జాతీయ సంస్థల నుండి, వేదికలనుండి పెద్ద ఎత్తున పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను చేసుకోగలుగుతోంది కానీ ఆ ఒప్పందాల్లో చాలావరకు కార్యరూపం దాల్చడం లేదు. కాబట్టి ఆ పెట్టుబడులు కార్యరూపం దాల్చే విధంగా కృషి చేసినప్పుడే వాస్తవ లక్ష్యాలను చేరుకోగలుగుతాం.
తెలంగాణ ఏర్పడేనాటికి 5 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న రాష్ట్ర ఆదాయం 2024 నాటికి 14.64 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. అలాగే దేశ జీడీపీలో తెలంగాణ వాటా 3.8 శాతం నుండి 4.9 శాతానికి పెరిగింది. దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే నాటికి తెలంగాణ కూడా ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలన్నా, 2028 నాటికి 7 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టాలన్నా పెద్ద ఎత్తున పెట్టుబడులకు తెలంగాణ కేరాఫ్ ఆడ్రస్‌గా మారాలి.
వ్యాసకర్త సెల్: 9885465877